బండపల్లె ‘కొండ’ కరిగిపోతోంది..!

ABN , First Publish Date - 2022-03-05T07:01:01+05:30 IST

బండపల్లె ‘కొండ’ను పిండి చేస్తున్నారు.

బండపల్లె ‘కొండ’ కరిగిపోతోంది..!
మట్టిని తవ్వడంతో చదును భూమిగా మారిన గుట్ట

అక్రమంగా మట్టి తరలిస్తున్న వైసీపీ నేత

ఇప్పటికే ఐదెకరాలకుపైగా చదును 


చిత్తూరు, మార్చి 4: బండపల్లె ‘కొండ’ను పిండి చేస్తున్నారు. ఎక్స్‌కవేటర్ల సాయంతో గుట్టను తవ్వేస్తున్నారు. ఒకటి వెనుక మరొకటిగా.. టిప్పర్లతో మట్టిని తరలిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఐదెకరాలకుపైగా గుట్ట చదును అయిపోయింది. తన లేఅవుట్‌కు.. ఇతరుల అవసరాలకు ఈ మట్టిని సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నేత.. చదునైన స్థలంలో మామిడి మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

చిత్తూరు మండలంలోని బండపల్లె గుట్ట వద్ద సుమారు 2 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ లే అవుట్ల పక్కనే పెద్ద గుట్ట ఉండడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దానిపై కన్నేశారు. ఇటీవల చిత్తూరు నగరంలో భవన నిర్మాణాలు వేగం పుంజుకోవడంతో మట్టికి గిరాకీ పెరిగింది. నిర్మాణాల్లోని పల్లపు ప్రాంతాలను పూడ్చడానికి, కడగాలును నింపడానికి చెరువుల మట్టిని ఉపయోగించేవారు. ఇటీవల వర్షాలు సమృద్ధిగా పడటంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ప్రత్యామ్నాయంగా కొండ మట్టి గట్టిగా ఉండటంతో దీనికి గిరాకీ పెరిగింది. దాంతో నగరాన్ని ఆనుకుని ఉన్న కొండ గుట్టలపై అక్రమార్కులకు కన్నుపడింది. ఈ గుట్ట నగరానికి సమీపంలో ఉండటంతో రవాణా, ఇతర ఖర్చులు కూడా తక్కువ. దీంతో బండపల్లె గుట్ట మట్టిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తవ్వేస్తున్నారు. చిత్తూరు నగరంలోని భరత్‌నగర్‌లో ఆయన వేసిన లే అవుట్‌.. లోతట్టుగా ఉంది. అక్కడ సుమారు 15 అడుగుల వరకు మట్టిని నింపితే అధిక ధరలకు ప్లాట్లు అమ్ముడుపోతుందని భావించిన ఆ నేత అధికారాన్ని ఉపయోగించి బండపల్లె కొండను పిండి చేస్తున్నారు. 20 రోజులుగా ఎక్సవేటర్ల సాయంతో రోజుకు వంద టిప్పర్ల వంతున లే అవుట్‌కు మట్టి తరలిస్తున్నారు. ఇంకా నెల రోజుల పాటు మట్టి తోలితే లే అవుట్‌కు సరిపోతుందని సమాచారం. తన లేఅవుట్‌కు తోలడంతో పాటు ఓ టిప్పర్‌ మట్టిని రూ.6500 చొప్పున బయట విక్రయిస్తున్నారు. ఇలా కొండను చదును చేసేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఐదు ఎకరాల వరకు కొండను చదును చేసిన ఈ నేత.. ఆ స్థలంలో మామిడి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారమంతా చిత్తూరుకు చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతోనే సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. 



Updated Date - 2022-03-05T07:01:01+05:30 IST