మళ్లీ బాదుడు
ABN , First Publish Date - 2022-08-04T06:27:34+05:30 IST
విద్యుత్తు వినియోగదారులపై మరోసారి భారం పడనుంది. 36 నెలల పాటు భారం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. 2014-19 మధ్యకాలంలో విద్యుత్తు వినియోగానికి సంబంధించి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఒక్కో యూనిట్‌కు 23 పైసలు చొప్పున వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ ఎస్పీడీసీఎల్కు అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై నెలకు సగటున రూ.8.28 కోట్ల భారం పడనుంది. ఈ లెక్కన 36 నెలలకు రూ.298.08 కోట్లను అదనంగా వసూలు చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి అందించే బిల్లులో ట్రూఅప్ ఛార్జీలను కలిపి జారీ చేస్తున్నారు.
ఏకంగా 36 నెలల పాటు ట్రూ అప్ ఛార్జీలు
ఈ నెల ఇచ్చే బిల్లులతోనే కలిపి వసూలు
ఉమ్మడి జిల్లా ప్రజలపై రూ.298 కోట్ల భారం
అద్దె ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి దారుణం
చిత్తూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు వినియోగదారులపై మరోసారి భారం పడనుంది. 36 నెలల పాటు భారం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. 2014-19 మధ్యకాలంలో విద్యుత్తు వినియోగానికి సంబంధించి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఒక్కో యూనిట్‌కు 23 పైసలు చొప్పున వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ ఎస్పీడీసీఎల్కు అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై నెలకు సగటున రూ.8.28 కోట్ల భారం పడనుంది. ఈ లెక్కన 36 నెలలకు రూ.298.08 కోట్లను అదనంగా వసూలు చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి అందించే బిల్లులో ట్రూఅప్ ఛార్జీలను కలిపి జారీ చేస్తున్నారు.
ఎలా వడ్డిస్తున్నారంటే?
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు అయిదేళ్ల కాలంలో వినియోగించిన మొత్తం విద్యుత్తుకు యూనిట్‌కు 23 పైసలు వంతున ట్రూఅప్ ఛార్జీలను లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని ప్రస్తుత నెల నుంచి 36 నెలల పాటు సర్దుబాటు పేరిట వడ్డించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు నెల నుంచే బిల్లులు జారీ అవుతున్నాయి.
గతేడాది వెనక్కి తగ్గినా..
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ట్రూ అప్ ఛార్జీలను అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా అప్పట్లో కొందరు వినియోగదారులు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూఅప్ ఛార్జీలను గత ఏడాది నవంబరులో రెవెన్యూ జర్నల్ ద్వారా సర్ చార్జీలతో పాటు బిల్లుల్లో తిరిగి జమ చేసింది. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితో సైలెంట్‌గా మరోసారి ప్రభుత్వం ట్రూఅప్ చార్జీల వసూళ్లకు పాల్పడుతోంది.
ఉమ్మడి జిల్లాపై రూ.8.28 కోట్ల భారం
ఉమ్మడి జిల్లాలో 18.58 లక్షల అన్ని రకాల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఏడు విద్యుత్తు డివిజన్లలో రోజుకు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నారు. అన్ని రకాల కేటగిరీల వినియోగారులకు ట్రూఅప్ ఛార్జీలు వేస్తున్నారు. నెలకు రూ.8.28 కోట్ల భారం ఉమ్మడి జిల్లా ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీల రూపంలో పడుతోంది. ఈ విధంగా వచ్చే 2025 ఆగస్టు వరకు వసూళ్లకు ఎస్పీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.8.28 కోట్ల చొప్పున ఏడాదికి రూ.99.36 కోట్లు, మూడేళ్లకు రూ.298.08 కోట్లను వసూలు చేయనున్నారు.
నష్టాలను పూడ్చుకోవడానికే..
విద్యుత్తు పంపిణీ సంస్థ నష్టాలను పూడ్చుకోవడానికి బాదుడు మొదలుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్తు ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ చర్యను వినియోగదారులు మరచిపోకముందే మరో బాదుడును చేపట్టింది. మధ్య తరగతి ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, ఇతరత్రా ఛార్జీల పెంపుతో అల్లాడిపోతుండగా ప్రస్తుతం ట్రూఅప్ ఛార్జీల బాదుడు మరింత భారంగా ఉండనుంది. ఇదేదో ఒక నెలతో పోయే వ్యవహారం కాకుండా 36 నెలల పాటు వరుసగా బాదనుండడం సమస్యగా మారింది.
అద్దె ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి దారుణం
సొంతింట్లో ఉన్న వారి కంటే అద్దె ఇళ్లల్లో ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉండనుంది. 2014-19 మధ్యకాలంలో ఎవరో వినియోగించిన విద్యుత్తుకు ఇప్పుడు తాము ట్రూ అప్ ఛార్జీలు ఎలా చెల్లించాలని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ఇంటి యజమానులు కూడా పట్టించుకోవడం లేదు. ట్రూఅప్ ఛార్జీలను ప్రస్తుతం అద్దెకు ఉన్నవారే చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
నగరి మండలం ఎం.కొత్తూరు గ్రామానికి చెందిన రామ్మూర్తికి (సర్వీసు నెంబరు: 5312411000927) ఈ ఏడాది మార్చి వరకు విద్యుత్తు బిల్లు రూ.370 మించేది కాదు. ఏప్రిల్‌లో ఛార్జీలు పెరిగాక రూ.500 వరకు బిల్లు వస్తోంది. తాజాగా రూ.525 బిల్లు రాగా, ఇందులో ట్రూఅప్ ఛార్జెస్ పేరుతో రూ.35 వడ్డించారు.
వి.కోట పట్టణానికి చెందిన మునెప్పకు (సర్వీసు నెంబరు: 5622500005798) ఈ ఏడాది మార్చి వరకు రూ.400 లోపు విద్యుత్తు బిల్లు వచ్చేది. ఏప్రిల్‌లో ఛార్జీల పెంపు తర్వాత ఆ బిల్లు కాస్త రూ.600 అయ్యింది. తాజాగా ఆగస్టు నెల బిల్లు రూ.1,297 వచ్చింది. ఇందులో ట్రూఅప్ ఛార్జీ పేరుతో రూ.51.71 వడ్డించారు. ఏళ్లుగా ఇంట్లో ఒకే రకంగా విద్యుత్తును వినియోగిస్తున్నా బిల్లుల్లో ఇంత తేడాలు రావడం ఏంటో అర్థం కావడం లేదని వినియోగదారుడు ఆవేదన చెందుతున్నాడు.