ప్రకంపనలు రేపుతున్న మాస్టర్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2022-10-08T05:11:00+05:30 IST

పలమనేరు పట్టణ విస్తరణకు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ మున్సిపాలిటీ పరిధిలోనే కాక పరిసర గ్రామాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ప్రకంపనలు రేపుతున్న మాస్టర్‌ ప్లాన్‌
మున్సిపల్‌ కార్యాలయం ముందు ప్రదర్శనకు ఉంచిన మాస్టర్‌ప్లాన్‌ నమూనా

పలమనేరు, అక్టోబర్‌ 7: పలమనేరు పట్టణ విస్తరణకు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌  మున్సిపాలిటీ పరిధిలోనే కాక పరిసర గ్రామాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి రెండువైపులా విస్తరించి ఉన్న పలమనేరును మరింత అభివృద్ధి చేసేందుకు ఈ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి స్థానికులు ఆసక్తి చూపకపోగా వ్యతిరేకత చూపుతున్నారు. అక్టోబరు 19వ తేది లోపు మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని మున్సిపల్‌ అధికారులు నోటీసుబోర్డులో  ప్రదర్శనకు ఉంచారు. పంచాయతీ స్థాయి నుంచి పలమనేరు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత పన్నులు పెరగడం, గృహ నిర్మాణాలకు ప్లాన్‌ అప్రూవల్‌ ధరలు పెరగడం మినహా ఒరిగిందేమీ లేదని ప్రజలు అంటున్నారు. అధికారులు చెబుతున్న అభివృద్ధి నేడు మున్సిపాలిటీలో కనీసం జీతాలు, విద్యుత్‌ ఛార్జీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందంటున్నారు. పలమనేరు పట్టణానికి తూర్పు, దక్షిణ భాగాన అడవి విస్తరించి ఉంది. ఇక పడమరవైపు 5 కిలోమీటర్లు వెళ్లగానే జాతీయరహదారిలో అడవి, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ గోశాల భూములుండగా మరోవైపు కుప్పం మీదుగా తమిళనాడుకు వెళ్లే జాతీయరహదారి ఉంది. పంచాయతీ హయాంలో పట్టణ పరిసరాల్లో కేవలం రూ.50 వేలు కూడా పలకని భూముల ధరలు నేడు రూ.2 కోట్లకుపైగా ఉంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇంటి స్థలాలు అందుబాటు ధరలో దొరకడం లేదు. మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా సరైన రోడ్లు, మురుగునీటి కాలువలు లేవు. ఇక తాజాగా అధికారులు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో దాదాపు 10 గ్రామాలను చేరుస్తుండటంతో పట్టణానికి చేరువలో అంటే దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలమనేరు పట్టణానికి చెందిన వారంతా మున్సిపాలిటీలో పన్నుల భారాన్ని భరించలేక పట్టణానికి ఆనుకొనే ఉన్న గంగవరం పంచాయతీ పరిదిలో స్థలాలు కొనుగోలు చేసుకొని ఇళ్లు నిర్మించుకొంటున్నారు. తాజా మాస్టర్‌ప్లాన్‌లో గంగవరం పంచాయతీలోని పలుగ్రామాలు  దీని పరిధిలోకి రానున్నాయి. దీంతో వారంతా కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక పలమనేరు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరం నుంచి జాతీయ రహదారిని ఆనుకుని కుప్పం వెళ్లే మార్గంతో దాదాపు 2వేల ఎకరాలతో ప్రభుత్వం పారిశ్రామిక వాడ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలియడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే నేటి వరకు కూడా మాస్టర్‌ ప్లాన్‌ గురించి తెలిసినా అభ్యంతరాలను మాత్రం అధికారులకు  అందజేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇక పట్టణవాసులు నేడు అధికారులకు వినతిపత్రాలు విడివిడిగా ఇచ్చేందుకు రాగా అందరూ కలిసి  ఇవ్వాలని చెప్పడంతో వెనుదిరిగారు. మొత్తంమీద మాస్టర్‌ప్లాన్‌ వలన మున్సిపాలిటీ స్థాయి మరింత పెరిగి పన్నుల భారం పడుతుందని దీంతో అద్దె ఇళ్లలో ఉన్న  ప్రజలు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. 

Read more