శ్రీకాళహస్తిలో ఏడుగంగల జాతర

ABN , First Publish Date - 2022-12-15T00:52:29+05:30 IST

పోటెత్తిన భక్తజనం

శ్రీకాళహస్తిలో ఏడుగంగల జాతర
బ్రాహ్మణ వీధి గంగమ్మ ఊరేగింపు

శ్రీకాళహస్తి, డిసెంబరు 14: ఒకరా.. ఇద్దరా.. ఏడుగురు గంగమ్మలు. ఏడు గంగమ్మల ఆలయం నుంచి వివిధ అలంకారాల్లో ఒకరి వెనుకగా మరొకరుగా అమ్మవార్ల ఊరేగింపు బుధవారం తెల్లవారుజామున మొదలైంది. అమ్మవార్లకు పలువురు కోడిపుంజులు, వేట సమర్పించారు. ఇలా ఊరేగింపుగా వచ్చిన అమ్మవార్లు ఏడు చోట్ల కొలువుదీరారు. ఇలా, శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర సంరంభం మొదలైంది. ఉదయం నుంచి గంగమ్మలను దర్శించుకోవడానికి పట్టణ, పరిసర గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో ఏడుగంగమ్మలు కొలువుదీరిన చోట రాత్రి వరకు భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవార్లకు అంబలి నైవేద్యంగా సమర్పించారు. వివిధ వేషధారణలు, మహిళలు, పిల్లలు వేపమండలను చీరలుగాధరించారు. వెయ్యికళ్ల దుత్తలతో మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి ఏడుగంగమ్మలు ఆయా ప్రాంతాల నుంచి తిరిగి ఊరేగింపుగా ముత్యాలమ్మ ఆలయంవద్దకు చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం ముత్యాలమ్మ ఆలయం గంగమ్మలకు ఒక్కొక్కరికి ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం చేశారు. దీంతో ఏడుగంగమ్మల జాతర ముగిసింది. ఎక్కడైనా ఒక అమ్మవారి మూర్తికే జాతర, ఉత్సవాలు జరుగుతాయి. కానీ, ఒకేరోజు ఏడు గంగమ్మలకు ఊరేగింపుతో జాతర జరగడం శ్రీకాళహస్తి ప్రత్యేకత.

Updated Date - 2022-12-15T00:52:32+05:30 IST