పట్టుబడితే ఇక అంతే
ABN , First Publish Date - 2022-07-06T06:19:08+05:30 IST
వాహనం సీజ్ అయి, పోలీసు స్టేషనకు చేరిందంటే ఇక అంతే. దానిని వదులుకోవాల్సిందే. అవి తుప్పు పట్టి, తుక్కుగా మారి, వాటిపై చెట్లు తీగలు పెరిగి, ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. తొందరగా రిలీజ్ చేస్తే.. యజమానులకు ఉపయోగం. వేలం వేసినా.. ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది.

పోలీసుస్టేషన్లలో తుప్పుపడుతున్న వాహనాలు
రక్షణను గాలికొదిలేసిన పోలీసులు
మాయమౌతున్న విడిభాగాలు
పుట్టపర్తి రూరల్/గోరంట్ల, జూలై 5: వాహనం సీజ్ అయి, పోలీసు స్టేషనకు చేరిందంటే ఇక అంతే. దానిని వదులుకోవాల్సిందే. అవి తుప్పు పట్టి, తుక్కుగా మారి, వాటిపై చెట్లు తీగలు పెరిగి, ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. తొందరగా రిలీజ్ చేస్తే.. యజమానులకు ఉపయోగం. వేలం వేసినా.. ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. అలా జరగట్లేదు. వాహనం ఎందుకూ పనికిరాకుండా పోయాక పదికో.. పాతికకో.. వేలం వేసుకోవాల్సి వస్తోంది. జిల్లాలోని చాలా పోలీసు స్టేషన్లలో పట్టుబడిన వాహనాలు మట్టికొట్టుకుపోతున్నాయి.
కేసు పరిష్కారం కావాల్సిందే..
రోడ్డు ప్రమాదాలు తమిళనాడు, కర్ణాటక, రాషా్ట్రలకు బియ్యం, గ్రానైట్, ఇసుక, ఎర్రచందనం, గంజాయి తదితర అక్రమ రవాణాకేసుల్లో పట్టుబడిన భారీ వాహనాలను పోలీసులు సీజ్ చేసి, స్టేషన పరిధిలోనే ఉంచుకుంటారు. వివిధ దాడుల్లో పోలీసులను చూసి, నిందితులు వదిలివెళ్లిన, చోరీ సమయంలో దుండగులు వదిలి వెళ్లే ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, లారీలను పోలీసుస్టేషన్లకు తీసుకొస్తారు. చిన్నపాటి ప్రమాదాలు జరిగితే పోలీసు స్టేషన్లలోనే పంచాయితీలు చేసి రాజీమార్గాల ద్వారా వాహనాలను యజమానులు తీసుకెళ్తుంటారు. మిగిలిన కేసుల్లో వాహనాలు స్టేషన్లలోనే కోర్టు ఉత్తర్వులు వచ్చేవరకూ వాటిని అలాగే ఉంచుతారు. ఏళ్ల తరబడి కేసులు నడుస్తూ ఇవన్నీస్టేషన పరిసర ప్రాంతాల్లోనే తుప్పు పట్టిపోతుంటాయి. మరికొన్ని కేసుల్లో కోర్టులు జరిమానాలు విధిస్తుంటాయి. వాహనానికి అంత విలువ లేకపోవడంతో యజమానులు వదిలివేస్తుంటారు. మరికొన్ని కేసులు పరిష్కారమయ్యే వరకు అలాగే ఉండిపోతాయన్నది పోలీసుల మాట. కేసు పరిష్కారమయ్యే వరకు మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేసే అవకాశం ఉండదు. పట్టుబడిన వాహనాలను సకాలంలో వేలం వేసేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టసవరణ చేయాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగైతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న వాదన వినిపిస్తోంది.
మాయమౌతున్న విడిభాగాలు
పోలీసు స్టేషన్లకు వచ్చిన వాహనాల విడిభాగాలు చాలావరకు మాయమవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్ల ఆవరణలో దూరంగా ఇలాంటి వాహనాలను ఉంచుతున్నారు. స్టేషన్లకు నిత్యం ఎంతోమంది కేసులు ఇతర పనులపై వచ్చి వెళ్తుంటారు. పగటిపూట వాహనాలను చూసినవారు రాత్రిపూట వాటి విడిభాగాలను తీసుకెళ్లి పోతుంటారు. మిగిలినవి మట్టిలో కలసిపోతున్నాయి.
పోలీసులు ఇలా చేస్తే..
