అధ్యక్షురాలే ఆలస్యంగా...
ABN , First Publish Date - 2022-12-31T00:38:33+05:30 IST
అధ్యక్ష పీఠంపై కూర్చుని స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నడిపే అధ్యక్షురాలు జడ్పీ చైర్‌పర్సన బోయగిరిజమ్మ ఆలస్యంగా వచ్చారు. సీఈఓ నుంచి ఇతర సభ్యులు, జిల్లా అధికారులు సైతం అధ్యక్షురాలు వచ్చే వరకూ వేచిచూశారు.
జడ్పీ స్టాండింగ్ కమిటీకి గంటన్నర లేట్‌గా గిరిజమ్మ
తూతూమంత్రంగా సమావేశాలు
అనంతపురం విద్య, డిసెంబరు 30: అధ్యక్ష పీఠంపై కూర్చుని స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నడిపే అధ్యక్షురాలు జడ్పీ చైర్‌పర్సన బోయగిరిజమ్మ ఆలస్యంగా వచ్చారు. సీఈఓ నుంచి ఇతర సభ్యులు, జిల్లా అధికారులు సైతం అధ్యక్షురాలు వచ్చే వరకూ వేచిచూశారు. తర్వాత సమావేశాలు నిర్వహించినా...తూతూ మంత్రంగా నిర్వహించి మమ అనిపించారు. శుక్రవారం జడ్పీలో 1, 7వ స్టాండింగ్ కమిటీ సమావేశాలు వేర్వేరుగా నిర్వహించారు. జడ్పీ సమావేశ మందిరంలో ఆర్థిక, ప్రణాళిక కమిటీ (1వ), అదనపు సమావేశ మందిరంలో వర్క్స్ స్టాండింగ్ కమిటీ (7వ) పెట్టారు. ఆర్థిక, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని జడ్పీ చైర్‌పర్సన అధ్యక్షతన నిర్వహించాల్సి ఉండగా ఆమె గంటన్నర ఆలస్యంగా వచ్చారు. దీంతో సీఈఓ భాస్కర్‌రెడ్డి, ఇతర జడ్పీటీసీ సభ్యులు, కో-ఆప్షనసభ్యులు సైతం మింగలేక...కక్కలేక...అలాగే గంటన్నర వేచి చూశారు. అధ్యక్షురాలు వచ్చిన తర్వాత ఇలా చర్చ మొదలెట్టి...అలా ముగించారు.
నామమాత్రంగా...
రోడ్ల మరమ్మతులకు నిధులున్నా..అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఆమె మండిపడ్డారు. ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారులు పాడైన రోడ్లకు మరమ్మతులు చేయించాలని జడ్పీ చైర్మన ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్‌కు సంబంధించిన పనుల బిల్లులు సకాలంలో రికార్డ్‌చేసి బిల్లులు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. గోరంట్ల కో- ఆప్షన సభ్యుడు బాషా మాట్లాడుతూ దేవాలయాలు, మసీదుల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. లేపాక్షి, గోరంట్ల జడ్పీటీసీలు రోడ్లు, వంతెనల పనులు నాణ్యతతో చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన సుధాకర్‌రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, జడ్పీటీసీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.