అమ్మ నిద్ర లేచిందా?

ABN , First Publish Date - 2022-03-13T07:35:17+05:30 IST

‘‘అమ్మ చెప్పింది..నేను గుడ్‌ బాయ్‌ అని. అమ్మ చెప్పినట్టు ఉంటేనే గుడ్‌బాయ్‌ గా వుంటారు. అమ్మ పడుకున్నపుడు డిస్టర్బ్‌ చేయకూడదు. స్కూలుకి వెళ్లి వచ్చాక బయటకు వెళ్లకూడదు. అమ్మ రావడం లేటయినా బుద్దిగా ఇంట్లోనే ఉండాలి.

అమ్మ నిద్ర లేచిందా?
రాజ్యలక్ష్మి ఫైల్‌ ఫొటో

  • తిరుపతి విద్యానగర్‌ కాలనీలో..
  • హృదయవిదారక ఘటన

తిరుపతి(నేరవిభాగం), మార్చి 12: ‘‘అమ్మ చెప్పింది.. నేను గుడ్‌ బాయ్‌ అని. అమ్మ చెప్పినట్టు ఉంటేనే గుడ్‌బాయ్‌ గా వుంటారు.  అమ్మ పడుకున్నపుడు డిస్టర్బ్‌ చేయకూడదు. స్కూలుకి వెళ్లి వచ్చాక బయటకు వెళ్లకూడదు. అమ్మ రావడం లేటయినా బుద్దిగా ఇంట్లోనే ఉండాలి. చదువుకోవాలి. అమ్మకి ఇంట్లో పనుల్లో సాయం చేయాలి. అమ్మకి ఒళ్లు బాగా లేకపోతే ఇబ్బంది పెట్టకుండా నా పనులు నేనే చేసుకోవాలి. అది కావాలి..ఇది కావాలి అని ఏడవకూడదు. ఇంట్లో ఉండేదే తినాలి. బయట ఎవ్వరితోనూ చెప్పకూడదు. అట్లా చెబితే అమ్మని బాడ్‌ అమ్మ అనుకుంటారు కదా. కుక్కర్‌లో బియ్యం కడిగి పెట్టడం. కూరగాయలు తరిగి ఇవ్వడం, గిన్నెలు కడగడం.. అన్నింట్లో అమ్మకి హెల్ప్‌ చేయాలి. ఇవన్నీ చేస్తేనే కదా గుడ్‌బాయ్‌ అయ్యేది..  నేను అమ్మ చెప్పినట్టే వింటాను. అమ్మ నన్ను గుడ్‌బాయ్‌ అని ముద్దు పెట్టుకుంటుంది. అందుకే అమ్మ బెడ్‌ మీద బజ్జోని నిద్రపోతూ ఉన్నా నేను డిస్టర్బ్‌ చేయలేదు.


బువ్వ పెట్టు అని ఏడవలేదు. ఫ్రిజ్‌లో ఉన్నవే లంచ్‌ బాక్స్‌లో పెట్టుకుని స్కూలుకి తీసుకెళ్లి తిన్నా. బువ్వ తెచ్చుకోలేదు అని మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పలేదు. స్కూలు నుంచి వచ్చాక కూడా అమ్మ నిద్రపోతూనే ఉంది. డిస్టర్బ్‌ చేయకూడదు కదా. నేను గుడ్‌బాయ్‌ని  అమ్మ నిద్రపోతుంటే డిస్టర్బ్‌ చేయనే లేదు. కానీ అమ్మ దగ్గర నుంచి బ్యాడ్‌ స్మెల్‌ వస్తుంటే మాత్రం నాకు కడుపులో ఏదోగా అయ్యింది. స్కూలుకి వెళ్లినా అదే వాసన.. వాంతి చేసేసుకున్నా. ఇంటికొచ్చాక  మామ ఫోన్‌ చేస్తే అమ్మ నిద్రపోతోంది. లేవనే లేదు. అమ్మ దగ్గర బ్యాడ్‌ స్మెల్‌ వస్తోంది అని చెప్పా. మామ వచ్చాక అమ్మని తీసుకెళ్లారు. అమ్మ ఎక్కడికెళ్లింది ? అమ్మ నిద్ర లేచిందా? అమ్మ ఎప్పుడొస్తుంది?’’ ఆ పిల్లవాడు అమాయకంగా చెబుతున్న ఈ మాటలు వింటున్నపుడు పోలీసుల కళ్లు చెమర్చాయి. ఆ తగి గుండెకు తాకి, దుఃఖం ఎగతన్నుకు వచ్చింది.


మరణించిందని తెలియక నాలుగు రోజుల పాటూ అమ్మతోనే గడిపిన పదేళ్ల పిల్లవాడు శ్యామ్‌  కిషోర్‌ని చూసి కన్నీళ్లు పెట్టని వారు లేరు. 8వ తేదీ రాత్రి వాంతి చేసుకుని పడకమీద నుంచి కిందకి బోర్లా పడి మరణించిన రాజ్యలక్ష్మి ఉదంతం శుక్రవారం రాత్రి గానీ వెలుగులోకి రాలేదు. అమ్మ ఫోన్‌ రింగవడంతో తీసిన శ్యాంకిషోర్‌, మేనమామకి అమ్మ నిద్రపోతోందని, బ్యాడ్‌ స్మెల్‌ వస్తోందని చెప్పడంతో ఆయన  ఆందోళనగా వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి విద్యానగర్‌ కాలనీలోని ఇంటికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి, బాలుడిని అనునయంగా మాటల్లో పెట్టారు. ఎం.ఆర్‌. పల్లి ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ బాలుడి నుంచి వివరాలు రాబట్టారు. మృతదేహం మీద గాయాలు ఏవీ లేకపోవడంతో గుండెపోటుతో ఆమె మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని పోలీసులు తెలిపారు. బాలుడిని కుటుంబసభ్యులు తీసుకువెళ్లారు. కుటుంబ జీవితం ఛిద్రమై, గౌరవానికి భంగం కలుగరాదనే ఉద్దేశంతో కొడుక్కి తల్లి చెప్పిన మంచిమాటలు చివరికి ఆమె మరణాన్ని కూడా గ్రహించలేని స్థితిలోఆ పిల్లవాడిని ఉంచేశాయి.

Updated Date - 2022-03-13T07:35:17+05:30 IST