ఆయకట్టు రైతులపై రూ.5 కోట్ల భారం

ABN , First Publish Date - 2022-03-16T06:03:49+05:30 IST

కష్టాల సేద్యంతో సంక్షోభంలో ఉన్న జిల్లా రైతులను ఆదుకోవాల్సిందిపోయి.. వారిపై భారం మోపేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.

ఆయకట్టు రైతులపై రూ.5 కోట్ల భారం
హెచ్చెల్సీ కాలువ

నెలాఖరులోగా వసూలుకు ఆదేశం

మూడేళ్లుగా వరుస పంట నష్టాలు

గత ఏడాది  తుఫాను విధ్వంసం

ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు

అనంతపురం  క్లాక్‌టవర్‌/బొమ్మనహాళ్‌: కష్టాల సేద్యంతో సంక్షోభంలో ఉన్న జిల్లా రైతులను ఆదుకోవాల్సిందిపోయి.. వారిపై భారం మోపేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. నీటి తీరువా పేరిట రూ.5 కోట్ల వరకూ బాదేందుకు సిద్ధమైంది. అనావృష్టి, అకాల వర్షాలు, తెగుళ్లు, మార్కెట్‌ కష్టాలతో రైతులు ఏటా నష్టపోతున్నారు. అంతో ఇంతో నీరుపారే హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఆయకట్టు రైతులు ఐదేళ్లగా రూ.5 కోట్ల నీటితీరువా బాకీ ఉన్నారని అధికారులు అంటున్నారు. ఈ సొమ్ము వసూలుకు రంగం సిద్ధం చేశారు. ఒక్క బొమ్మనహాల్‌ మండలంలోనే రూ.3 కోట్ల బకాయిలు ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేసే బాధ్యతను క్షేత్రస్థాయిలో ఉండే వీఆర్‌ఓలకు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా హెచ్చెల్సీ ఆయకట్టు రైతుల నుంచి రూ.5,61,89,816 వసూలు చేయాలని అధికారులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. తడి పంటలకు ఏడాదికి ఎకరానికి, ఒక పంటకు రూ.200, ఆరుతడి పంటలకు రూ.100 చొప్పున ప్రభుత్వం నీటి తీరువా వసూలు చేస్తోంది. ఏళ్ల తరబడి ఈ సొమ్మును వసూలు చేయలేదనే సాకుతో ఒకేసారి భారీ స్థాయిలో వసూలు చేసేందుకు నిర్ణయించింది. 


హెచ్చెల్సీ కింద 1.45 లక్షలఎకరాలు

హెచ్చెల్సీ కింద మొత్తం 1.45 లక్షల ఎకరాల ఆయ కట్టు ఉంది. ఇందులో హెచఎల్‌ఎంసీ కింద 36,292 ఎకరాలు, ఎంపీ సౌత కెనాల్‌ 33,176, ఎంపీ నార్త్‌ కెనాల్‌ 13,325, తాడిపత్రి బ్రాంచ కెనాల్‌ 31,131, గుంతకల్లు బ్రాంచ కెనాల్‌ కింద 32,053 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం ఆయకట్టు 1,45,987 ఎకరాలు. పేరుకు ఆయకట్టు రైతులు అయినా, దీనిపై ఆధారపడిన రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎన్నో కష్టాలకోర్చి పంటల సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతింటోంది. గత ఏడాది అతివృష్టి కారణంగా వేలాది హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మిరప, శనగ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వచ్చిన అరకొర దిగుబడుల నాణ్యత దెబ్బతింది. కేవలం వరి ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసి చేతులు దులుపుకుంది. ఇప్పటికీ కొందరు రైతుల ఖాతాలలో సొమ్ము జమకాలేదు. ఆయకట్టులో పండిన మిగిలిన పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదు. దీంతో రైతులు వ్యాపారులకు అమ్ముకుని  నష్టపోయారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులలో చాలామందికి పరిహారం కూడా అందలేదు. ఇవన్నీ చాలదన్నట్లు ఇప్పుడు నీటి తీరువా బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేయడం విమర్శలకు తావిస్తోంది. 


వసూలు సాధ్యమేనా..?

