ప్రేమపెళ్లిని ఒప్పుకోని పెద్దలు

ABN , First Publish Date - 2022-10-07T05:30:00+05:30 IST

ఓ ప్రేమ వివాహం యువకుడి ఇంటి విధ్వంసానికి దారి తీసింది

ప్రేమపెళ్లిని ఒప్పుకోని పెద్దలు
మోహన్‌కృష్ణ ఇంటిలో ధ్వంసం చేసిన ఫర్నిచర్‌

అర్ధరాత్రి అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన కుటుంబ సభ్యులు


పోలీసులను ఆశ్రయించిన యువజంట

 చంద్రగిరి, అక్టోబరు 7: ఓ ప్రేమ వివాహం యువకుడి ఇంటి విధ్వంసానికి దారి తీసింది.పోలీసుల కథనం మేరకు.....చంద్రగిరి మండలం,బుచ్చినాయుడుపల్లె పంచాయతీ పరిధిలోని మోహన్‌రెడ్డి కాలనీకి చెందిన జయంతి కుమారుడు మోహన్‌కృష్ణ ఫిజియో థెరపీ కోర్సు చేశాడు.గుంటూరుకు చెందిన శ్రీనివాస్‌, ఝాన్సీ దంపతుల కుమార్తె సుష్మ తిరుపతిలో ఎంబీబీఎస్‌ చదువుతున్న క్రమంలో మోహన్‌కృష్ణతో పరిచయ మేర్పడి ప్రేమగా మారింది.అయితే సుష్మ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో ఆగస్టు 27వ తేదిన రహస్యంగా వివాహం చేసుకున్నారు.దీంతో ఆగ్రహించిన  సుష్మను తల్లిదండ్రులు గుంటూరుకు ఆమెను తీసుకెళ్లేందుకు రకరకాలుగా ప్రయత్నించడంతో పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. తన కుటుంబ సభ్యులతో వెళ్ళనని సుష్మ తెగేసి చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వెనుదిరిగారు.ఈ నేపథ్యంలో సుష్మ, మోహన్‌కృష్ణ బహిరంగంగా మళ్ళీ  పెళ్లి చేసుకున్నారు.గురువారం రాత్రి సుమారు 30మంది వాహనాల్లో వచ్చి మోహన్‌కృష్ణ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.ఇంటి అద్దాలు, టీవీ, ఫర్నిచర్‌, తలుపులను ఇనుప రాడ్లతో ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు.సుష్మను బలవంతంగా కారులో తీసుకెళ్ళారు.ఈ విషయమై మోహన్‌కృష్ణ ఫోన్‌ చేయడంతో పోలీసులు అతడి ఇంటికి వెళ్ళి పరిశీలించారు.శుక్రవారం చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి మోహన్‌కృష్ణ రాగా సుష్మ తన తల్లిదండ్రుల నుంచి తప్పించుకుని తిరుపతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం అందింది.కుటుంబీకులతో కలసి మోహన్‌కృష్ణ   తిరుపతికి చేరుకున్నాడు.ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సుష్మ తల్లిదండ్రులతో పాటు మరో 15మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more