చిత్తూరు, తిరుపతి కలెక్టర్లకు 5, 11 ర్యాంకులు

ABN , First Publish Date - 2022-11-30T02:04:21+05:30 IST

చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌కు 5, తిరుపతి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డికి 11వ ర్యాంకులు లభించాయి. కొత్త జిల్లాలు వచ్చాక.. ఎనిమిది నెలల పాటు నాలుగు అంశాల్లో వారి పనితీరు ఆధారం చేసుకుని ఈ ర్యాంకుల్ని ఇచ్చారు.

చిత్తూరు, తిరుపతి  కలెక్టర్లకు 5, 11 ర్యాంకులు
హరినారాయణన్‌ - వెంకటరమణారెడ్డి

చిత్తూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌కు 5, తిరుపతి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డికి 11వ ర్యాంకులు లభించాయి. కొత్త జిల్లాలు వచ్చాక.. ఎనిమిది నెలల పాటు నాలుగు అంశాల్లో వారి పనితీరు ఆధారం చేసుకుని ఈ ర్యాంకుల్ని ఇచ్చారు. ప్రతి నెలా చివరి వారంలో చీఫ్‌ సెక్రటరీ నిర్వహించే వీడియో కాన్ఫెరెన్సులో క్రోడీకరించిన సమాచారం ఆధారంగా కలెక్లర్లకు ర్యాంకుల్ని ఇస్తున్నారు. చిత్తూరు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు విభజన అయ్యాక కూడా కొన్ని అంశాల్లో మొదటి స్థానంలోనే ఉంది. హౌసింగ్‌, నాడు- నేడు అంశాల్లో చిత్తూరు కొత్త జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే స్పందన, రీసర్వే పనుల్లోనూ చిత్తూరు జిల్లానే మెరుగైన స్థానంలో ఉంది. కొన్ని అంశాల్లో కలెక్టర్‌ హరినారాయణన్‌ పలు శాఖల అధికారులతో నిక్కచ్చిగా వ్యవహరించి విమర్శలకు గురైనా, ఆయా శాఖల్ని ప్రథమ స్థానంలో నిలపడంలో విజయవంతమైనట్లు ఆయనకు లభించిన ర్యాంకుతో తెలుస్తోంది. రాష్ట్రంలో 26 జిల్లాల కలెక్టర్లు ఉండగా, చిత్తూరు కలెక్టరుకు 5వ ర్యాంకు రావడం పట్ల కలెక్టరేట్‌ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పొరుగున ఉన్న కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు విజయరామరాజు, గిరీషకు 1, 3 ర్యాంకులు లభించాయి. వీరిద్దరూ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-30T02:04:26+05:30 IST