వైరల్‌...హడల్‌

ABN , First Publish Date - 2022-11-24T23:49:21+05:30 IST

జిల్లాలో ఏ ఊరికెళ్లినా.. వైరల్‌ జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. ఊరూరా జ్వర బాధితులు మంచం పట్టారు. పలు కుటుంబాల్లో ఎంత మంది ఉంటే అంత మంది కూడా జ్వరాలతో అల్లాడిపోతున్నారు.

వైరల్‌...హడల్‌
కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రి ఆవరణలోనే పడుకున్న వృద్ధులు

గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం

కానరాని ఫాగింగ్‌ మిషన్లు

ప్రబలుతున్న జ్వరాలు

ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం

పట్టించుకోని అధికారులు, పాలకులు

ధర్మవరం రూరల్‌

జిల్లాలో ఏ ఊరికెళ్లినా.. వైరల్‌ జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. ఊరూరా జ్వర బాధితులు మంచం పట్టారు. పలు కుటుంబాల్లో ఎంత మంది ఉంటే అంత మంది కూడా జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ఎక్కడికెళ్లినా.. జ్వరం.. జ్వరం.. అనే మాట వినిపిస్తోంది. జిల్లాలో పారిశుధ్యం పడకేయడంతో దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్నాయి. బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పారిశుధ్యాన్ని మెరుగు పరచడం, దోమల నియంత్రణను యంత్రాంగం మరచింది.

విపరీతంగా దోమల వ్యాప్తి

వాతావరణ మార్పులు, ఇటీవల తుఫాన్ల ప్రభావంతో కూడిన వర్షం కురవడంతో గ్రామాల్లో రోడ్లపై నీరు చేరింది. ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయింది. పారిశుధ్య పనులు, మురుగునీటి కాలువలు శుభ్రం చేసే నాథుడే కరువయ్యాడు. దీంతో దోమలు విపరీతంగా ఉత్పత్తి చెందుతున్నాయి. వాటి ద్వారా డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వాటి బారిన పడి జనం విలవిల్లాడుతున్నారు. ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. పెద్దవారిలో కీళ్లనొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో కూడిన విషజ్వరాలు వ్యాప్తిచెందడంతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.

రోజూ ఓపీకి 1000 మందికిపైగానే..

ధర్మవరం ప్రభుత్వాస్పత్రి ఓపీకి సాధారణ రోజుల్లో 600 మంది వరకు వస్తారని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇటీవలిగా వైరల్‌ జ్వరాలు ప్రబలడంతో రోజూ ఓపీకి 1000 మందికిపైగా వస్తున్నారని వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కీళ్లనొప్పులు, తలనొప్పి, జ్వరభాధితులే అధికంగా వస్తున్నారు.

కానరాని ఫాగింగ్‌ మిషన్లు

రెండేళ్ల కిందట పంచాయతీలు, మున్సిపాలిటీలో ఫాగింగ్‌ మిషన్లు కొనుగోలు చేశారు. పంచాయతీ నిధుల నుంచి వాటిని సుమారు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు చెల్లించి, కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ధర్మవరం మండలంలోనే 14 పంచాయతీలకు ఒక్కొక్కటి సుమారు రూ.45 వేలు వెచ్చించి, కొనుగోలు చేశారు. అంతే వాటిని మూలన పడేశారు. దోమల నివారణకు ఫాగింగ్‌ చేయాలన్న విషయాన్నే మరిచారు. రూ.వేలకువేలు ప్రజాధనం వృథా చేశారే తప్ప.. ఫాగింగ్‌ మిషన్లను వినియోగంలోకి తీసుకురాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముందస్తు చర్యలు శూన్యం

వైద్యఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటింటా ఫీవర్‌ సర్వేను అనుకున్న స్థాయిలో గ్రామాల్లో సాగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటివద్దకే వైద్యం కార్యక్రమం నత్తనడకన సాగుతుండటంతోపాటు వాటి పట్ల పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన లేకపోవడంతో చిన్నపాటి జ్వరం వచ్చినా.. పట్టణాల్లోని ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వైరల్‌ జ్వరాలు పెరగకుండా వైద్యాధికారులు పూర్తిస్థాయిలో ప్రజలకు వైద్యసేవలు అందించాలని పలువురు కోరుతున్నారు. వర్షాల కారణంగా వర్షపునీరు, మురుగునీరు ప్రధాన రోడ్ల మీదకు రావడంతో ఎక్కడపడితే అక్కడ నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు పట్టించుకోవ డం లేదని కనీసం బ్లీచింగ్‌, దోమల నివారణకు మిలాథిన ద్రావణాన్ని పిచికారీ చేసి, డ్రైనేజీలను శుభ్ర పరచాలని గ్రామీణులు కోరుతున్నారు.

మంచం పట్టిన గ్రామీణులు

వర్షాల కారణంగా జిల్లాలో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దోమకాటుతో జనం మంచాన పడుతున్నారు. టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ తదితర జ్వరాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. ఫాగింగ్‌ మిషన్లను వినియోగంలోకి తెచ్చి, దోమల నివారణకు మిలాథిన ద్రావణాన్ని పిచికారీ చేయాలనీ, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరచాలని జనం కోరుతున్నారు.

పారిశుధ్య చర్యలు చేపడతాం

గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపడతాం. ఇటీవల విడుదల చేసిన టైడ్‌ నిధులను పారిశుధ్య పనులకు వినియోగించుకోవచ్చు. గ్రామాల్లో అపరిశుభ్రతను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేయిస్తాం.

- నాగరాజు, ఇనచార్జి డీఎల్‌పీఓ, ధర్మవరం

గ్రామాల్లోనే వైద్యసేవలు అందిస్తున్నాం

ఫ్యామిలీ ఫిజీషియన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోనే వైద్యసేవలు అందిస్తున్నాం. ఫీవర్‌ సర్వే ద్వారా జ్వర బాధితులను గుర్తించి, వైద్యసేవలు అందిస్తాం. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పరిచే విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్తాం.

- పుష్పలత, వైద్యాధికారిణి, దర్శినమల పీహెచసీ

Updated Date - 2022-11-24T23:49:25+05:30 IST