నిరుపయోగంగా ఖాళీ స్థలం

ABN , First Publish Date - 2022-05-28T06:49:03+05:30 IST

మండలకేంద్రంలో నడిబొడ్డున పోలీస్‌ శాఖకు చెందిన దాదాపు మూడెకరాలకు పైగా ఖాళీ స్థలం నిరుపయోగంగా ఉంది.

నిరుపయోగంగా ఖాళీ స్థలం
ఖాళీగా ఉన్న పోలీస్‌ శాఖ స్థలం

వ్యాపార సముదాయం నిర్మిస్తే పలువురికి

ఉపయోగకరం అంటున్న ప్రజలు

గాండ్లపెంట, మే27: మండలకేంద్రంలో నడిబొడ్డున  పోలీస్‌ శాఖకు చెందిన దాదాపు మూడెకరాలకు పైగా  ఖాళీ స్థలం నిరుపయోగంగా ఉంది. ఇందులో వ్యాపార సముదాయం నిర్మిస్తే పలువురికి ఉపయో గకరంగా మారి ఉపాధి దొరుకుతుందని, ఆ శాఖకు ఆదాయం వస్తుందని మండల ప్రజలు అంటున్నారు.  మండలకేంద్రంలో కదిరి, రాయచోటి, మల్లమీదపల్లి ప్రధాన రహదారిలో స్థానిక పోలీస్‌ స్టేషనకు సంబంధించి దాదాపు నాలుగు ఎకరాలకు పైగా స్థలం ఉంది. ఇందులో కొంతభాగం పోలీస్‌ స్టేషనను, పోలీస్‌ క్వార్టర్లు నిర్మించారు. మిగిలిన స్థలంలో దాదాపు 50నుంచి 60 వ్యాపార గదులు నిర్మించవచ్చు. ప్రధాన రహదారి పక్కనే పోలీస్‌ స్టేషన ఆవరణంలో ఉన్న ఈ స్థలంలో  ఎలాంటి నిర్మాణాలు లేక పోవడంతో.... చిరు వ్యాపారులు రహదారిలోనే తోపుడు బండ్లపై పలు రకాల వస్తువులను  విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతమంది దుకాణాలు ఏర్పాటుచేసుకోవడానికి స్థలం దొరకక పోవడంతో కదిరి పట్టణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారిలో చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునేందుకు గదుల సౌకర్యం లేకపోవడంతో వర్షకాలం, ఎండ కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పామిడి, అనంతపురంలో పోలీస్‌ కాంప్లెక్సుల ద్వారా, ఓడీసీ, అనంతపురంలో పెట్రోల్‌ బంక్‌ల ద్వారా  పోలీసులకు ఆదాయం వస్తోంది. గాండ్లపెంట మండలంలో పోలీస్‌ స్టేషన ప్రాంతంలో కాంప్లెక్సు, పెట్రోల్‌ బంక్‌ నిర్మాణం చేపడతామని గతంలో పలువురు అధికారులు వెల్లడించారు. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో వ్యాపారంతో జీవనం సాగించేవారు ఇబ్బందులు పడుతున్నారు. కాంప్లెక్సు నిర్మాణంతో ఇటు పేదలకు జీవనోపాధి, పోలీసులకు ఆదాయం ఉంటుందని మండల ప్రజలు అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి కాంపెక్సు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం - భవ్యకిషోర్‌, డీఎస్పీ 

 గాండ్లపెంట పోలీస్‌ స్టేషన ఆవరణంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఖాళీ ఉంది. ఆ స్థలంలో పోలీస్‌ కాంప్లెక్సు నిర్మాణం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.  


Updated Date - 2022-05-28T06:49:03+05:30 IST