నత్తనడకన జగనన్న ఇళ్ల నిర్మాణం

ABN , First Publish Date - 2022-10-01T05:52:53+05:30 IST

రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇసుక సరఫరా ఆగిపోయుంది. ఈ ప్రభావం జగనన్న ఇళ్లపై పడింది.

నత్తనడకన జగనన్న ఇళ్ల నిర్మాణం
గార్లదిన్నెలో జగనన్న ఇళ్ల నిర్మాణం (ఫైల్‌)

ఆగుతూ.. సాగుతూ..

మూడేళ్లుగా వెంటాడుతున్న సమస్యలు

సకాలంలో అందని సామగ్రి, బిల్లులు

రెండు నెలలుగా ఆగిన ఇసుక సరఫరా


రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇసుక సరఫరా ఆగిపోయుంది. ఈ ప్రభావం జగనన్న ఇళ్లపై పడింది. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించకుండా, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని లబ్ధిదారులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలో డంప్‌ల నుంచి కూడా ఇసుక సరఫరా చేయలేని దుస్థితిలో అధికార యంత్రాంగం ఉంది. అధికారుల ఒత్తిడి తాళలేక కొందరు లబ్ధిదారులు మార్కెట్‌లో అధిక ధర చెల్లించి ఇసుక కొంటున్నారు. కొరతను గమనించి, కొందరు అధికారులు సైతం మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

- అనంతపురం సిటీ


మొదట్నుంచీ అంతే..

మూడేళ్ల క్రితం జిల్లాలో 67,772 మందికి జగనన్న ఇళ్లను మంజూరు చేశారు. ఎక్కడా ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. ఒక్కో సమయంలో ఒక్కో కారణంతో ఆటంకాలు ఎదురయ్యాయి. మొదట సామగ్రి ధరలు పెరగడం, ఆ తరువాత సకాలంలో బిల్లులు, సిమెంట్‌ సరఫరా కాకపోవడంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఆ తరువాత పట్టాలు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో కాస్త కదలిక వచ్చింది. తాజాగా భారీ వర్షాలకు ఇసుక సరఫరా నిలిచిపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. లబ్ధిదారులు ఇసుక కోసం నానా తిప్పలు పడుతున్నారు. గడిచిన మూడేళ్లలో 15,324 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి అయ్యింది. ఇప్పటికీ 7,616 ఇళ్ల నిర్మాణం ప్రారంభమే కాలేదు. 


ఇదేం తీరు..?

ఇంటి నిర్మాణ సామగ్రిని సకాలంలో లబ్ధిదారులకు సరఫరా చేయడం లేదు. కానీ ఉన్నతాధికారుల పేరిట లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని వెంటపడుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలలో అధికారుల తీరుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఇంటి నిర్మాణ సామగ్రిని జగనన్న లే ఔట్‌లకు మాత్రమే సరఫరా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం రూరల్‌, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, రాయదుర్గం అర్బన ప్రాంతాలలో ఇలా జరుగుతోందని సమాచారం. 


అడుగడుగునా సమస్యలే..

జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మాత్రమే ఇస్తోంది. ఇది ఏ మూలకూ సరిపోదు. అయినా, సొంతింటిపై ఆసక్తితో చాలామంది లబ్ధిదారులు పనులు ప్రారంభించారు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో అప్పు చేస్తున్నారు. ఇసుక, సిమెంట్‌ సకాలంలో సరఫరా కాకపోవడంతో సచివాలయ ఉద్యోగులు, హౌసింగ్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదిగో.. ఇదిగో అంటు అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో సర్వర్‌ పనిచేయడం లేదని సచివాలయ ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. ఇన్ని సమస్యల నడుమ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు


సర్వర్‌ పనిచేయలేదట.. 

మాది అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని ఓ గ్రామం. రెండేళ్ల కిందట జగనన్న ఇల్లు మంజూరు అయింది. 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. అయినా ఒక్క బిల్లు కూడా పడలేదు. రెండు నెలలుగా ఇసుక కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. సర్వర్‌ పనిచేయడం లేదని అంటున్నారు. మార్కెట్‌లో అధిక ధరకు కొనాల్సి వస్తోంది. సిమెంట్‌ కూడా అరకొరగానే సరఫరా చేశారు. అధికారులకు అడిగితే అదిగో.. ఇదిగో అంటున్నారు. నేను, నా భర్త కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు ఉంటే కష్టాలు తగ్గుతాయని పనులు మొదలు పెట్టాం. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియడం లేదు.

- ఓ మహిళ ఆవేదన


పట్టించుకోవడం లేదు..

మాది గుంతకల్లు డివిజన. నేను, నా భర్త కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నాం. రెండున్నరేళ్ల కిందట ప్రభుత్వం జగనన్న ఇల్లు మంజూరు చేయడంతో ఎంతో సంతోషించాం. ఆయితే సకాలంలో ఇంటి సామగ్రి సరఫరా చేయలేదు. ఇసుక కావాలని అడిగినా రెండు నెలల నుంచి పట్టించుకోవడం లేదు. కానీ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని  సచివాలయం సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. 80 శాతం నిర్మాణం పూర్తి అయ్యింది. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.20 వేలు పడింది. రూ.1.50 లక్షలు అప్పు చేశాం. ఇసుక బయట కొనాలంటే రెట్టింపు ధరలు చెప్తున్నారు.

- రమాదేవి


ట్రాక్టర్‌ ఇసుక రూ.6వేలు

మాది కళ్యాణదుర్గం డివిజన పరిధిలోని ఓ గ్రామం. అధికారులు ఇసుక సరఫరా చేయకపోవడంతో మార్కెట్‌లో ట్రాక్టర్‌ ఇసుకకు రూ.6 వేలు చెల్లించి కొంటున్నాం. అధికారులు ఒత్తిడి చేస్తుండటంలో మార్కెట్‌లో ఇసుక, సిమెంట్‌ కొని ఇంటిని నిర్మిస్తున్నాం. గతంలో నాసిరకం ఇసుకను సరఫరా చేశారు. ప్రశ్నిస్తే తీసుకుంటే తీసుకో.. లేకుంటే బయట కొనుక్కో.. అని అధికారులు అన్నారు. చేసేదిలేక డబ్బులు ఉన్నపుడల్లా నిర్మాణ పనులు చేయిస్తున్నాం. ఇప్పటి కైనా అధికారులు స్పందించి బిల్లులు, ఇసుక, సిమెంట్‌ ఇవ్వాలి. 

- లక్ష్మి 


జిల్లాలో ఇళ్ల నిర్మాణం పరిస్థితి

మంజూరైన ఇళ్ల సంఖ్య - 67,772

వివిధ దశలలో ఉన్నవి - 44,832

ఇప్పటి వరకు పూర్తి అయినవి - 15,324

పెండింగ్‌లో ఉన్న ఇళ్ల సంఖ్య - 7,616  

వర్షాలు రావడంతోనే..

జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున వర్షాలు రావడంతో ఇసుక సరఫరా కొంత కష్టతరంగా మారింది. డంప్‌ల నుంచి అవసరమైన వారందరికీ సరఫరా చేశాం. వారం రోజులుగా ఇసుక సరఫరా సక్రమంగా సాగుతోంది. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఉద్యోగులు కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. నిర్మాణ సామగ్రిని సకాలంలో సరఫరా చేయాలి. ఉద్యోగులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తాం.

- కేశవనాయుడు, ఇనచార్జి పీడీ, గృహ నిర్మాణశాఖ

Read more