ఐదుగురు మోటార్‌ సైకిళ్ల దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-07-04T05:25:29+05:30 IST

రాత్రి పూట ఇళ్ల బయట పార్క్‌చేసి ఉంచిన మోటారు సైకిళ్లను చోరీ చేసే ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

ఐదుగురు మోటార్‌ సైకిళ్ల దొంగల అరెస్ట్‌
స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న డీఎస్పీ

రూ. 7.50 లక్షల విలువజేసే 15 బైక్‌ల స్వాధీనం

తిరుపతి(నేరవిభాగం), జూలై 3: రాత్రి పూట ఇళ్ల బయట పార్క్‌చేసి ఉంచిన మోటారు సైకిళ్లను చోరీ చేసే ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగలతో పాటు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను కరకంబాడి మార్గంలోని అలిపిరి ఔట్‌పోస్ట్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారి ఎదుట ప్రవేశపెట్టారు. ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ కథనం మేరకు.. తిరుపతి మారుతీనగర్‌కు చెందిన మట్లి రామకృష్ణ అలియాస్‌ నాని (21), తిరుపతి డీఆర్‌ మహల్‌ సమీపంలోని గాంధీపురానికి చెందిన పసుపర్తి హర్షవర్థన్‌ అలియాస్‌ జిలేబి (19), తిరుచానూరు పంచాయతీ పాడిపేట శ్రీపురానికి చెందిన ఆడమడుగుల రాజేష్‌ (21), చంద్రగిరికి చెందిన పాలపాటి అకిలేశ్వర్‌రెడ్డి (24), చిత్తూరు జిల్లా పీలేరు మండలం గుర్రంవారిపల్లెకు చెందిన రొంపిచర్ల హరిప్రసాద్‌ (24) చిన్పప్పటి నుంచే జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బుకోసం దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు తిరుపతి ఈస్ట్‌, ఎమ్మార్‌, పల్లి, అలిపిరి, శ్రీకాళహస్తి 1, 2 టౌన్‌, సూళ్లూరుపేట పోలీసు స్టేషన్ల పరిధిలో 15 మోటారు సైకిళ్లను చోరీ చేశారు. ఆదివారం అలిపిరి -జూపార్క్‌ రోడ్డులోని అరవింద కంటి ఆస్పత్రి వద్ద నిందితులు ఉన్నట్టు గుర్తించిన అలిపిరి సీఐ అబ్బన్న, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప, సిబ్బంది రవిరెడ్డి, ప్రసాద్‌, రాజశేఖర్‌ మరి కొందరితో కలిసి నిందితులను చట్టుముట్టి పట్టుకున్నారు. వారి నుంచి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.50 లక్షలు ఉంటుంది.  నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపనున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. 

Read more