ప్రేమ వివాహం తెచ్చిన తంటా

ABN , First Publish Date - 2022-03-04T06:22:49+05:30 IST

: ప్రేమ వివాహం ఇరు కుటుంబాల మధ్య తంటా తెచ్చిపెట్టింది.

ప్రేమ వివాహం తెచ్చిన తంటా
దాడిలో ధ్వంసమైన వాహనం

అత్తింట్లోని కుమార్తెను తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు

ఇరువర్గాల ఘర్షణ

పలువురికి గాయాలు

ఇరువర్గాలపై కేసు నమోదు

అనంతపురం క్రైం, మార్చి 3: ప్రేమ వివాహం ఇరు కుటుంబాల మధ్య తంటా తెచ్చిపెట్టింది. మూడునెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్లడానికి ఆమె తల్లిదండ్రులు, బంధువులు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లడం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇరువర్గాలవారు పరసర్పరం దాడికి దిగారు. దీంతో పలువురికి రక్తగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చిన్మయనగర్‌లో నివాసముంటున్న భారతి, చెన్నయ్య దంపతుల కుమార్తె గౌతమి.. నాయక్‌నగర్‌కు చెందిన ఎరుకుల నరేష్‌ ప్రేమించుకుని, మూడునెలల క్రితం వివాహం చేసుకున్నారు. గౌతమి పేరుమీదున్న ఆస్తులను తమ పేరున రాయుంచాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇందుకు తాను పోలీసు స్టేషనలోనే సంతకం పెడతానని గౌతమి చెప్పినట్లు తెలిసింది. ఆ వివాదం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం గౌతమి తల్లిందడ్రులు, బంధువులు బొలెరో వాహనంలో నేరుగా నాయక్‌నగర్‌లోని నరేష్‌ ఇంటికి చేరుకున్నారు. గౌతమిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘మా కూతుర్ని తీసుకెళ్తుంటే అడ్డుతగిలేందుకు నువ్వెవరు...?’ అని ప్రశ్నించారు. గౌతమిని తీసుకెళ్లకుండా నరేష్‌ బంధువులు అడ్డుకునే క్రమంలో ఇరువర్గాలకు చెందినవారు గొడవపడ్డారు. బొలెరో వాహనం అద్దాలు పగలకొట్టారు. ఈ ఘటనలో చెన్నప్ప, జయప్రకాష్‌, భారతి, గౌతమి, ఎస్‌.చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. త్రీటౌన ఎస్‌ఐ రామ్‌ప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్లడానికి వెళ్తే దాడి చేశారని గౌతమి తల్లి భారతి ఆరోపించారు. కార్పొరేటర్‌ చంద్రశేఖర్‌, నరేష్‌, ఈశ్వరయ్య, అతడి భార్యపై కేసు నమోదు చేయాలని కోరారు. నరే్‌షను ఇంట్లో ఉంచి గడియవేసి గౌతమిని కొట్టి లాక్కెళ్లే ప్రయత్నంలో కార్పొరేటర్‌ చంద్రశేఖర్‌తో పాటు ఇద్దరు మహిళలపై దాడి చేశారని నరేష్‌ బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై పరస్పర ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామ్‌ప్రసాద్‌ తెలిపారు.


కులాంతర వివాహం ఇష్టం లేకే: గౌతమి

కులాంతర వివాహం చేసుకోవడం నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఆ క్రమంలోనే నా భర్త నుంచి నన్ను దూరం చేయాలనుకున్నారు. నాకు వారి నుంచి రక్షణ కావాలి.

Read more