రాప్తాడులో బెదిరించారు.. తెలంగాణలో స్వాగతించారు!

ABN , First Publish Date - 2022-11-19T00:34:51+05:30 IST

రాప్తాడు వద్ద ఏర్పాటు కావాల్సిన వస్త్ర పరిశ్రమ.. జాకీ తెలంగాణకు తరలిపోయింది. తమిళనాడులోని కొయంబత్తూరులో ఏర్పాటు చేయాల్సిన ఈ పరిశ్రమను తెలుగుదేశం ప్రభుత్వంలో, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాకు తీసుకువచ్చారు. నాటి మంత్రి పరిటాల సునీత, టీడీపీ జిల్లా నాయకుల అభ్యర్థన మేరకు రాప్తాడు వద్ద ఈ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాప్తాడులో బెదిరించారు.. తెలంగాణలో స్వాగతించారు!
జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన స్థలంలో ధర్నా చేస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌, టీడీపీ నాయకులు (ఫైల్‌)

ఇబ్రహీంపట్నం, సిద్దిపేటకు తరలిన జాకీ

రాప్తాడుకు తెప్పించిన నాటి సీఎం చంద్రబాబు

భయపెట్టి.. పారిపోయేలా చేసిన వైసీపీ నాయకులు

పరిటాల కుటుంబం పోరాడినా.. స్పందించని ప్రభుత్వం

కరువు కాటకాలకు నిలయం ఉమ్మడి అనంతపురం జిల్లా. ఇక్కడి రైతులు, రైతు కూలీలు, వృత్తిపనివారూ పొట్ట చేతబట్టుకుని దూర ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ దుర్భర పరిస్థితుల నుంచి జిల్లావాసులను గట్టెక్కించాలంటే పరిశ్రమల స్థాపన ఒక్కటే మార్గం. ఆ దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించింది. పెనుకొండ వద్ద కియ పరిశ్రమను ఏర్పాటు చేయించింది. అదే తరహాలో రాప్తాడు వద్ద గార్మెంట్‌ పరిశ్రమ జాకీని ఏర్పాటు చేయించేందుకూ చొరవ చూపింది. భూమి కేటాయించి, మౌలిక వసతుల దిశగా అడుగులు వేసింది. ఇంతలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి రాగానే.. కమీషన కోసం డిమాండ్‌ చేశారు. దీంతో విస్తుపోయిన జాకీ ప్రతినిధులు.. పరిశ్రమ స్థాపించాలనే ఆలోచననే విరమించుకున్నారు. ఈ అవకాశాన్ని తెలంగాణ అందిపుచ్చుకుంది. తమ రాషా్ట్రనికి రావాలని స్వాగతించింది. ఇక్కడి నుంచి ఒకటి తరలిపోయి.. అక్కడ రెండుగా ఏర్పాటు అవుతోంది. తమిళనాడులో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమను చంద్రబాబు అనంతకు తెప్పించారు. దాన్ని కాపాడుకుని.. అభివృద్ధి చేయాల్సిన వైసీపీ నాయకులు.. భయపెట్టి.. పొరుగు రాషా్ట్రనికి తరలిపోయేలా చేశారు.

రాప్తాడు, నవంబరు 18: రాప్తాడు వద్ద ఏర్పాటు కావాల్సిన వస్త్ర పరిశ్రమ.. జాకీ తెలంగాణకు తరలిపోయింది. తమిళనాడులోని కొయంబత్తూరులో ఏర్పాటు చేయాల్సిన ఈ పరిశ్రమను తెలుగుదేశం ప్రభుత్వంలో, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాకు తీసుకువచ్చారు. నాటి మంత్రి పరిటాల సునీత, టీడీపీ జిల్లా నాయకుల అభ్యర్థన మేరకు రాప్తాడు వద్ద ఈ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.200 కోట్ల పెట్టుబడితో 28 ఎకరాల్లో పరిశ్రమను స్థాపించేలా ఒప్పందం కుదిరింది. 2018లో ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. మొదట 28 ఎకరాల స్థలం చుట్టూ రూ.కోటి ఖర్చుతో ప్రహరీ నిర్మించారు. పరిశ్రమ ఏర్పాటుకు సామగ్రి, కార్మికులను సిద్ధం చేశారు. ఈ లోగా 2019 సాధారణ ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం వైసీపీ చేతుల్లోకి వెళ్లింది. అధికార పార్టీ నాయకులు రంగప్రవేశం చేశారు. రాప్తాడు వద్ద జాకీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే తమకు రూ.15 కోట్లు కమీషన ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనికి కంపెనీ ప్రతినిధులు ఒప్పుకోలేదు. దీంతోపాటు ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు. ఫలితం లేకపోవడంతో రాప్తాడు వద్ద పరిశ్రమ స్థాపన ఆలోచనను విరమించుకున్నారు. 2020లో సామగ్రిని తరలించారు.

మాటలతో సరిపెట్టారు..

మారిన పరిస్థితుల నేపథ్యంలో జాకీ పరిశ్రమ ప్రతినిధులు మనసు మార్చుకున్నారు. 2020లో సామగ్రితో తరలివెళ్లారు. ఆ తరువాత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా ్‌షరెడ్డి పలుమార్లు ఈ విషయమై స్పందించారు. జాకీ స్థానంలో గార్మెంట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీలు గుప్పించారు. కానీ రెండేళ్లు గడిచినా అలాంటివేవీ రాలేదు. పైగా, ఇక్కడి నుంచి వలస వెళ్లిన జాకీ పరిశ్రమ.. తెలంగాణలో ఏర్పాటు అవుతోంది. ఇబ్రహీంపట్నం, సిద్దిపేటలో జాకీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

పరిటాల కుటుంబం పోరాడినా..

జాకీ పరిశ్రమను కాపాడుకునేందుకు పరిటాల కుటుంబం పోరాడినా ఫలితం లేకపోయింది. జాకీ కంపెనీ ప్రతినిధులను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి కమీషన కోసం డిమాండ్‌ చేస్తున్నారని సీఎం జగనకు మాజీ మంత్రి పరిటాల సునీత లేఖరాశారు. పరిశ్రమల శాఖ అప్పటి మంత్రి గౌతంరెడ్డికి కూడా లేఖ రాశారు. అయినా ఎవరూ స్పందించలేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ, జాకీ పరిశ్రమను ఏర్పాటు చేయించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ పాదయాత్ర చేశారు. జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన స్థలం వద్ద నుంచి రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయం వరకూ వేలాది మందితో కలిసి నడిచారు. జాకీ పరిశ్రమ తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

యువతకు నిరాశ

జాకీ పరిశ్రమ ఏర్పాటై ఉంటే ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేవి. జాకీ పరిశ్రమలో మూడు షిఫ్టుల్లో 6 వేల మంది ఉద్యోగులు పనిచేసేవారు. పరోక్షంగా మరో 4 వేల మందికి ఉపాధి దొరికేది. ఇలా మొత్తం 10 వేల మందికి జీవనోపాధి లభించేది. యువత ప్రయోజనాల కంటే.. ధనార్జనే ముఖ్యమని అధికార పార్టీ నాయకులు భావించి, బెదిరింపులకు దిగడంతో పరిశ్రమ వలస పోయింది. యువత ఆశలు ఆవిరయ్యాయి.

Updated Date - 2022-11-19T00:34:54+05:30 IST