Atchannaiduని కావాలనే ప్రభుత్వం అవమానించింది: Chinarajappa
ABN , First Publish Date - 2022-07-05T17:12:14+05:30 IST
అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కావాలనే రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడుని అవమానించిందని...

తిరుమల (Tirumala): అల్లూరి (Alluri) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu)ని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని మాజీ మంత్రి చినరాజప్ప (Chinarajappa) ఆరోపించారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ (AP)కి సంబంధించిన హామీలను ప్రధాని మోదీ (Modi) ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ మద్దతు కీలకం అయినప్పటికీ సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి డిమాండ్లు చేయకుండానే మద్దతు ప్రకటించడాన్ని చినరాజప్ప తప్పుపట్టారు.
భీమవరంలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమానికి... స్థానిక ఎంపీ హోదాలో రఘురామ కృష్ణరాజు అధ్యక్షత వహించాలి. కానీ... ప్రధాని కార్యాలయం (పీఎంవో) పంపిన ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరే లేదు! ‘అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మీ పార్టీ తరఫున ప్రతినిధిని పంపించండి’ అని కేంద్రం లిఖితపూర్వకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కోరింది. ఆయన సూచించిన మేరకు అచ్చెన్నాయుడుకు జాబితాలో చోటు దక్కింది.
కానీ... చివరి నిమిషంలో ఆ పేరు మాయమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తొలుత ఆహ్వానమే అందలేదు. తర్వాత... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొక్కుబడిగా ఫోన్ చేసి పిలిచారు. కానీ... పవన్ భీమవరం వెళ్లలేదు. వెరసి... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిట్టని వారెవరికీ ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించలేదు. ‘వాళ్లను పిలవొద్దు’ అని జగన్ కోరారు! ‘తథాస్తు’ అంటూ బీజేపీ పెద్దలు అంగీకరించారు! ప్రధాని మోదీ పర్యటనలో రాష్ట్రం నుంచి ఎవరెవరు పాల్గొనాలనే అంశంపై జగన్ ఒత్తిడికి కేంద్రం లొంగిపోయింది. తాను పిలిచిన అతిథులను కూడా ఆయన ఒత్తిడితో ఆహ్వానితుల జాబితా నుంచి తొలగించింది. ముందుగా నిర్ణయించిన అతిఽథులకు లిఖితపూర్వక ఆహ్వానాలు పంపి.. ఫోన్లు చేసి మరీ పిలిచిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ పరిణామంతో హతాశుడై మౌన ముద్ర వహించారు.
ఒక్కొక్కరుగా...: అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని కేంద్రం భావించింది. టీడీపీ వర్గాల కథనం ప్రకారం.. చంద్రబాబునే పిలవాలని మొదట అనుకున్నారు. కానీ ఆయన్ను పిలిస్తే తాను వచ్చేది లేదని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పడంతో టీడీపీ తరఫున ప్రతినిధిని పంపాలని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా చంద్రబాబును కోరారు. ప్రధాని వస్తున్న కార్యక్రమం కావడంతో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. తొలుత పంపిన ‘ప్రొటోకాల్’ జాబితాలో అచ్చెన్న పేరు కూడా ఉంది. ఆ తర్వాత మాయమైపోయింది. అచ్చెన్నాయుడికి ఈ సమాచారం తెలియక భీమవరం వచ్చారు. జాబితాలో తన పేరు తీసేసిన సంగతి తెలుసుకుని... కిషన్‌రెడ్డికి ఫోన్ చేశారు. తనకేమీ తెలియదని, కావాలంటే తన కార్లో కార్యక్రమానికి తీసుకెళతానని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. అధికారిక జాబితాలో నుంచి పేరు తీసివేసిన తర్వాత వస్తే బాగుండదంటూ అచ్చెన్న ఆగిపోయారు.