అధికార అరాచకీయం

ABN , First Publish Date - 2022-12-31T01:51:18+05:30 IST

దబాయింపు పాలనకు 2022 కూడా సాక్షీభూతంగా నిలిచింది. గెలిపించడం అంటే దౌర్జన్యాలకు ఇచ్చిన లైసెన్సులా వైసీపీ పాలన సాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. నిరసన తెలిపితే అరెస్టు అంటున్నారు. ప్రతిపక్షాలు గొంతెత్తకుండా తెగబడి కొడుతున్నారు.

అధికార అరాచకీయం

తిరుపతి, ఆంధ్రజ్యోతి: దబాయింపు పాలనకు 2022 కూడా సాక్షీభూతంగా నిలిచింది. గెలిపించడం అంటే దౌర్జన్యాలకు ఇచ్చిన లైసెన్సులా వైసీపీ పాలన సాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. నిరసన తెలిపితే అరెస్టు అంటున్నారు. ప్రతిపక్షాలు గొంతెత్తకుండా తెగబడి కొడుతున్నారు. బెదరగొట్టి, భయపెట్టి, భీతావహం సృష్టించడమే వ్యూహంగా సాగుతున్న అధికార పార్టీకి పోలీసు వ్యవస్థ సాగిలపడి సంపూర్ణ సహకారం అందించడమే విచిత్రం. తిరుపతి జిల్లాలో 2022లో జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు నిదర్శనం. ఇక వెళ్లిపోతున్న ఏడాది వైసీపీకి పెద్ద ఉత్సాహాన్ని ఇవ్వలేకపోగా, టీడీపీ, జనసేనల్లో జోష్‌ను పెంచింది. అభివృద్ది పనులే జరగని ఏడాదిలో గడపగడపలో వైసీపీకి నిరసనలు ఎదురయ్యాయి. ప్రజా సమస్యలపై టీడీపీ, జనసేన, వామపక్షాలు పోరాటంలో దూకుడు పెంచాయి. 2022 రాజకీయ ముద్రలు ఇవీ...

ఏప్రిల్‌ 30: శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై దాడి

శ్రీకాళహస్తికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడిపై పట్టణంలో దాడి జరిగింది. ఆయన ఉన్న కారుపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.నడిరోడ్డుమీదే ఆయనను కొట్టా రు. ముక్కంటి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుడు బుల్లెట్‌ జయశ్యామ్‌ తన అనుచరులతో కలిసి ఈ దాడి చేశారు. బొజ్జల సుధీర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా క్రియాశీలంగా ఉన్న చలపతి నాయుడిపై దాడి చేస్తే సాధారణ కార్యకర్తలు భయపడి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారనే వ్యూహంతోనే ఇం దుకు తెగబడ్డారని ప్రచారం జరిగింది.

జూన్‌ 15: గంజాయి కేసుతో భయపెట్టే కుట్ర

టీడీపీలోకి భారీ హంగామాతో ఒక యువకుడి చేరికలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు లక్ష్మణ్‌, వీఎం పల్లి దళితవాడకు చెందిన రామకృష్ణ, వెంకయ్యలపై పోలీసులు గంజాయి కేసు పెట్టారు. తప్పుడు కేసు అంటూ బొజ్జల సుధీర్‌రెడ్డి ఆందోళనకు దిగి జాతీయ రహదారిపై బైఠాయించడంతో గంజాయి పరిమాణం తగ్గించి నోటీసు ఇచ్చి వారిని పంపేశారు.

జూలై 3: కొట్టి కేసులు పెట్టారు

పుత్తూరు పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీలు తొలగించాలని వైసీపీ నాయకులు గొడవకు దిగారు. వాటిని తొలగించకుండా టీడీపీ నాయకులు రవికుమార్‌, షణ్ముఖరెడ్డి అడ్డుకోవడంతో వైసీపీ నేతలు టీడీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. దాడికి గురైన టీడీపీ నాయకులపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు కూడా పెట్టించారు.

అక్టోబరు 22: చంద్రగిరిలో రౌడీషీట్‌లే తెరిచారు

సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రిని, వైసీపీ నేతలనూ విమర్శిస్తూ పోస్టింగులు పెట్టారంటూ చంద్రగిరి మండలానికి చెందిన టీడీపీ నేతలు భానుప్రకా్‌షరెడ్డి, రాకేష్‌ చౌదరి, యశ్వంత్‌ చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. బెయిల్‌ తెచ్చుకున్న వారి మీద రౌడీ షీట్‌ తెరిచారు. వీరిలో భానుప్రకా్‌షరెడ్డి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఆగస్టు 17: నాయుడుపేటలో నాన్‌బెయిలబుల్‌ కేసు

వినాయక చవితి చందాల వివాదంలో పోలీసు మెట్లు ఎక్కిన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ పోలీసుల మీద ఆరోపణ చేసిన పట్టణ టీడీపీ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దార్ల రాజేంద్ర మీద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదైంది. టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్న రాజేంద్రపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్పటికే ఆరు కేసులు నమోదు కాగా ఇది ఏడవ కేసు. వైసీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు ఇలా చేశారని గుప్పుమంది.

నవంబరు 11: రోజాపై విమర్శలు చేశారని...

మంత్రి రోజాపై తరచూ మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేసే జనసేన నాయకుడు కిరణ్‌ రాయల్‌ను తిరుపతి పోలీసులు తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో మరుసటి రోజు నగరి కోర్టులో హాజరుపరిచారు. బెయిల్‌ మీద ఆయన విడుదలయారు. ఆయన ఫోన్‌లను కోర్టు నుంచే పోలేసులు తీసుకెళ్లిపోయారు. వాటిలోంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలు చూసి కోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నవంబరు 12: సొంత పార్టీ అయినా వదల్లేదు

వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో సచివాలయ భవనాన్ని మంత్రి రోజా ప్రారంభించే కార్యక్రమం ఖరారైంది. వైసీపీకే చెందిన ఆ మండల జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి తండ్రి ఆ భవనాన్ని నిర్మించారు. తమకు బిల్లులు పెండింగ్‌ వున్నాయని, వాటిని చెల్లించాకే ప్రారంభోత్సవం జరపాలని జడ్పీటీసీ భవన గేటుకు తాళం వేశారు. పోలీసులు బలవంతంగా జడ్పీటీసీని అదుపులోకి తీసుకుని గాజులమండ్యం స్టేషన్‌కు తరలించారు. మంత్రి ప్రారంభోత్సవం చేసి వెనుదిరిగాక గానీ ఆయన్ను పోలీసులు విడిచిపెట్టలేదు.

Updated Date - 2022-12-31T01:51:20+05:30 IST