న్యాయశాఖలో ఉద్యోగాలకు 21 నుంచి కంప్యూటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2022-12-15T01:01:16+05:30 IST
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ అథారిటీ పరీక్షలు
చిత్తూరు, లీగల్, డిసెంబరు 14: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని న్యాయస్థానాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 21వ తేది నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ అథారిటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపిస్ట్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, అఫీస్ సబార్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మూడు విడతలుగా కంప్యూటర్ అథారిటీ పరీక్షలు జరుపుతామన్నారు. అభ్యర్థులకు చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి సమీపాన గల కేఎంఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సైన్స్ కళాశాల, తిరుపతి మండలం చెర్లోపల్లి జూపార్కు రోడ్డులోని అయాన్ డిజిటల్ జోన్, పుత్తూరులోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు ఉంటాయన్నారు. మొదటి దఫాగా ఉదయం 9 ఉంచి 10.30 వరకు, రెండో విడతగా మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, మూడో విడతలో సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉద్యోగాల విషయంలో ఇతరుల మాట నమ్మి మోసపోకూడదని చెప్పారు.