ఆమంచర్ల హనుమంతరావు 98
ABN , First Publish Date - 2022-08-14T06:33:00+05:30 IST
గాంధీని దగ్గరగా చూశారు.నేతాజీ సుభాష్ చంద్రబో్సతో కరచాలనం చేశారు. పోలీసు కాల్పుల్లో కాల్లో తూటా దిగినా వెనకడుగు వేయకుండా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు ఆమంచర్ల హనుమంతరావు

తిరుచానూరుకు చెందిన ఆమంచర్ల హనుమంతరావు 1924వ సెప్టెంబరు 16న నెల్లూరులో జన్మించారు.వీఆర్ కాలేజీలో ఇంటర్ చదువుకుంటుండగా స్వాతంత్య్ర పోరాటం గురించి తెలిసింది.దేశం దాస్యంలో మగ్గిపోతోంది. నేతలంతా శక్తివంచన లేకుండా స్వతంత్ర సమరంలో పాల్గొంటున్నారు. గాంధీ, నెహ్రూ, నేతాజీ ప్రసంగాలు ప్రజల్లో పోరాడే శక్తిని పెంపొందిస్తున్న కాలం. విద్యార్థులు కూడా దేశం కోసం పోరాడాలనే నినాదం అంతటా వినిపించడంతో హనుమంతరావు కూడా స్వాతంత్ర్యోద్యమంలో పనిచేయడం ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా వీధుల్లోకి రావడంతో అరెస్టు చేశారు. ఆరేడుమాసాలు జైల్లో ఉన్నారు. విడుదలయ్యాక మళ్లీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 1944 ప్రాంతంలో గాంధీ రైల్లో మద్రాసు వెళుతున్నారని తెలిసి సహ విద్యార్థులతో కలసి నెల్లూరు రైల్వేస్టేషన్లో ఎదురు చూశారు. గాంధీ రైలు పెట్టెలోనుంచే ప్రసంగించారు. 1939లో ఒకసారి సుభాష్ చంద్రబోస్ కూడా కలకత్తా నుంచి హౌరా మెయిల్లో మద్రాసు వెళుతున్నట్లు తెలిసి విద్యార్ధులమంతా పెద్దసంఖ్యలో స్టేషన్ చేరుకుని, స్టేషన్ మాస్టరును రైలు కొంతసేపు ఆపాలని విజ్ఞప్తిచేశారు. తరువాత నేతాజీ వచ్చారు. అందరితో కరచాలనం చేశారు. ఆయన ప్రసంగం హనుమంతరావుతో పాటు అక్కడున్న అందరినీ ఉత్తేజితుల్ని చేసింది.హనుమంతరావు తండ్రి రామారావు కూడా ఉద్యోగం వదిలిపెట్టి స్వతంత్ర సమరంలో పనిచేసి జైలుకు వెళ్లారు. తరువాత కాలంలో జడ్జిగా పనిచేసిన తమ్ముడు గంగాధరరావు కూడా హనుమంతరావుతో పాటే పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. నెల్లూరులో ఒకసారి నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఒక తూటా హనుమంతరావు కుడికాలులో దిగింది. అయినా వెనకడుగువేయలేదు.ఏడాదిన్నర అజ్ఞాతంలో ఉన్నాక బయటకొచ్చారు. ప్రకాశం పంతులుతో దగ్గరగా పనిచేశారు.ఆయన మరణసమయంలో పక్కనే వున్నారు. గత 40 యేళ్లుగా తిరుచానూరులో ఉంటున్నారు.
- తిరుపతి కల్చరల్