అబ్బో.. ఏం బిల్డప్పో..!

ABN , First Publish Date - 2022-08-25T05:44:19+05:30 IST

రాచానపల్లిలో రూ.కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్రపన్నినవారిలో ముగ్గురు విలేకరులు, ఒక వాహన డ్రైవర్‌ ఉన్నారు.

అబ్బో.. ఏం బిల్డప్పో..!
ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ వద్ద పోలీస్‌ వాహనం

 -అధికార పార్టీ అనుకూల మీడియా విలేకరులకు హై ప్రొటెక్షన్

-ఫొటోలు.. వీడియోలు తీయనీకుండా పోలీసుల అత్యుత్సాహం

-భూ బాగోతంలో పట్టుబడ్డ నలుగురి కోసం హై డ్రామా 

-ఓ విలేకరి సెల్‌ఫోన్ లాక్కున్న సీఐ జాకీర్‌ హుస్సేన్


అనంతపురం క్రైం, ఆగస్టు 24: రాచానపల్లిలో రూ.కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర పన్నినవారిలో ముగ్గురు విలేకరులు, ఒక వాహన డ్రైవర్‌ ఉన్నారు. ఈ నలుగురు అధికార పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా విలేకరులు. దీంతో వారిని మీడియా కంట పడనీకుండా.. పోలీసులు హైడ్రామా నడిపించారు. ఎన్నో కీలకమైన కేసులను ఛేదించినప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి.. ఫొటోలకు, వీడియోలకు అవకాశం కల్పించే పోలీసులు.. ఈ నలుగురికి మాత్రం వీఐపీ భద్రత కల్పించారు. వారి ఫొటోలు, వీడియోలను తీయనీకుండా.. చుట్టూ ఖాకీ కోట కట్టేశారు. 


ఆ కేసులో..

అనంతపురం మండలం రాచానపల్లిలో 14.96 ఎకరాల భూమిని కాజేసేందుకు కుట్ర చేసిన ప్రభుత్వ అనుకూల మీడియా విలేకరులను కోర్టులో హాజరుపరిచే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికార పార్టీకి చెందిన, అనుకూలమైన మీడియాలో పనిచేస్తున్నవారు ఈ కేసులో నిందితులు అయినందుకే పోలీసులు ఇలా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. సాక్షి టీవీ విలేకరి హనుమంతు, ఎనటీవీ విలేకరి వేణుగోపాల్‌, టీవీ 9 విలేకరి రమేష్‌, టీవీ 9 కారు డ్రైవర్‌ రామ్మోహనరెడ్డిని పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాలుగో పట్టణ పోలీసులు నిందితులను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ పోలీసులు తమ వాహనాన్ని క్యాజువాలిటీ గది వద్దకు తీసుకెళ్లడం గమనార్హం. పోలీసుల తీరు విస్తుగొలిపింది. ‘పట్టుబడిన విలేకరులతో ప్రజలకు ముప్పు కలుగుతుందా..? లేక బయటి వారి నుంచి నిందితులకు ముప్పు ఉందా..? మరీ క్యాజువాలటీ వరకూ నిందితులను వాహనంలో తీసుకువెళ్లడం ఏమిటి..?’ అని అక్కడున్నవారు వ్యాఖ్యానించారు.


ఎందుకో ఏమో..


నిందితుల ఫొటోలు, వీడియోలు తీయడానికి వచ్చిన మీడియా సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. అదేదో ఘోర తప్పిదం అన్నట్లు అటువైపే రానివ్వలేదు. ఆస్పత్రి నుంచి కోర్టుకు తరలిస్తారని అనుకుంటే, అందుకు భిన్నంగా మళ్లీ నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషనకు తీసుకెళ్లారు. తిరిగి సాయంత్రం 5 గంటల సమయంలో నిందితులను కోర్టుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు విలేకరుల కంట పడకుండా పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించారు. సీఐ జాకీర్‌ హుస్సేన మరీ ఎక్కువ హడావుడి చేశారు. నలుగురు ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి అక్కడ ఫొటోలు, వీడియో తీయడానికి యత్నించిన మీడియా సిబ్బందిని కోర్టు ఆవరణ నుంచి బయటకు పంపించారు. ఆ కొంత సమయం కోర్టు ఆవరణను తమ అధీనంలోకి తీసుకున్నట్లు వ్యవహరించారు. చివరికి సెల్‌ ఫోనలో ఫొటో తీయడానికి ప్రయత్నించిన ఓ విలేకరిపట్ల దురుసుగా వ్యవహరించారు. అతని చేతిలోని సెల్‌ఫోనను లాక్కున్నారు. దాన్ని తిరిగి ఇవ్వకపోవడం గమనార్హం. ఎంతో మంది నిందితుల విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరించే పోలీసులు, అధికార పార్టీ అనుకూల మీడియా విలేకరుల విషయంలో ఇలా వ్యవహరించడం విస్మయం కలిగించింది. 


Updated Date - 2022-08-25T05:44:19+05:30 IST