విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2022-11-03T01:09:57+05:30 IST

ఈశాన్య రుతుపవనాల ప్రభావానికి తోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో తలెత్తిన తుఫాను వల్ల జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

విస్తారంగా వర్షాలు
కాళంగి నది ప్రవాహం , పులికాట్‌ సరస్సులో పక్షులు విన్యాసాలు

విస్తారంగా వర్షాలు

చిట్టమూరు, వాకాడు,తడ, సూళ్ళూరుపేటల్లో భారీ

యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్‌

తిరుపతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల ప్రభావానికి తోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో తలెత్తిన తుఫాను వల్ల జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం 32 మండలాల్లో కురిసిన వర్షాలకు 31.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా బుధవారం మొత్తం 34 మండలాల్లోనూ పడిన వానలకు 55.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.తిరుమలలో సైతం మంగళవారం తరహాలోనే బుధవారం కూడా మోస్తరు వర్షం కురిసింది.వర్షం ఆగని నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమలలోని సందర్శనీయ ప్రదేశాలైన పాపవినాశనం, శ్రీవారిపాదాల మార్గాలను బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేశారు.

చిట్టమూరు, వాకాడు, సూళ్ళూరుపేట, తడ మండలాల్లో మంగళవారం రాత్రి నుంచీ బుధవారం ఉదయం వరకూ పది సెంటీమీటర్లకు మించి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చిట్టమూరు మండలంలో 134.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చిన్నగొట్టిగల్లు మండలంలో అత్యల్పంగా 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవించింది.వాకాడులో 112మి.మీ, సూళ్ళూరుపేటలో 111, తడలో 106.4 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. తర్వాతి స్థానాల్లో వరుసగా సత్యవేడులో 87.2, పెళ్ళకూరులో 85, వరదయ్యపాలెంలో 84.8, బీఎన్‌ కండ్రిగలో 84.4, దొరవారిసత్రంలో 74.2, కోటలో 67.6, నాయుడుపేటలో 63.6, ఏర్పేడులో 58.6, వడమాలపేటలో 55.4, ఓజిలిలో 54.6, బాలయపల్లిలో 49.6, తొట్టంబేడులో 49.2, రేణిగుంటలో 46.2, తిరుపతి రూరల్‌లో 43.8, చిల్లకూరులో 42.6, గూడూరులో 41.4, శ్రీకాళహస్తిలో 40.6, తిరుపతి అర్బన్‌లో 40.2 కేవీబీపురంలో 39.6, పిచ్చాటూరులో 37, ఎర్రావారిపాలెంలో 35.6, చంద్రగిరిలో 35, రామచంద్రాపురంలో 34.6, డక్కిలిలో 33.8, నాగలాపురంలో 26.4, వెంకటగిరిలో 26, పుత్తూరులో 24.8, నారాయణవనంలో 24.4,పాకాలలో 17.2, చిన్నగొట్టిగల్లులో 12.8 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం సంభవించింది. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశమున్న నేపధ్యంలో కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే వర్ష తీవ్రత అధికంగా వున్న గూడూరు రెవిన్యూ డివిజన్‌లో ఆర్డీవో కిరణ్‌కుమార్‌ అధికారులతో సమావేశమై ముందస్తు జాగ్రత్తల గురించి సమీక్షించారు. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు ప్రాణ, పశు, ఆస్తి నష్టాలేవీ సంభవించలేదు. అయితే కోట మండలంలో లోతట్టు పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. గూడలిలోని దక్షిణ పొలం, రాజుపాళెం, గోవిందపల్లి, కర్లపూడి, ఉత్తమనెల్లూరు గ్రామాల్లో వరిపైరు నీట మునిగింది. సముద్రంలో అలల ఉధ్రుతి పెరగడంతో బుధవారం కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేదు.సూళ్ళూరుపేట మండలంలో వర్షాల ధాటికి చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళంగి నదికి భారీగా వరదనీరు చేరింది. కాళంగికి అనుసంధానమైన నెర్రికాలువ, పుచ్చాకాలువలు సైతం వర్షపునీటితో పొంగి ప్రవహిస్తున్నాయి.అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీవో రోజ్‌మాండ్‌ కాళంగి నది పక్కనే ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా మొత్తంమీద ఎక్కువ మండలాల్లో ముసురు పట్టుకుని జడి వానలు కురుస్తుండడం, కొన్ని చోట్ల వర్ష తీవ్రత అధికంగా వుండడంతో జనజీవనానికి అసౌకర్యం కలిగింది. ముఖ్యంగా కూలి పనులు చేసుకునే వారికి ఇబ్బందిగా మారింది. కాగా వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది.

పులికాట్‌కు భారీగా వర దనీరు

సూళ్లూరుపేట, నవంబరు 2 : పులికాట్‌ సరస్సుకు భారీగా వరద నీరు చేరింది.నదుల నుంచి భారీ మంచి నీరు, సముద్రపు ఆటుపోట్లతో ఉప్పునీరు చేరడంతో సరస్సు నిండుకుండను తలపిస్తోంది. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో అలలు ఎగసిపడుతున్నాయి. చల్లని గాలులు వీయడంతో పక్షుల సందడి కన్పిస్తోంది. కుదిరి, అట్టకానితిప్ప, శ్రీహరికోట సమీపంలో రోడ్డు పక్కనే పలువురు జాలర్లు విసురు వలలు వేసి చేపలను వేటాడుతున్నారు.

Updated Date - 2022-11-03T01:10:01+05:30 IST