జీతాలు పడలేదప్పో..!

ABN , First Publish Date - 2022-12-07T01:19:35+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పేరు చెబితే.. ‘వాళ్లకేం.. ఒకటోతేదీ జీతాలు వస్తాయ్‌.. రిటైరైనా పెన్షన వస్తుంది..’ అని అంటుంటారు. కానీ ఇది గతం, ఇప్పుడు అందరితోపాటు తమకూ కష్టాలు తప్పడం లేదని ఆ వర్గాలవారు వాపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని అంటున్నారు.

జీతాలు పడలేదప్పో..!

ఆరో తేదీ దాటినా అంతే

ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎదురుచూపు

ప్రభుత్వం తీరుపై బాధితుల ఆగ్రహం

అనంతపురం టౌన, డిసెంబరు 6: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పేరు చెబితే.. ‘వాళ్లకేం.. ఒకటోతేదీ జీతాలు వస్తాయ్‌.. రిటైరైనా పెన్షన వస్తుంది..’ అని అంటుంటారు. కానీ ఇది గతం, ఇప్పుడు అందరితోపాటు తమకూ కష్టాలు తప్పడం లేదని ఆ వర్గాలవారు వాపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని అంటున్నారు. ఈ నెల పోలీసులు, సచివాలయ ఉద్యోగులు, వైద్య, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ తదితర శాఖలవారు జీతాలు తీసుకున్నారు. కానీ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు పైసా ఇవ్వలేదు. జిల్లాలో 1.40 లక్షల మంది ప్రభుత్వం నుంచి జీతాలు, పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో ఉపాధ్యాయులు 20 వేల మంది, పెన్షనర్లు 30 వేల మంది ఉన్నారు. ఈ లెక్కన 50 వేల మందికి జీతం, పెన్షన ఇవ్వలేదు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 20 వేలకు పైగానే ఉన్నారు. వీరికి కూడా జీతాలు చెల్లించలేదు.

మరింత ఆలస్యం..?

జీతాల చెల్లింపు మరింత ఆలస్యం అవుతుందని ప్రచారం సాగుతోంది. ఈ నెల 15వ తేదీ వరకు జీతాలు రావని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ఆ తరువాత కూడా విడతల వారీగా జమ చేస్తారని చర్చించుకుంటున్నారు. దీంతో ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. 1వ తేదీ వచ్చిన వెంటనే ఇంటి అద్దె, నిత్యావసర సరుకుల ఖర్చులు ఉంటాయి. బ్యాంకు రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ చెల్లించకపోతే డిఫాల్టర్‌ అవుతారు. జరిమానా, లేదా అధిక వడ్డీ పడుతుంది. జీతం, పెన్షన ఆలస్యమైతే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎక్కడా ఈ పరిస్థితి లేదు..

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జీతాల చెల్లింపులో ఇలాంటి పరిస్థితి లేదు. ఏళ్లుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొంది ఉంటాం. వృద్ధాప్యంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. 1వ తేదీ వచ్చే పెన్షన కోసం ఎదరుచూస్తూ ఉంటాం. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి నెలా పెన్షన వస్తుందా, రాదా అని టెన్షన పడాల్సి వస్తోంది. పెన్షనర్లకు ముందుగా ఇవ్వాలి. కానీ ఇవ్వడంలేదు. ఇలాంటి ఘోర పరిస్థితులు బాధాకరం.

- పెద్దన్నగౌడ్‌, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

మూల్యం తప్పదు...

పనిచేసిన కాలానికి ప్రతి నెలా 1వ తేదీ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు జీతాలు, పెన్షన ఇవ్వడం ఆనవాయితీ. కానీ ప్రస్తుతం జీతాలు సకాలంలో రావడం లేదు. ప్రతినెలా ఆందోళన చెందాల్సి వస్తోంది. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు.

- రమణారెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

ఈ పరిస్థితి రాకూడదు..

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకటో తేదీ జీతాలు ఇవ్వాల్సిందే. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాల్సిందే. జీతాలు చెల్లించలేని పరిస్థితులు ప్రభుత్వాలకు రాకూడదు. జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు. జీతాలు ఆలస్యం కాకూడదనే టీచర్లను 010 పద్దుకిందకు తీసుకువచ్చారు. అయినా ప్రయోజనం లేదు. జీతాలు రాక చాలా మంది ఈఎంఐలు, ఇంటి అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరి కమిట్‌మెంట్లు వారికి ఉంటాయి. ప్రభుత్వం సకాలంలో జీతాలు వేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు.

- కులశేఖర్‌రెడ్డి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Updated Date - 2022-12-07T01:19:39+05:30 IST