గాడితప్పిన కేజీబీవీ

ABN , First Publish Date - 2022-12-07T01:23:36+05:30 IST

కొందరు అనాథలు. మరికొందరికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఉండరు. అందరూ నిరు పేద కుటుంబాలవారు. అలాంటి పసివారి జీవితాల్ని బాగుచేసే భాగ్యం కేజీబీవీల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి దొరుకుతుంది. కానీ ఈ బాధ్యతను గాలికి వదిలేశారు. కేజీబీవీలను పర్యవేక్షించే జీసీడీఓ పోస్టును అనర్హులకు కట్టబెట్టారు. దీంతో నిర్వహణ గాడితప్పింది.

గాడితప్పిన కేజీబీవీ
ఈ ఏడాది పెద్దపప్పూరు కేజీబీవీలో అన్నంలో పురుగులు....

తరచూ ఫుడ్‌ పాయిజన

సిబ్బంది మధ్య కోల్డ్‌ వార్‌

ఆహారంలో నాణ్యతా లోపం

పర్యవేక్షణ గాలికి వదిలేశారు

జీసీడీఓ విభాగం వైఫల్యంపై నోరు మెదపరా...?

కొందరు అనాథలు. మరికొందరికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఉండరు. అందరూ నిరు పేద కుటుంబాలవారు. అలాంటి పసివారి జీవితాల్ని బాగుచేసే భాగ్యం కేజీబీవీల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి దొరుకుతుంది. కానీ ఈ బాధ్యతను గాలికి వదిలేశారు. కేజీబీవీలను పర్యవేక్షించే జీసీడీఓ పోస్టును అనర్హులకు కట్టబెట్టారు. దీంతో నిర్వహణ గాడితప్పింది. చుట్టపు చూపు తనిఖీలతో భద్రతకు భరోసా లేకుండా పోయింది. ఉన్నతాధికారులు సైతం నాడు-నేడు, ఇతర పనుల్లో నిమగ్నమై.. కేజీబీవీలవైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా కేజీబీవీలు అధ్వానంగా తయారయ్యాయి. వాటి దుస్థితికి శింగనమల కేజీబీవీ ఘటన అద్దంపడుతోంది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 80 మంది బాలికలు కడుపునొప్పి, వాంతులతో అల్లాడిపోయారు. రాత్రిపూట శింగనమల ఆసుపత్రి, అనంతపురం ఆసుపత్రికి పరుగులు తీయాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం

మేలుకుంటుందా..!

అనంతపురం విద్య, డిసెంబరు 6: బాలికా విద్యకు పెద్ద పీట వేసేందుకు ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో ఎక్కువగా పేద పిల్లలు, అనాఽథలు, పాక్షిక అనాథలను చేర్చుకున్నారు. వారికి నాణ్యమైన ఆహారం, వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 62 కేజీబీవీల్లో 13 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇంతమంది ఆశ్రయం పొందుతున్న కేజీబీవీలను గాలికి వదిలేశారు. తనిఖీ చేయాల్సిన అధికారులు ఆఫీసులకు, ఇళ్లకు పరిమితమయ్యారు. చుట్టపు చూపుతా వెళ్లివస్తున్నారు. ఫలితంగా విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. పలుమార్లు ఫుడ్‌ పాయిజన్‌ సమస్యలు తలెత్తినా అధికారుల్లో మార్పు రావడం లేదు.

పదేపదే పరుగులు

- కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఏడాదిలో మూడు నాలుగు చోట్ల ఫుడ్‌ పాయిజన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తోంది. తరచూ ఎక్కడో ఒకచోట భోజనంలో పురుగులు వస్తున్నాయి. నాణ్యత లోపించడం వల్ల విద్యార్థినులు ఆసుపత్రుల పాలవుతున్నారు.

- ఫిబ్రవరి రెండో వారంలో పెద్ద పప్పూరు కేజీబీవీలో అన్నంలో పురుగులు కనిపించాయి. ఆరు నెలల క్రితం యల్లనూరు కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన్‌అయింది. పదుల సంఖ్యలో విద్యార్థులు అవస్థలు పడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

- తాజాగా శింగనమల కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన అయింది. బొరుగులు తినడం, బూస్ట్‌ తాగడం వల్ల సమస్య తలెత్తిందని అధికారులు, సిబ్బంది చెబుతున్నా రు. కానీ ఆరోజు మధ్యాహ్న భోజనంలో ఇచ్చిన పెరుగు బాగాలేదని, తోడు సరిగా వేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. కారణం ఏదైనా, ఏకంగా 80 మంది బాలికలు ఆస్పత్రిపాలయ్యారు. బాలికల తల్లిదండ్రులు, బంధువులు అర్ధరాత్రి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సివచ్చింది.

కీలక పోస్టులో..

ఉమ్మడి జిల్లాలో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ 13 వేల మంది బాలికలు కేజీబీవీల్లో చదువుకుంటున్నారు. టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ 1600 మందికి పైగా ఉన్నారు. వీరిని పర్యవేక్షణ బాధ్యతలను గర్ల్‌ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ (జీసీడీఓ) నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులో సాధారణంగా ఎంఈఓ లేదా హెచఎంని నియమిస్తారు. రెండేళ్ల క్రితం ఈ పోస్టు ఖాళీ పడితే.. ఓ స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారు. ప్రస్తుతం పనిచేస్తున్న జీసీడీఓ రెబెకా.. ఆ పోస్టుకు అర్హులు కారు. అప్పటి కలెక్టర్‌, ఇతర అధికారులు ఆమెను నిబంధనలకు విరుద్ధంగా నియమించడం విమర్శలకు తావిచ్చింది.