జిల్లావ్యాప్తంగా రూ.5 కోట్ల నీటి తీరువా వసూలు సాధ్యపడుతుందా అని అధికారులు ఆలోచనలో పడ్డారు. మూడేళ్ల నుంచి అతివృష్టి, అనావృష్టి కారణంగా హెచ్చెల్సీ ఆయకట్టులో పంటల దిగుబడి తగ్గింది. పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. అధిక వర్షాల కారణంగా తేమ శాతం ఎక్కువై మొక్కలు దెబ్బతినడంతో పత్తి, మిరప పంటలను రైతులు తొలగించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని అధికారులు అంటున్నారు. మరో వైపు అధికారులు బకాయిల వసూళ్లు ప్రారంభించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటనష్ట పరిహారం కూడా సక్రమంగా అందలేదని, నీటి తీరువా వసూళ్లు ఆపాలని బాధిత రైతులు కోరుతున్నారు.


కనిపించని పంట వివరాల నమోదు

- రైతులు సాగుచేసిన పంట వివరాలను రెవెన్యూ శాఖ జమాబందీలో నమోదు చేయడం లేదు. ఈ-పంట నమోదు ప్రక్రియను ప్రభుత్వం రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయశాఖకు బదలాయించింది. గ్రామ లెక్కల రికార్డుల్లో పంట వివరాలను పొందుపరచాలి. కాని ఈ ప్రక్రియను గాలికి వదిలేశారు. 

-  ఆయకట్టులో పటలసాగు వివరాలు, ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు..? తదితర  సమగ్ర వివరాలను వీఆర్‌ఓ జమా బందీలో నమోదు చేయడం లేదు. వివిధ కారణాలతో బీడు పెడితే, పన్ను మాఫీ కింద చూపాలి. ప్రభుత్వ భూములను ఆక్రమించి, సాగు చేసిన రైతుల వివరాలను రికార్డుల్లో నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేయాలి. వీటిపై రెవెన్యూ శాఖ పూర్తిగా చేతులెత్తేసింది. ఐదారేళ్ళ క్రితం సాగు వివరాలు కూడా రెవెన్యూ శాఖ వద్ద లేవు. దీంతో నీటి తీరువా వసూలు చేయడం ఎలా..? అని గ్రామ రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

- వ్యవసాయశాఖ వద్ద ఉన్న ఈ-పంట నమోదు వివరాలు రెవెన్యూశాఖ తీసుకోవాలి. పంటల నమోదు బాధ్యతను వ్యవసాయశాఖకు అప్పగించినా, రెవెన్యూ శాఖ జమాబందీలో నమోదు చేయాల్సి ఉంది. కానీ పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో  నీటి తీరువా వసూలు ఆదేశాలు రావడంతో రెవెన్యూ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెలాఖరులోగా బకాయిలు వసూలు చేయాలని ఇప్పటికే హెచ్చెల్సీ, రెవెన్యూ డివిజనల్‌ అధికారులకు ఆదేశాలు అందాయి.
వసూళ్లు ఆపాలి

హెచ్చెల్సీ ఆయకట్టు రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేయ డం సరికాదు. ప్రభు త్వం వెంటనే వసూళ్లను ఆపాలి. మూడేళ్ల నుంచి అధిక వర్షాలు, అనావృష్టితో పంటలు తీ వ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని మాత్రమే కొంత కొనుగోలు చేశారు. పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడేళ్ల నుంచి రైతులు కోలుకోలేని దెబ్బలు తింటున్నారు. ఈ మూడేళ్ల నీటితీరువా బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసి, బాధిత రైతులను ఆదుకోవాలి.

- కేశవరెడ్డి, తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు


 ప్రభుత్వ ఆదేశాల మేరకే..

ప్రభుత్వ ఆదేశాల మేరకే హెచ్చెల్సీ ఆయకట్టు రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేయాలని నిర్ణయించారు. ఐదారేళ్ల నుంచి బకాయి ఉన్న నీటి తీరువాను మార్చి చివరినాటికి వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పంటల సాగు, సరఫరా చేసిన నీటి వివరాలను రెవెన్యూశాఖకు అప్ప గించాం. పంటల సాగు, రకాల నమోదు బాధ్యత రెవెన్యూ, వ్యవసాయశాఖలదే. ఆయా శాఖల లెక్కల ప్రకారం రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేస్తారు. ఆర్డీవో ద్వారా తహసీల్దార్లకు, అక్కడ నుంచి వీఆర్‌ఓలకు నీటి తీరువా బకాయిల వివరాలను పంపించాము.   

- రాజశేఖర్‌, హెచ్చెల్సీ ఎస్‌ఈ

Read more