వేరుశనగకు తెగుళ్లు

ABN , First Publish Date - 2022-12-29T23:48:08+05:30 IST

ఖరీ్‌ఫలో పంటలు సాగు చేసి, భారీ వర్షాలకు నష్టపోయిన అన్నదాతలు రబీపై ఆశలు పెట్టుకున్నారు. రబీలో బోర్లకింద పంట సాగుచేసి, నష్టాలు, అప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందుదామని ఆశపడ్డారు.

వేరుశనగకు తెగుళ్లు
తెగుళ్ల బారిన పడిన వేరుశనగ పైరు

ఆందోళనలో అన్నదాతలు

మందులు పిచికారీ చేస్తున్నా..

అదుపులోకి రాని దుస్థితి..

పెరుగుతున్న పెట్టుబడి

దిగుబడిపై సందేహాలు

నంబులపూలకుంట

ఖరీ్‌ఫలో పంటలు సాగు చేసి, భారీ వర్షాలకు నష్టపోయిన అన్నదాతలు రబీపై ఆశలు పెట్టుకున్నారు. రబీలో బోర్లకింద పంట సాగుచేసి, నష్టాలు, అప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందుదామని ఆశపడ్డారు. రబీ వేరుశనగను అప్పుడే తెగుళ్లు చుట్టుముట్టాయి. వాటి నుంచి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. పలు రకాల మందులు పిచికారీ చేస్తున్నారు. తద్వారా పెట్టుబడి పెరుగుతోందే తప్ప.. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పంట దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. పంట చేతికిరాకపోతే తీవ్రంగా నష్టపోతామనీ, అప్పుల పాలవుతామని భయాందోళనలకు లోనవుతున్నారు.

పంట దక్కుతుందో.. లేదో..

మండలవ్యాప్తంగా 900 హెక్టార్లలో రైతులు వేరుశనగ సాగు చేశారు. పంట పెట్టి, 40 రోజులవుతోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంటలపై తామర పురుగు, రసం పీల్చే పురుగు, పొగాకు లద్దెపురుగులు కనిపిస్తున్నాయి. రెండుమూడురోజుల క్రితం మండలవ్యాప్తంగా వర్షం కురిసింది. వాతవరణంలో మార్పు రావడంతో పంటలకు చీడపీడలు అధికమయ్యాయి. వాటి నివారణకు ఏ మందులు కొట్టాలో రైతులకు అర్థం కావడంలేదు. ఫర్టిలైజర్‌ దుకాణాలకు రైతులు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. తెగుళ్ల కారణంగా ఆకులకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. కొన్నిచోట్ల ఆకులే లేకుండాపోతున్నాయి. మరికొన్ని పొలాల్లో ఆకుల రంగు మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం పంట కలుపుదశలో ఉంది. కలుపు తీయడానికి రోజుకు మహిళకు కూలీ రూ.500 వెచ్చించడం భారమవుతోందని ఆందోళన చెందుతున్నారు. సకాలంలో కలుపు తీయకపోతే పంట చేతికందదనే భయం రైతులను వెంటాడుతోంది. పంటను ఆశించిన తెగుళ్లను నివారించకపోతే పంటను కాపాడుకోలేమని రైతులు బాధపడుతున్నారు. వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి, సూచనలు, సలహాలు ఇస్తున్నారే తప్ప.. ప్రభుత్వం నుంచి సబ్సిడీ మందులు అందకపోవడంతో మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కొందరైతే అప్పులు పుట్టక సతమతమవుతున్నారు. ఎలాగైనా పంటను కాపాడుకుంటే కొంతవరకు ఆర్థికభారం తగ్గుతుందని భావిస్తున్నారు. సబ్సిడీ కాయలు నాణ్యత లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద అఽధిక ధరలు చెల్లించి, విత్తనం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. పంట చేతికొస్తే తప్ప తాము గట్టెక్కే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఎకరాలో వేరుశనగ సాగు చేయడానికి ఇప్పటికే రూ.60వేలు పెట్టుబడి అయిందని వాపోతున్నారు.

పంట చేతికొస్తుందో.. లేదో..

బోరుబావి కింద మూడెకరాల్లో వేరుశనగ సాగు చేశా. ప్రస్తుతం ఆకులు రంగు మారాయి. మందులు పిచికారీ చేస్తున్నా. పంట చేతికొస్తుందో.. లేదోనని ఆందోళనగా ఉంది. మూడెకరాల్లో పంట సాగుకు ఇప్పటికే రూ.లక్షన్నరకుపైగా అప్పులు చేసి, పెట్టుబడి పెట్టా.

- చెన్నారెడ్డి, పెడకంటివారిపల్లి

ఆకులను తినేస్తున్న తెగుళ్లు

ఆరెకరాల్లో వేరుశనగ సాగు చేశా. పంట పూత దశలో ఉంది. తెగుళ్లు సోకి, ఆకులను పూర్తిగా తినేస్తున్నాయి. వాటి నివారణకు మందులు పిచికారీ చేస్తున్నా. అయినా ప్రయోజనం కనిపించట్లేదు.

- శ్రీరాములు నాయుడు, నంబులపూలకుంట

వేరుశనగలో తెగుళ్ల నివారణకు మండల వ్యవసాయాధికారి లోకేశ్వర్‌రెడ్డి తెలిపిన సలహాలివీ..

రసం పీల్చే పురుగులకు ప్రిప్రోనిల్‌ రెండు ఎంఎల్‌ను లీటరు నీటికిగానీ, ఇమిడా క్లోఫిడ్‌ 0.6 ఎంఎల్‌ను లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.

పొగాకు లద్దెపురుగు నివారణకు నోవాకార్బా 350 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి, పిచికారీ చేయాలి. పురుగులు ఎక్కువగా ఉంటే 10 కిలోల తౌడు, 5 కిలోల బెల్లం, లీటరు క్లోరోపైరిపాస్‌ చిన్న చిన్న ఉండలుగా చేసి, సాయంత్రం వేళల్లో పొలాల్లో చల్లాలి.

పూత దశలో ఉన్నపుడు రెండో తవ్వకం తరువాత ఎకరాకు 200 కేజీల జిప్సం చల్లాలి. తిక్క ఆకుమచ్చ తెగులు గమనిస్తే సాప్‌ 2 గ్రా. లీటరు నీటిలో కలిపి, 15 రోజుల వ్యవధిలో రెండుమార్లు పిచికారీ చేయాలి.

వేరుకుళ్లు, మొదల కుళ్లు, మువ్వకుళ్లు నివారణకు కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రాములను లీటరు నీటిలో కలిపి, పిచికారీ చేయాలి.

పొటాషియంలోపం గమనిస్తే 0.50 వాటర్‌ సాల్‌బుల్‌ ఫర్టిలైజర్‌ స్ర్పే చేయాలి. పక్షి స్థావరాలను ఎకరాకు ఐదు నుంచి పది బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.

Updated Date - 2022-12-29T23:48:11+05:30 IST