సీటు ఫైటు..!

ABN , First Publish Date - 2022-11-09T23:42:01+05:30 IST

వైసీపీ హిందూపురం ఇనచార్జి సీటు కోసం ముక్కోణపు పోటీ నెలకొంది. ఆ పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. చౌళూరు రామక్రిష్ణారెడ్డి కుటుంబానికి అధిష్టానం ఇనచార్జి బాధ్యతలు అప్పగిస్తుందని ఆ వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది.

సీటు ఫైటు..!

వైసీపీ పురం ఇనచార్జి సీటుపై ముగ్గురి కన్ను

చౌళూరు కుంటుంబానికి ఇస్తారంటూ ప్రచారం

మరో ఇద్దరు నేతల ముమ్మర ప్రయత్నాలు

పార్టీలోని కుంపట్లతో చెదిరిన క్యాడర్‌

జనంలోకి వెళతానంటూ

మధుమతి నేడు ప్రకటన

ఎమ్మెల్సీ బాధ్యతలు పదిలమేనా?

ఇక్బాల్‌కు మద్దతుగా నేడు రాజధానికి మైనార్టీలు

హిందూపురం

వైసీపీ హిందూపురం ఇనచార్జి సీటు కోసం ముక్కోణపు పోటీ నెలకొంది. ఆ పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. చౌళూరు రామక్రిష్ణారెడ్డి కుటుంబానికి అధిష్టానం ఇనచార్జి బాధ్యతలు అప్పగిస్తుందని ఆ వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. రామక్రిష్ణారెడ్డి సోదరి జనంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని మరో ఇద్దరు కీలక నాయకులు కూడా ఇనచార్జి సీటు కోసం పోటీ పడుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలోని కీలక నేతలు, మంత్రుల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పోటీ పడుతుండడంతో ప్రస్తుతం ఇనచార్జిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ సీటు పదిలమేనా అన్న అనుమానాలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి.

హత్యానంతరం పరిణామాలు

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూపురం అధికార పార్టీలో కుమ్ములాట మాత్రం కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికలకు ముందు స్థానికులను కాదని మాజీ పోలీసు అధికారి అయిన మహమ్మద్‌ ఇక్బాల్‌కి ఎమ్మెల్యే బీఫారం ఇచ్చారు. ఆయన వచ్చిన రోజు నుంచే ప్రస్తుత ఆగ్రోస్‌ చైర్మన నవీన నిశ్చల్‌ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినా ఇక్బాల్‌కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతోపాటు పురం ఇనచార్జ్‌ బాధ్యతలను కూడా పార్టీ కట్టబెట్టింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాలరెడ్డి.. ఎమ్మెల్సీకి దూరమయ్యారు. మూడేళ్లుగా ఎమ్మెల్సీని సాగనంపాలంటూ నవీన నిశ్చల్‌, కొండూరు వేణుగోపాలరెడ్గి వర్గాలు పలుమార్లు రోడ్డెక్కాయి. రాజధానికి వెళ్లి, ముఖ్యమంత్రి జగనకు సైతం మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం వైసీపీ పురం మొదటి సమన్వయకర్త చౌళూరు రామక్రిష్ణారెడ్డి కూడా ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ నేపథ్యంతో గతనెల 8వ తేదీన చౌళూరు రామక్రిష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ఎమ్మెల్సీతోపాటు ఆయన వద్దనున్న వైసీపీ సీనియర్‌ నాయకుడు గోపీకృష్ణ పాత్ర ఉన్నట్లు రామక్రిష్ణారెడ్డి తల్లి ఆరోపించారు. గోపీకృష్ణపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో రామక్రిష్ణారెడ్డి కుటుంబ సభ్యులు.. ముఖ్యమంత్రిని కలిశారు. తమకు ఇనచార్జ్‌తోపాటు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

