తెగుళ్ల వర్రీ..!

ABN , First Publish Date - 2022-09-30T05:07:13+05:30 IST

వరి నాటి నెల దాటకనే తెగుళ్లు చుట్టుముట్టాయి. వాతావరణ మార్పులతో వరిపైరుకు తెగుళ్లు వ్యాపించాయి.

తెగుళ్ల వర్రీ..!
తెగులు సోకిన వరిపైరు

- వరి పంటకు ఆదిలోనే తెగుళ్ల వ్యాప్తి

 - పైరుకు సోకిన ఎర్ర, మజ్జిగ, తాటాకు తెగుళ్లు

 - మందులు పిచికారీ చేసినా ప్రయోజనం శూన్యం

 - నివారణ చర్యలు చేపట్టాలంటున్న వ్యవసాయాధికారులు


ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు 29: వరి నాటి నెల దాటకనే తెగుళ్లు చుట్టుముట్టాయి. వాతావరణ మార్పులతో వరిపైరుకు తెగుళ్లు వ్యాపించాయి. మండలవ్యాప్తంగా ఖరీఫ్‌లో 1050 ఎకరాల్లో బోర్లు, చెరువుల కింద వరి సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండాయి. దీంతో బోరుబావులు, చెరువుల కింద ఆయకట్టు భూముల్లో వరి సాగు చేశారు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. వరి పైరుకు ప్రస్తుతం ఎర్ర, మజ్జిగ (తెల్ల), తాటాకు తెగుళ్లు వ్యాపించాయి. దీంతో పైరు ఎదుగుదల లేకుండా పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తెగుళ్లతో ఆకులోని పత్రహరితాన్ని గోకి తినడం వల్ల తెల్లటిమచ్చలు, చారలు ఏర్పడి, ఆకులు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఆదిలోనే తెగుళ్లు వ్యాపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పైర్లు పచ్చబడటానికి రసాయన మందుల పిచికారీతోపాటు కాంప్లెక్స్‌, డీఏపీ వంటి ఎరువులను చల్లుతున్నామని తెలుపుతున్నారు. అయినా ప్రయోజనం లేదు. వాతావరణ మార్పులతో వరి పైరుకు తెగుళ్లు వస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రూ.వేలకువేలు వెచ్చించి, మందులు పిచికారీ చేస్తున్నా.. తెగుళ్లు అదుపులోకి రావట్లేదంటున్నారు. ఒకేసారి ఇన్ని తెగుళ్లు వ్యాపించడంతో పైరు ఎదుగుదలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నివారణ చర్యలు చేపట్టాలి

    - చన్నవీరస్వామి, ఏఓ, ధర్మవరం

  ప్రస్తుతం వరి పైర్లకు తాటాకు తెగులు సోకింది. గొట్లూరు చెరువు కింద సాగుచేసిన పైరును పరిశీలించాం. తెల్లమచ్చలు, చారలు ఏర్పడి, ఆకులు ఎండిపోతుండడాన్ని గమనించాం. వీటి నివారణకు రైతులు ప్రొఫెనోఫోస్‌ 2.00 ఎంఎల్‌ గానీ మోనోక్రోటోఫోస్‌ 1.6 ఎంఎల్‌ గానీ క్లోరిఫైరిఫో్‌స 2.5ఎంల్‌ను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వాతావరణమార్పులతో ఈ తెగుళ్లు సోకాయి. వర్షం కురిస్తే అదుపులోకి వస్తాయి.
Read more