ఎలుకలు కొరికేస్తున్నాయి!

ABN , First Publish Date - 2022-11-30T03:26:19+05:30 IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవాఘడ్‌ గిరిజన సంక్షేమ గురుకుల వసతి గృహం..

ఎలుకలు కొరికేస్తున్నాయి!

గురుకుల విద్యార్థుల లబోదిబో

తాజాగా ఎనిమిది మందికి ఆస్పత్రిలో చికిత్స

గుత్తి, నవంబరు 29: అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవాఘడ్‌ గిరిజన సంక్షేమ గురుకుల వసతి గృహం.. ఇక్కడి విద్యార్థులకు రాత్రి అవుతోందంటే భయమే.. కంటినిండా నిద్ర పోవాలన్నా కలవరమే. దీనికి కారణం ఎలుకలు. నిద్రపోతే ఎప్పుడు ఏ మూల నుంచి ఏ ఎలుక వచ్చి కొరికేస్తుందో తెలియదు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికీ నిజమని వసతి గృహాన్ని సందర్శిస్తే తెలుస్తుంది. ఈ వసతి గృహం డార్మెటరీలో అపరిశుభ్రత నెలకొంది. ఈ కారణంగా తిష్ఠవేసిన ఎలుకలు రాత్రిళ్లు తమను కొరుకుతుంటాయని విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఎనిమిది మందిమీద ఎలుకలు దాడిచేసి కాలి వేళ్లు, చేతి వేళ్లను కొరికాయి. బాధిత విద్యార్థులను వసతి గృహం సిబ్బంది మంగళవారం ఉదయం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు వ్యాక్సిన్‌ వేసి పంపించారు. మరో మూడు డోసులు వ్యాక్సిన్‌ వేస్తామని తెలిపారు. ఇది కొత్త విషయం కాదని విద్యార్థులు పేర్కొనడం అక్కడి దుస్థితిని తెలియజేస్తోంది. అప్పుడప్పుడు ఒకరిద్దరు వచ్చి చికిత్స చేయించుకుని వెళ్తుంటారని, మంగళవారం ఒకేసారి ఎనిమిది మంది వచ్చారని ఆస్పత్రి వైద్య సిబ్బంది తెలిపారు. ఎలుకల బెడద గురించి తెలిసినా, గురుకుల పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులను ఎలుకలు కొరికినమాట వాస్తవమేనని వైస్‌ ప్రిన్సిపాల్‌ రవీంద్రబాబు అన్నారు. స్థానికంగా ఏఎన్‌ఎం లేకపోవడంతో గుత్తి ఆస్పత్రికి పంపామని, ఎలుకల నిరవారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-11-30T03:26:21+05:30 IST