ముక్కోణపు పోటీ

వైసీపీ హిందూపురం ఇనచార్జి సీటుకు ముక్కోణపు పోటీ నెలకొందని పార్టీలో చర్చ సాగుతోంది. చౌళూరు రామక్రిష్ణారెడ్డి కుటుంబానికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందంటూ ఒకవర్గం నాయకులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇనచార్జి కోసం పోటీ పడుతున్న మరో నాయకుడు కూడా తనకున్న పలుకుబడితో అధిష్టానంలోని ముఖ్య నేత ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ కోసం ఖర్చులు పెట్టుకున్నామనీ, కేసులు పెట్టించుకుని నష్టపోయామని తమకే ఇనచార్జి బాధ్యతలు ఇవ్వాలంటూ పార్టీ పెద్దల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరో నాయకుడు పార్టీ ఆవిర్భావం నుంచి తాను కూడా కష్టపడి పనిచేస్తున్నాననీ, ఎంతో నష్టపోయామనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇనచార్జి బాధ్యతలు అప్పగిస్తే పార్టీని గాడిన పెడతానంటూ తనకు అనుకూలంగా ఉన్న నాయకులను ఓ మంత్రి వద్దకు పంపి, ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

ఇక్బాల్‌ సీటు పదిలమేనా?

ప్రస్తుతం వైసీపీ హిందూపురం ఇనచార్జిగా ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ కొనసాగుతున్నారు. చౌళూరు రామక్రిష్ణారెడ్డి హత్య జరిగి నెలరోజులు దాటినా ఆయన హిందూపురానికి రాలేదు. ప్రస్తుతం పురంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసు అధికారుల సూచన మేరకే ఎమ్మెల్సీ పురానికి రాలేదంటూ ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు ఆయనను ఇనచార్జిగా తొలగించినట్లు అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినా ఇనచార్జి పదవి కోసం ఇతరులు పోటీ పడటం కార్యకర్తలను అయోమయంలో పడేస్తోంది.

చెదిరిన క్యాడర్‌?

గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో అఽధికార పార్టీ నాయకులు.. తెలుగుదేశం కంచుకోట హిందూపురాన్ని బద్దలు కొట్టామనీ, ఇక తమకు ఎదురులేదని చెప్పుకొచ్చారు. రామక్రిష్ణారెడ్డి హత్యతో హిందూపురంలో వైసీపీ నిర్వేదంలోకి జారుకోవడంతోపాటు క్యాడర్‌ కూడా చెల్లాచెదురైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. హత్యకు ముందు ఒక వర్గంలో ఉన్న వారు.. ప్రస్తుతం మరోవర్గంలోకి చేరారు. మరికొంత మంది తటస్థంగా ఉండటమే నయమని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ కంచుకోట పదిలమేననీ, దీనిని ఎవరూ బద్దలు కొట్టలేరంటూ వైసీపీలోని ముఖ్యనాయకులే బహిరంగంగా చెబుతుండడం గమనార్హం.

నేడు రాజధానికి మైనార్టీలు

రామక్రిష్ణారెడ్డి హత్య అనంతరం ఎమ్మెల్సీ ఇక్బాల్‌ హిందూపురానికి రాకపోవడంతో ఆ పార్టీలోని నాయకులు.. ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీపై ఓ సామాజిక వర్గం కక్ష కట్టిందని అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని ఆయన వర్గీయులతోపాటు మైనార్టీ నాయకులు చర్చించారు. మంగళ, బుధవారాల్లో అంతర్గతంగా ఈ విషయంపై సమాలోచనలు సాగించారు. గురువారం పెద్దసంఖ్యలో వాహనాలతో ఎమ్మెల్సీ వద్దకు వెళ్లి, అక్కడి నుంచి రాజధానికి వెళ్లి ముఖ్యమంత్రి, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించినట్లు ఎమ్మెల్సీ వర్గీయుల ద్వారా తెలిసింది. రామక్రిష్ణారెడ్డి సోదరి మధుమతి గురువారం హిందూపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటుచేసి, అనంతరం ఆమె జనంలోకి వెళ్లేందుకు తేదీని ఖరారు చేయనున్నట్లు రామక్రిష్ణారెడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పురంలో వైసీపీ ఇనచార్జి సీటుపైనే సర్వత్రా చర్చ సాగుతోంది.

Updated Date - 2022-11-09T23:42:05+05:30 IST