Chittoor: జగన్ సభకు రావాల్సిందే...లేదంటే...

ABN , First Publish Date - 2022-09-23T15:50:20+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) శుక్రవారం కుప్పంలో పర్యటించనున్నారు.

Chittoor: జగన్ సభకు రావాల్సిందే...లేదంటే...

చిత్తూరు (Chittoor): ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) శుక్రవారం కుప్పంలో పర్యటించనున్నారు.  సీఎం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ హోర్డింగులు.. మరో వైపు జగన్ ఫ్లెక్సీలు.. వైసీపీ రంగులతో సభ వేధికను నాయకులు ఆలంకరించారు. జన సమీకరణకు నాయకులు, అధికారులకు టార్గెట్లు పెట్టారు. ప్రధాన బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగానూ పక్క జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు 14 వందల బస్సులు నడుపుతున్నారు.


చిత్తూరులోని ప్రైవేట్ స్కూళ్ల బస్సులను రవాణాశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్లు శుక్రవారం సెలవు ప్రకటించాయి. సీఎం జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలను ఒక రోజు ముందు నుంచే హౌస్ అరెస్టు, బైండోవర్లు చేశారు. జనాల్ని తరలించే బాధ్యత వాలంటీర్లకు అప్పగించారు. సీఎం సభకు రాకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు.


సీఎం సభకు బస్సులు ఇవ్వలేదనే కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వివిధ కారణాలు చూపుతూ గురువారం పలు ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను సీజ్ చేసిన అధికారులు వాటిని ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. దీనిపై ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తనిఖీల పేరిట 60కి పైగా బస్సులను సీజ్ చేసి డీటీసీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు సీఎం సభకు హాజరు కాకుంటే రూ. 5వందలు జరీమాన విధిస్తామని చాటింపు వేశారు. బైరెడ్డిపల్లి మండలం, కంభంపల్లిలో ఈ  చాటింపు వేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సీఎం వస్తున్నారని ప్రతిపక్ష నేతలను బైండోవర్‌ చేశారు. దూర ప్రాంతాల తహసీల్దార్ల వద్దకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. కుప్పంలో టీడీపీ నేతల ఇళ్ల వద్ద కానిస్టేబుళ్లను కాపలా కూడా ఉంచారు. ఎప్పుడూ లేని విధంగా.. ప్రతిపక్షాలు బయటకు రాకూడదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలా కుప్పంలో శుక్రవారం నాటి సీఎం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ‘చేయూత’ లబ్ధిదారులకు మూడో విడత నగదు జమచేసేందుకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కనున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్య నియోజకవర్గమైన కుప్పంలో జరిగే సీఎం సభ నేపథ్యంలో టీడీపీ నేతలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడ నిరసన తెలుపుతారోనని కొందరిని ఇళ్లవద్దే హౌస్‌ అరెస్టులు చేశారు. మరికొందరిని బైండోవర్‌ చేసి నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం వంటి దూర ప్రాంతాల తహసీల్దార్ల వద్ద హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో కుప్పంలో బంద్‌ వాతావరణం నెలకొంది. మరోవైపు ఎటు చూసినా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు, చెట్లకూ పార్టీ రంగులేశారు.

Read more