కుప్పంలో చిరుత కలకలం

ABN , First Publish Date - 2022-08-31T07:06:32+05:30 IST

కుప్పంలో చిరుత సంచారం కలకలం రేపింది.

కుప్పంలో చిరుత కలకలం
ఎక్స్‌కవేటర్‌లో నుంచి చిరుత కోసం చూస్తున్న అటవీశాఖ అధికారులు

తనకు కనిపించిందన్న ఆలయ పూజారి 

గాలించిన అటవీ శాఖ అధికారులు


కుప్పం, ఆగస్టు 30: కుప్పంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆలయంలో పూజారికి కనిపించిన చిరుత, అటవీ అధికారుల వెదకులాట తర్వాత అదృశ్యమైంది. ఆ తర్వాత ఎవరికీ కనిపించకున్నా ఆలయంలోకి వచ్చి వెళ్లిన చిరుత కాలి గుర్తులను బట్టి అటవీ శాఖాధికారులు నిర్ధారించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కుప్పం పట్టణం గుడుపల్లె రోడ్డులోని సోమేశ్వరాలయం తలుపు మంగళవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో పూజారి సేతురామన్‌ తెరిచారు. ఆ సమయంలో ఆలయం ముందు నవగ్రహాల సమీపంలో చిరుత సంచరించడం చూశారు. అలికిడికి బెదిరిన చిరుత, బాత్రూంల్లోకి దూరినట్లు ఆయన చెబుతున్నారు. వెంటనే తనకు తెలిసిన వారికి ఫోన్లు చేశారు. డీఆర్వో కృష్ణప్రసాద్‌ సిబ్బందితో కలిసి ఆలయంతోపాటు  పరిసర పొదలు, మైదాన ప్రాంతాల్లో గాలించారు. మైదాన ప్రాంతంలో ఒకట్రెండు చోట్ల చిరుత అడుగులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది,  మైదాన ప్రాంతంలో టపాసులు పేల్చారు. అయినా చిరుత జాడ కనిపించలేదు. తిరుపతి ఎస్వీ జూ పార్క్‌ రెస్క్యూ టీంకు డీఆర్వో సమాచారమిచ్చారు. చిరుత ఉన్నట్లు స్పష్టంగా తేలితేనే తాము వస్తామని వారు చెప్పారు. దీంతో మధ్యాహ్నం దాకా చిరుత కోసం వెదికారు. చిరుతను చూసిన వారున్నా, కాలి గుర్తులను బట్టి అటవీ అధికారులు నిర్ధారించినా, దాని జాడ  మంగళవారం సాయంత్రం వరకు కనిపించలేదు. చిరుత ఎక్కడుందో.. ఎటునుంచి దూకుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపై డీఆర్‌వో కృష్ణప్రసాద్‌ను వివరణ కోరగా... కాలి గుర్తులను బట్టి చిరుత వచ్చినట్లు తామూ భావిస్తున్నామని చెప్పారు. మళ్లీ మళ్లీ టపాసులు పేలుస్తామని.. ఒకవేళ ఇంకా ఆలయ పరిసరాల్లోనే ఉంటే చిరుత ఉనికి తెలుస్తుందన్నారు. లేదంటే అది పారిపోయి ఉండొచ్చన్నారు. ఒకవేళ చిరుత కనిపిస్తే బంధించడానికి ఎస్వీ జూపార్కు రెస్క్యూ టీం వస్తుందన్నారు. ఇప్పటికే బోనునూ సిద్ధం చేశామన్నారు.Read more