చర్యలు కింది వారిపైనేనా..?

శింగనమల ఘటనలో కింది వారినే టార్గెట్‌ చేశారు. జీసీడీవో విభాగం అధికారులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ కేజీబీవీలో అధికార పార్టీకి మద్దతుదారులైన ఉద్యోగులను వదిలేసి, ఇతరులను బలి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయినవారిని కాపాడుకునేందుకు ఇతరులపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే తప్ప కేజీబీవీల్లో పరిస్థితి మెరుగుపడేలా లేదు.

తనిఖీలు తూచ..

వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది సిబ్బంది పనిచేసే చోట నిత్యం ఏదో ఒక చోట సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. తరచూ తనిఖీలు చేస్తేగానీ పరిస్థితులు చక్కబడవు. అయితే జీసీడీఓ విభాగం అధికారులు కేజీబీవీలకు చుట్టపు చూపుగా వెళ్తున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు విభజన తరువాత పలువురు అధికారులు రిలీవ్‌ కావడం కూడా పర్యవేక్షణపై ప్రభావం చూపుతోంది. కొందరు సెక్టోరియల్‌ అధికారులు సైతం విజిట్లు పక్కనబెట్టి, కార్లను సొంత పనులకు వాడేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారు తిరిగేవాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ పెడితే.. ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, తనిఖీలు చేస్తున్నారా లేదా అన్నది తేలుతుంది.

కోల్డ్‌ వార్‌

జిల్లా వ్యాప్తంగా చాలా కేజీబీవీల్లో కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. ప్రిన్సిపాళ్లపై టీచింగ్‌ స్టాఫ్‌, ఇతర ఉద్యోగులు పెత్తనం చెలాయిస్తున్నారు. స్థానికంగా ఉండటం, ఏళ్ల తరబడి పాతుకుపోవడంతో.. ప్రిన్సిపాళ్లను లెక్కచేయడం లేదు. సీఆర్టీలు, ప్రిన్సిపాళ్ల మధ్య, కంప్యూటర్‌ ఆపరేటర్లు సీఆర్టీల మధ్య, అకౌంటెంట్లు, ఇతర స్టాఫ్‌ మధ్య.. ఆధిపత్యపోరు నడుస్తోంది. దీనికితోడు కొందరు అధికార పార్టీ నాయకుల జోక్యంతో ప్రిన్సిపాళ్లు ఇబ్బంది పడుతున్నారు. శింగనమల కేజీబీవీలో కూడా కొన్ని రోజులుగా సిబ్బంది మధ్య వార్‌ నడుస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే పాలకు తోడు వేయలేదని, ఫుడ్‌ పాయిజన్‌కు ఇదే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ప్రిన్సిపాళ్ల పనితీరు మినహా... ఏనాడూ సిబ్బంది పనితీరుపై సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారులు సమీక్ష చేసిన సందర్భాలు లేవు. ఏది జరిగినా.. మొదట ప్రిన్సిపాళ్లను బలి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

విద్యార్థుల సంక్షేమాన్ని వదిలేశారు..

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేసింది. కేజీబీవీలలో భోజనం నాణ్యత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. శింగనమల కేజీబీవీలో 80 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు కావడం దీనికి నిదర్శనం. అనేకమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పర్యవేక్షణఅధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు కేజీబీవీలను తనిఖీ చేయాలి. అక్కడే నిద్ర చేస్తే సిబ్బందిలో కొంతై నా మార్పు వస్తుంది.

- నరేష్‌, ఎన్‌ఎ్‌సయూఐ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి

ఏజెన్సీలపై చర్య తీసుకోరా?

కేజీబీవీలకు ఎన్నో ఏళ్లుగా కొందరు సరుకులను సరఫరా చేస్తున్నారు. నాసిరకం సరుకులు ఇస్తున్నారు. వీటితో భోజనం తయారు చేస్తే నాణ్యత ఎలా ఉంటుంది..? నిపుణులైన వంట మనుషులు తయారు చేసినా చెడిపోవడం ఖాయం. అలాంటప్పుడు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఎలా..? ఏజెన్సీలపై ఎందుకు చర్యలు తీసుకోరు..? ఈ సమస్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి.

- విజయ్‌, ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు

పెత్తనం తగ్గాలి..

కమీషన్లకు కక్కుర్తి పడి అధికార పార్టీ నేతలు, అధికారులు కేజీబీవీల్లో నాణ్యతను గాలికి వదిలేశారు. ఫుడ్‌ పాయిజనకు నాసిరకం సరుకుల కూడా కారణం. కేజీబీవీలకు కాంట్రాక్టర్ల సరుకులు సప్లై చేసి లాభాలు నొక్కేస్తున్నారు.సరుకులు, కూరగాయల, పాలు, గుడ్ల నాణ్యతపై విచారించాలి. విద్యార్థుల అర్ధాకలి, అనారోగ్యాలకు రాష్ట్ర ప్రభుత్వమే పరోక్ష కారణం.

- సూర్యచంద్ర యాదవ్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి

Updated Date - 2022-12-07T01:23:40+05:30 IST