ప్రమాదాలు, ఇతర కారణాలతో సీజ్‌చేసి, పోలీసుస్టేషనకు తీసుకెళ్లిన వాహనాలను రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పంచనామా చేయాలి. వాటిని ఆరు నెలలకోసారి బహిరంగ వేలం వేయాలి. ఇలా ఎక్కడా జరగలేదని స్పష్టమవుతోంది. అలాకాకపోతే జరిమానా కట్టి వాహనాలు తీసుకెళ్లని వారిని గుర్తించి, వేలం ద్వారా విక్రయిస్తే ప్రభుత్వానికైనా ఆదాయం వచ్చేది. పోలీసు శాఖలో ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది వాహనాలు పోలీసుస్టేషన్ల ఆవరణలో మగ్గుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసుశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంకెన్నాళ్లు ఇలా?
అక్రమ మద్యం, ఎర్రచందనం, చౌకబియ్యం, పొగాకు ఉత్పత్తులు ఇతరత్రా అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. కొన్నింటిలో కేసులు పెట్టి నిందితులను జైళ్లకు పంపారు. వాహనాలను సీజ్ చేశారు. ఇలా హిందూపురంలో వందలాది వాహనాలు పోలీస్ స్టేషన్లలో చెట్లతీగలు అల్లుకుని, తుప్పుపడుతున్నాయి. మరికొంతకాలం ఇలానే ఉంచితే ఎందుకూ పనికి రాకుండాపోయి, పాతసామాన్లకు కేజీల లెక్కన వేయాల్సి ఉంటుందే తప్ప ప్రభుత్వానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కేసులు పరిష్కారం అయితే కానీ వీటిని వేలం వేసే అవకాశం లేదని సెబ్, పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
కరోనాలో పెరిగిన మద్యం కేసులు
2020లో కరోనా కారణంగా లాక్‌డౌన విధించడంతో అక్రమార్జన కోసం పలువురు కర్ణాటక నుంచి పెద్దఎత్తున మద్యం అక్రమ రవాణా సాగించారు. పట్టుబడిన మద్యంతోపాటు వాహనాలను పోలీసులు సీజ్‌చేసి కేసులు నమోదు చేయడంతో పోలీసు స్టేషన్లకు వందల సంఖ్యలో వాహనాలు చేరాయి. ఈ మేరకు 2020 నుంచి ఇప్పటి వరకు గోరంట్ల మండలంలో 193 మద్యం కేసుల ద్వారా 208 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, మూడు ఆటోలు పట్టుబడ్డాయి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 20 కేసుల్లో 24 ద్విచక్రవాహనాలు, చోరీ, చీటింగ్, హత్య తదితర కేసుల్లో 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొత్తం 229 ద్విచక్రవాహనాలు పట్టుబడగా.. 2021లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన రెండు ట్రాక్టర్లు, పోలీసు స్టేషనకు చేరాయి. చిలమత్తూరు స్టేషనలో 300 ద్విచక్రవాహనాలు, 4 కార్లు, బొలేరోలు ఉన్నాయి.
వాహనాల విడుదలలో తీవ్ర జాప్యం
వాహనాలు పోలీసు స్టేషన నుంచి విడుదల కావాలంటే అందుకు సంబంధించిన అనుమతులు పొందాలి. అందులో భాగంగా నోటీసుల జారీకి నిర్ణీత గడువు నిబంధనల వల్ల తీవ్ర జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహన యజమానికి రెండు నోటీసులు ఇచ్చి, సంతకాలు తీసుకోవాలి. తరువాత ఆర్టీఓ ద్వారా వాహనం విలువను నిర్ధారించి, యజమాని నుంచి మొత్తాన్ని రాబట్టి, అందజేయాలి. యజమాని ఉత్సాహం చూపకపోతే అఽధికారుల నుంచి కాన్ఫికేషన ఉత్తర్వులు వచ్చిన వెంటనే బహిరంగ వేలం ద్వారా పోలీసులు రోడ్డు రవాణా అధికారులు కలిసి ప్రజలకు విక్రయిస్తారు. ఇప్పటి వరకు గోరంట్ల మండలంలో 2022 జనవరి 4న 23, మార్చి 25న 45 ద్విచక్రవాహనాలు వేలం వేశారు. చిలమత్తూరు మండలంలోనూ మూడుసార్లు జరిగిన వేలాల్లో వంద ద్విచక్రవాహనాలు విక్రయించారు. జిల్లా పునర్విభజన కారణంగా మూడు నెలలుగా వేలాలకు అనుమతులు రాలేదు.
చర్యలు వేగవంతం చేస్తాం..
గోరంట్ల పోలీసు స్టేషనలో 223 ద్విచక్రవాహనాలున్నాయి. వాటి యజమానులకు త్వరితగతిన నోటీసులు అందజేయడం ద్వారా ద్విచక్రవాహనాల విడుదలకు చర్యలు చేపడతాం. వాహనాల రక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం.
సుబ్బరాయుడు, సీఐ, గోరంట్ల