నాడు కళకళ..నేడు వెలవెల
ABN , First Publish Date - 2022-10-17T07:36:04+05:30 IST
ఒకప్పుడు శుభకార్యాలతో కళకళలాడిన చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కల్యాణ మండపం నేడు కళావిహీనంగా మారింది.
కళావిహీనంగా చిత్తూరు షుగర్స్ కల్యాణ మండపం
ఏసీలు, వంటసామాన్లు మాయం
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం
చిత్తూరు, అక్టోబరు 16: ఒకప్పుడు శుభకార్యాలతో కళకళలాడిన చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కల్యాణ మండపం నేడు కళావిహీనంగా మారింది. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా మండపం ప్రహరీగోడను తొలగించడంతో రక్షణ లేకుండా పోయింది. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీకి అనుబంధంగా రైతుల ఉపయోగార్థం కల్యాణ మండపం నిర్మించారు. విశాలమైన పార్కింగ్ స్థలం, సువిశాలమైన డైనింగ్ హాల్, విశ్రాంతి గదులు, వివాహ వేదిక ఉండటంతో రైతులు, కార్మికులు, ప్రముఖుల పిల్లల వివాహాలు ఇక్కడే చేసుకునేవారు. ఆరు నెలల ముందు రిజర్వేషన్ చేసుకుంటేగాని ఈ కల్యాణ మండపం దొరికేది కాదు. షేర్హోల్డర్లకు, కార్మికులకు రూ.45వేలు, ఇతరులకు రూ.65 వే లు ధరను నిర్ణయించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ మూతపడడంతో పక్కనే ఉన్న కల్యాణ మండపంపై పర్యవేక్షణ కరువైంది. దానికితోడు చిత్తూరు-తిరుపతి ఫ్లైవోవర్ నిర్మాణంలో భాగంగా మండపం ప్రహరీ గోడను తొలగించారు. నష్ట పరిహారం వచ్చినా గోడ పునః నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం కల్యాణ మండపంలో పిచ్చి మొక్కలు మొలిచి మూగజీవాలకు అవాసంగా మారింది. రాత్రి వేళల్లో మందుబాబులు అక్కడే మద్యం తాగి, దారిన వచ్చిపోయే వారితో ఘర్షణకు దిగుతున్నారు.
వంట సామానులు మాయం
వేలాది మందికి వంట చేసే విధంగా కల్యాణ మండపంలో వంట సామగ్రిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం భ ద్రత లేని కారణంగా గ్రైండర్స్, మిక్సీలు, బకెట్లు, చాలా వరకు కుర్చీలు మాయమయ్యాయి. స్టౌ మాత్రమే దర్శనమిస్తోంది. మండపంలోని కొన్ని ఫ్యాన్లు, ఏసీలు, గీజర్లు కనిపించడం లేదు. మరికొన్ని ఉన్నా వైర్లతో వేలాడుతున్నాయి.
కలెక్టర్ స్పందిస్తేనే.. మండపానికి పూర్వ వైభవం
కల్యాణ మండపంలో వివాహాలు జరిగితే ఆ డబ్బంతా మండపం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఇటీవల నేషనల్ హైవే అధికారులు ప్రహరీ గోడ పున:నిర్మాణానికి ఇచ్చిన లక్షలాది రూపాయలు కూడా అకౌంట్లోనే ఉంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని కల్యాణ మండపాల్లో రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అద్దె పలుకుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలతో పాటు సెంటిమెంట్‌గా భావించే వారికి తక్కువ ధరతో ఈ కల్యాణ మండపం అందుబాటులో ఉంది. కలెక్టర్ హరినారాయణన్ చొరవ తీసుకుని దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు.