పాఠశాలల్లో యాప్‌ల గోల..!
ABN , First Publish Date - 2022-08-19T05:31:59+05:30 IST
పుస్తకాలు చేతపట్టి, పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు.. సెల్ఫోన్లు పట్టుకుని ఫొటోలు తీస్తూ యాప్‌లలో అప్లోడ్ చేసేందుకు అవస్థలు పడుతున్నారు.

ఇప్పటికే వినియోగంలో 13.. తాజాగా ముఖ హాజరు యాప్
చిత్తూరు (సెంట్రల్), ఆగస్టు 18: పుస్తకాలు చేతపట్టి, పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు.. సెల్ఫోన్లు పట్టుకుని ఫొటోలు తీస్తూ యాప్‌లలో అప్లోడ్ చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలనే ఆదేశాలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాల స్థాయిలో ప్రస్తుతం 13 రకాల యాప్‌లను రోజువారీ వినియోగిస్తున్నారు. ఐఎంఎంఎస్ యాప్, స్టూడెంట్ యాప్, జగనన్న విద్యాకానుక యాప్, దీక్షా యాప్, అకడమిక్ మానిటరింగ్ యాప్, రీడ్ ఏ లాంగ్ యాప్, ఏసీపీఎల్ ఎఫ్ఎం 220 ఆర్డీ యాప్, కన్సి్సటెంట్ రిథమ్స్ యాప్, స్కూల్ అటెండెన్స్ యాఫ్, మంత్ర ఆర్డీ యాప్, ఏపీ టెల్స్ యాప్, ఎంబీఎన్‌ఎన్ యాప్, బేస్ లైన్ టెస్ట్ యాప్ ఇలా 13 రకాలైన యాప్‌లు పాఠశాలలు వినియోగిస్తున్నారు. తాజాగా ముఖ హాజరు యాప్‌ను వినియోగించడంపై మూడు రోజులుగా పాఠశాలల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత మొబెల్ ఫోన్ వినియోగించి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
యాప్‌పై తీవ్ర ప్రతిఘటన
ఫేస్ రికగ్నిషన్ యాప్‌పై ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. జిల్లాలో 2913 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8268 మంది ఉపాధ్యాయుల ఉన్నారు. తొలిరోజైన మంగళవారం 52 శాతం మంది యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోగా, 13 శాతం మంది హాజరు నమోదు చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో బుధ, గురువారాల్లో యాప్‌ను ఉపాధ్యాయులు వారి మొబైల్లో అన్ఇన్స్టాల్ చేశారు. దీంతో ఈ రెండు రోజుల పాటు అటెండెన్స్ మ్యానువల్‌గానే సాగుతోంది.
నెలాఖరు వరకు శిక్షణ
ముఖ హాజరు యాప్ వినియోగంపై నెలాఖరు వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై జిల్లా స్థాయి అధికారులకు మౌఖిక అదేశాలు వచ్చాయి. వ్యక్తిగత మొబైల్ ద్వారానే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వేయించడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గక పోగా, ఉపాధ్యాయ సంఘాలూ అదేస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి.
త్వరలో బేస్‌లైన్ టెస్టు ఫలితాలు
గత నెల 22 నుంచి 25వ తేది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టు నిర్వహించారు. తెలుగు, ఇంగ్లీషు, గణితం మూడు సబ్జెక్టుల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను లెక్కకట్టేందుకు నిర్వహించిన పరీక్షల ఫలితాలపై విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 1,67,360 మంది విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్షలు నిర్వహించగా, 2-5 తరగతుల వరకు 74,643 మంది, 6 నుంచి టెన్త్ వరకు 91,717 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీటి ఫలితాలను యాప్‌లో టీచర్లు నమోదు చేస్తున్నారు. ఆపై రెమిడియల్ తరగతులు నిర్వహించిన అనంతరం విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా ఆయా సబ్జెక్టు టీచర్లపై చర్యలు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపైనా ఉపాధ్యాయుల్లో ఆందోళన, ఒత్తిడి పెరుగుతోంది.