ఎకరం విలువ రూ.25 లక్షల వరకూ..

ABN , First Publish Date - 2022-10-07T05:44:58+05:30 IST

ప్రభుత్వ భూమిపై వైసీపీ కన్ను పడింది. భూ పంపిణీని అవకాశంగా తీసుకొని రూ.30 కోట్ల భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి

ఎకరం విలువ రూ.25 లక్షల వరకూ..
చదును చేసిన భూమి

400 ఎకరాలపై వాలిన వైసీపీ

హైవేకి సమీపంలో భారీగా చదును

భూ పంపిణీ పేరిట కాజేసే యత్నం

రెవెన్యూ సిబ్బందితో ముడుపుల ఒప్పందం

తాడిపత్రి, అక్టోబరు 6: ప్రభుత్వ భూమిపై వైసీపీ కన్ను పడింది. భూ పంపిణీని అవకాశంగా తీసుకొని రూ.30 కోట్ల భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుకబడిన తరగతుల వారిని అడ్డుపెట్టుకొని కొందరు వైసీపీ నాయకులు తెరవెనుక తతంగం నడిపిస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వివిధ గ్రామాల పరిధిలో రెండు రోజులుగా భూమి చదును కార్యక్రమం జరుగుతోంది. భూ పంపిణీకి సమయం దగ్గర పడుతుండడంతో చదును చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా యంత్రాలతో పనులు చేయిస్తున్నారు. 


400 ఎకరాలపై..

తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి కొండ ప్రాంతంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొండపై గాలిమరలు ఏర్పాటు చేశారు. కింది ప్రాంతం భూమిని కాజేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈ ప్రాంతం తాడిపత్రి, పుట్లూరు మండలాల సరిహద్దులో ఉంది. తాడిపత్రి మండల సరిహద్దులో యర్రగుంటపల్లి సర్వే నెంబర్‌ 1390లో వంద ఎకరాలు, పుట్లూరు మండలం చింతకుంట సర్వే నెంబర్‌ 1లో 127 ఎకరాలు, అరకటవేముల సర్వే నెంబర్‌ 1లో 65 ఎకరాలు ఉంది. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట సమీపంలోని ఫారె్‌స్టకు దగ్గరగా సర్వే నెంబర్‌ 413లో 130 ఎకరాలు ఉంది. ఈ భూమి అంతా తాడిపత్రి-అనంతపురం హైవేకు అతి సమీపంలో ఉంది. ప్రస్తుతం ఫోర్‌లైనగా ఉన్న హైవే త్వరలో సిక్స్‌లైనగా మారనుంది. చింతకుంట, అరకటవేముల, యర్రగుంటపల్లి సర్వే నెంబర్లలోని భూమి హైవేకు అర కిలోమీటర్‌ దూరంలో ఉంది. ఈ భూమి ఎకరం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతోంది. పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట సమీపంలోని భూమి హైవేకి అతిసమీపంలో ఉంది. ఈ భూమి ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ధర ఉంటుంది. ఈ భూమి సమీపంలో శివాలయం, నాగులయ్యస్వామి పుట్ట ఉన్నాయి. శివాలయం మాన్యం కూడా కొంతవరకు ఉంది. 


యంత్రాలతో చదును

భూ పంపిణీలో వీలైనంత కాజేసేందుకు వైసీపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. సాగులో ఉన్నట్లు చూపించేందుకు యంత్రాలతో చదును చేస్తున్నారు. భూ పంపిణీకి అర్హులైన వారి అధీనంలో భూమి ఉండాలి. సాగులో ఉన్న వారు మాత్రమే భూ పంపిణీ ద్వారా పట్టా పొందేందుకు అర్హులు. ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకొని, తమవారికి భూమి ఇప్పించేందుకు యంత్రాలతో చదునుచేసి, సాగులో ఉన్నట్లు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన తరగతుల వారికి ఇప్పిస్తున్నట్లు చూపించి, పట్టా పొందిన తరువాత స్వాధీనం చేసుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని సమాచారం. 


చూసీ చూడనట్లు.. 

ప్రభుత్వ భూమిని చదును చేస్తున్న విషయం తెలిసినా, అధికారులు పట్టించుకోవడం లేదు. తాడిపత్రి, పుట్లూరు, పెద్దపప్పూరు మండలాల పోలీసు, రెవెన్యూ పరిధిలో ఈ భూమి ఉంది. తాడిపత్రి పోలీసు, రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా స్పందించి వదిలేశారు. మిగిలిన రెండు మండలాల అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీవారు అయినందుకే ఎందుకు వచ్చిన తంటా అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా వైసీపీ మద్దతుదారులు ధైర్యంగా చదును చేస్తున్నారు. 


పైసా వసూల్‌

భూ పంపిణీలో తమకు అనుకూలమైనవారికి పట్టాలు దక్కేలా కొందరు రెవెన్యూ సిబ్బందితో వైసీపీ మద్దతుదారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారని సమాచారం. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. విలువైన భూమి కావడంతో భారీగా ముడుపులు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. ఈ ముడుపుల ఒప్పందం కారణంగా, చదును కార్యాక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. చదును చేసిన భూమి వివరాలను భూ పంపిణీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


2004లోనే నిలుపుదల

2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భూ పంపిణీ చేపట్టారు. యర్రగుంటపల్లి సర్వే నెంబర్‌ 1390లో  వంద ఎకరాలు, పుట్లూరు మండలం చింతకుంట సర్వే నెంబర్‌ 1లో 127 ఎకరాలకు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. తాడిపత్రికి చెందిన ఓ నాయకుడు పెద్దఎత్తున డబ్బులు తీసుకుని, అనంతపురం, పరిసర ప్రాంతాల వారిని లబ్ధిదారులుగా జాబితాలో చేర్పించారు. అయితే, పంచాయతీ సర్పంచ, అధికారుల నుంచి నో అబ్జెక్షన సర్టిఫికెట్‌ తీసుకురావాలని రెవెన్యూ అధికారులు సూచించడంతో బాగోతం బయటపడింది. దీనిపై స్పందించిన అప్పటి మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేయించారు. హైవేకు అతి సమీపంలో ఉన్న వందల ఎకరాల భూమి, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో నాటి మంత్రి జేసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more