తిరుమలలో ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-12-31T02:02:30+05:30 IST

వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లను టీటీడీ దాదాపు పూర్తి చేసింది.

తిరుమలలో ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి
వైకుంఠ మండపం ఏర్పాట్లు - లోపల పుష్పాలంకరణ

తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లను టీటీడీ దాదాపు పూర్తి చేసింది. అత్యధిక సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఏకాదశి, ద్వాదశిరోజుల్లో మాత్రమే ఉండే వైకుంఠద్వార దర్శనాలను 2020 నుంచి పదిరోజుల పాటు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండుసార్లు పదిరోజుల పాటు నిర్వహించిన వైకుంఠద్వార దర్శనాల సమయంలో కొవిడ్‌ కారణంగా భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొవిడ్‌ ఆంక్షలు లేకపోవడంతో రోజుకు దాదాపు 80వేల చొప్పున పదిరోజుల పాటు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ.. టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను జనవరి ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి జారీ చేయనుంది. ఇందుకోసం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, ఇందిర మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, బైరాగిపట్టెడ రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లె జడ్పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద దాదాపు వంద కౌంటర్లను ఏర్పాటు చేశారు.

10 టన్నుల పుష్పాలతో ముస్తాబుకానున్న కొండ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కొండ దాదాపు 10 టన్నుల పుష్పాలంకరణలో సిద్ధం కానుంది. వివిధ ప్రాంతాలను నుంచి తీసుకురానున్న సంప్రదాయ పుష్పాలతో శ్రీవారి ఆలయం మొదలుకొని వెలుపల ప్రాంతాలను అలంకరించనున్నారు. ప్రత్యేకించి శ్రీవారి ఆలయంలో మాత్రమే ఐదు టన్నుల పుష్పాలను అలంకరణలకు వినియోగించనున్నారు. ధ్వజస్తంభం, బలిపీఠం, ఉత్తరద్వారం లోపల లక్ష కట్‌ప్లవర్స్‌తో అలంకరణ చేస్తారు. ఒకటో తేదీ రాత్రికి ఏర్పాట్లు పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

ఆలయం ముందు ‘వైకుంఠ మండపం’

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎప్పటిలానే టీటీడీ ఉద్యాన విభాగం శ్రీవారి ఆలయం ముందు ‘వైకుంఠమండపం’ సిద్ధం చేస్తోంది. దాదాపు 30 మంది నిపుణులతో జరుగుతున్న ఈమండపం నిర్మాణం పనులు శనివారంతో పూర్తికానున్నాయి. మండపంలో రంగనాథస్వామితో పాటు, దశవతారాలు, అష్టలక్ష్మీ ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 30వేల కట్‌ప్లవర్స్‌లను అలంకరణలకు వినియోగిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనం అనంతరం భక్తులు ఈమండపాన్ని సందర్శించేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

దర్శన టోకెన్‌ ఉన్నవారే తిరుమల బస్సెక్కాలి

తిరుపతి(కొర్లగుంట),డిసెంబరు30 ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకొని శ్రీవారి దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు అనుమతిస్తామని ప్రజా రవాణాధికారి చెంగల్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధన 2 నుంచి 11తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. టీటీడీ ఇప్పటికే టోకెన్‌ ఉన్నవారికి మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని ప్రకటించినట్లు గుర్తు చేశారు.

Updated Date - 2022-12-31T02:02:31+05:30 IST