వంతెనపై భయంభయంగా..

ABN , First Publish Date - 2022-09-12T04:44:40+05:30 IST

మండలంలోని చాలా గ్రామాలకు ధర్మవరం నుంచి వెళ్లాలంటే ఆ వంక దాటాల్సిందే. లేదంటే ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.

వంతెనపై భయంభయంగా..
వంకలో ఉన్న చిన్నపాటి బ్రిడ్జికి ఇరువైపులా దిమ్మెలు లేని వైనం


బ్రిడ్జిపై నీరు పారుతుండడంతో ఇబ్బందులు

అధికవర్షం వస్తే రాకపోకలు బంద్‌ 

శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకోలు

ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు11:   మండలంలోని చాలా గ్రామాలకు ధర్మవరం నుంచి వెళ్లాలంటే ఆ వంక దాటాల్సిందే. లేదంటే ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో వర్షం వస్తే చాలు ఆ గ్రామా ల ప్రజలకు భయాందోళన మొదలవుతుంది. అధికవర్షాలు కురిస్తే ఆ వం క ఉధృతి తగ్గేవరకు ప్రయాణాలు మానుకోవాల్సిందే. ధర్మవరం మండ లంలోని ధర్మపురి, రావులచెరువు, వెంకటతిమ్మాపురం, మల్లాకాల్వ, ఓబుళ నాయునిపల్లి, దర్శినమల, నేలకోటతండా, నేలకోట, ఏలుకుంట్ల, తిప్పేపల్లి పంచాయితీల్లోని దాదాపు 30 గ్రామాల ప్రజలు ప్రతిరోజు ధర్మవరం పట్టణానికి చిన్నూరు వంక దారి నుంచి గానీ , ధర్మవరం చెరువు కట్ట రహదారి మీదుగాగానీ రాకపోకలు సాగిస్తుంటారు. పొద్దుపుట్టగానే పాల రైతులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ ఉద్యోగాలు చేసుకునే వారు, విద్య, వైద్యం, తదితర అవసరాల నిమిత్తం రోజూ ధర్మవరం పట్టణానికి రావాల్సిందే.  ఈ గ్రామాలకు ఓ ఆర్టీసీ బస్సుతో పాటు ఆటోలు, ద్విచక్రవా హనాలు నిత్యం తిరుగుతుంటాయి. అయితే వర్షం వస్తే ధర్మవరం చెరువు మరువపారగానే నాలుగు మరువల నీటి ధాటికి ఆ రహదారి నుంచి రాకపోకలు బంద్‌ అవుతాయి. దీంతో మరో దారి చిన్నూరు వంక మీదుగా పోవాల్సి ఉంది. ఈ చిన్నూరువంక మీదుగా ధర్మవరం మొదటి మరువ నీరుపారుతుంది. చిన్నూరు వంకలో ఉన్న చిన్నపాటి బ్రిడ్జి పైన నీరు పారుతుండటంతో వరద ఉధృతికి రాకపోకలు సాగించలేని పరి స్థితులు ఉన్నాయని ఆ గ్రామాల ప్రజలు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 10 రోజులుగా ఈ రహదారుల్లోని వంకల్లో నీరు పారుతుం డటంతో... ఆ గ్రామాల ప్రజలు భయంభయంగానే రాకపోకలు సాగిస్తు న్నారు. చిన్నూరువంకలో ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా దిమ్మెలు లేకపోవడంతో ఎప్పుడూ ఏమి జరుగుతుందోననే భయాందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. వంక ఉధృతి పెరిగితే రాకపోకలు బంద్‌ అవుతాయని వాపోతున్నారు. దీంతో పలువురు ఉపాధి కోల్పోవడంతో పాటు పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత బ్రిడ్జిని ఏర్పాటుచేసి తమగ్రామాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. 

అత్యవసర వైద్యం పొందాలంటే అంతేసంగతి

ఆ గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్యం పొందే పరిస్థితులు తలెత్తితే వెంటనే ధర్మవరం, ఇతర ప్రాంతాల ఆసుపత్రులకు తరలించాల్సిఉంది. ఉధృతంగా వంక పారితే  చాలా ఇబ్బందులు తప్పవని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ రావులచెరువు మీదుగా తిప్పేపల్లికి వెళ్లి అక్కడ నుంచి తుమ్మల మీదుగా ధర్మవరం వెళ్లాలన్నా తిప్పేపల్లి వద్ద చిత్రావతి వంక వెళ్లుతోందని గ్రామస్థులు తెలుపుతున్నారు. 


Updated Date - 2022-09-12T04:44:40+05:30 IST