మూడుకు పదకొండు..!

ABN , First Publish Date - 2022-09-27T05:12:33+05:30 IST

రోడ్డు వెడెల్పులో ఆయన 3 సెంట్లు కోల్పోయారు.

మూడుకు పదకొండు..!
ఈ 11 సెంట్ల స్థలంపైనే కన్నేసిన ఆ అధికార పార్టీ నాయకుడు

రోడ్డు విస్తరణ పరిహారం పేరిట అర్పణ

అధికార పార్టీ నాయకుడికి విలువైన భూమి

అధికారుల వద్ద చక చకా కదులుతున్న ఫైలు

కంబదూరు (కళ్యాణదుర్గం), సెప్టెంబరు 26: రోడ్డు వెడెల్పులో ఆయన 3 సెంట్లు కోల్పోయారు. బదులుగా ఏకంగా 11 సెంట్ల ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ఆయనకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ అధికార పార్టీ నాయకుడికి అప్పనంగా ధారాదత్తం చేసే దిశగా పావులు కదులుతున్నాయి. పక్క నియోజకవర్గానికి చెందిన ఆ నాయకుడికి లబ్ధి చేకూర్చేందుకు మున్సిపల్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయన కోల్పోయిన 3 సెంట్ల భూమి విలువ సుమారు రూ.45 లక్షలు కాగా.. ప్రస్తుతం కట్టబెట్టాలని చూస్తున్న స్థలం విలువ ఏకంగా రూ.2.75 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

మిగిలినవారికి ఏదీ..?

2015లో కళ్యాణదుర్గం పట్టణంలో రోడ్డు వెడెల్పు చేశారు. ఈ కారణంగా 24 మంది పూర్తిగా, మరో వంద మందికి పైగా పాక్షికంగా నష్టపోయారు. వీరికి ఇంతవరకు  పరిహారం ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ స్థలంకూ డా చూపలేదు. రోడ్డు వెడెల్పు కారణంగా ఆర్థికంగా చితికిపోయి, బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాలకు వలసవెళ్లినవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయమూ చూపలేదు. కాని రాజకీయంగా ఎదిగిన ఓ అధికార పార్టీ నాయకుడిపై మాత్రం అపార ప్రేమ కనబరుస్తున్నారు. ఆ 11 సెంట్ల స్థలాన్ని ఆయనకు అప్పగించేందుకు అధికారులు సర్వే చేస్తుండగా, బాధితులు అక్కడికి వెళ్లి వాగ్వాదానికి దిగారని, దీంతో అక్కడి నుంచి వారి వెళ్లిపోయారని తెలుస్తోంది. అధికారులు గుట్టుగా సాగిస్తున్న ఈ వ్యవహారం బాధితుల కారణంగా బహిర్గతం అయింది. దీంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ప్రజాసంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు. 
Read more