ఇక్కడే ఉంటాడంట..!

ABN , First Publish Date - 2022-10-07T05:49:23+05:30 IST

మైనార్టీ సంక్షేమశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. సొంత శాఖకు సరెండర్‌ అయిన ఓ అధికారి.. అనంతను వీడటం లేదు.

ఇక్కడే ఉంటాడంట..!
మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయం

అనంతను వీడని ఆ అధికారి.. సరెండర్‌ రద్దుకు ప్రయత్నాలు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, అక్టోబరు 6: మైనార్టీ సంక్షేమశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. సొంత శాఖకు సరెండర్‌ అయిన ఓ అధికారి.. అనంతను వీడటం లేదు. ఇక్కడే కొనసాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ అధికారి కోసం అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి విజయవాడకు వెళ్లాడంటే.. ఆ అధికారి ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ అధికారిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చర్యలు తీసుకున్నారు. సొంతశాఖకు బదిలీ చేస్తూ గత నెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంత వరకూ ఆ అధికారి సొంతశాఖకు వెళ్లలేదు. అనంతలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారు. తనను అదేశాఖలో కొనసాగించేలా చూడాలని ఆయన వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖతో విజయవాడలోని కార్యాలయంలో రెండు రోజులపాటు తీవ్రంగా ప్రయత్నించాడని, ఫలితం లేక వెనుదిరిగాడని తెలిసింది. 


అంటకాగుతూ..

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి అధికార పార్టీ నేతలతో మొదటి నుంచి  అంటకాగుతున్నారు. ఏ సమస్య వచ్చినా వారిద్వారానే పరిష్కరించుకుంటున్నారు. సరెండర్‌ ఉత్తర్వులు వచ్చినా.. ఇప్పుడూ అధికార పార్టీవారినే ఆశ్రయించాడు. ఆయన కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధి రాజధానికి వెళ్లి మాట్లాడటం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. ఆ అధికారి తీరుపై కొందరు అధికార పార్టీ నాయకులూ అసంతృప్తిగా ఉన్నారు. ఆ అధికారికి మద్దతుగా ఉన్న ప్రజాప్రతినిధి అంటే వీరికి గిట్టడం లేదని సమాచారం. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి గతంలో రాష్ట్రశాఖకు ఫిర్యాదు చేశారు.


తలొగ్గుతారా...?

ఆరోపణల నేపథ్యంలో ఆ అధికారిని సొంతశాఖకు సరెండర్‌ చేస్తూ ప్రత్యేక జీవో జారీ చేశారు. దీన్ని మార్పించేందుకు ఆ అధికారి అనంతలోనే తిష్టవేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి సిఫార్సులు, రాజకీయ ఒత్తిళ్లకు రాష్ట్రస్థాయి అధికారులు ఎలా స్పందిస్తారనే  చర్చ జరుగుతోంది. ఒక్క అధికారి కోసం జీవోను వెనక్కు తీసుకుంటే.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Read more