ఎమ్మెల్యే బంధువు..!
ABN , First Publish Date - 2022-08-10T05:43:06+05:30 IST
వైద్యుల బదిలీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించింది. దీంతో ఐదేళ్లపాటు ఒకేచోట పనిచేసినవారికి స్థాన చలనం కలిగింది.

బదిలీపై అలా వెళ్లి.. ఇలా వచ్చేసిన డాక్టరమ్మ
అనంత మెడికల్ కాలేజీలో హాట్ టాపిక్
అనంతపురం టౌన్, ఆగస్టు 9: వైద్యుల బదిలీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించింది. దీంతో ఐదేళ్లపాటు ఒకేచోట పనిచేసినవారికి స్థాన చలనం కలిగింది. వివిధ కారణాలతో తమ బదిలీలను ఆపాలని సీనియర్లు, రిటైర్మెంట్కు దగ్గర ఉన్నవారు ప్రయత్నించినా.. వెనక్కు తగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ డాక్టరమ్మ చక్రం తిప్పారు. బదిలీపై అలా వెళ్లి.. ఇలా తిరిగొచ్చేశారు. అనంతపురం వైద్యకళాశాలలో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఆమె ఓ ఎమ్మెల్యే సమీప బంధువు. అందుకే.. పంతంపట్టి వచ్చేసినట్లు సమాచారం.
- వైద్యుల విషయంలో ప్రభుత్వం మునుపెన్నడూ లేనంత కఠినంగా వ్యవహరించింది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉంటున్నందున.. విధులకు సక్రమంగా వెళ్లడం లేదని, సొంత వ్యాపకాల్లో మునిగితేలుతున్నారని, అందుకే బదిలీలు చేయాలని నిర్ణయించింది. ఒకేచోట ఐదేళ్ళు సర్వీస్ పూర్తి అయిన అందరినీ తప్పనిసరిగా బదిలీ చేసింది. దీంతో అనంత వైద్యకళాశాల, జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ వైద్యులందరూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. వైద్యకళాశాలలో పనిచేస్తున్న 106 మంది డాక్టర్లు ఒకే సారి బదిలీ అయ్యారు. కానీ ఇదే కళాశాలలో ఐదేళ్ల పైబడి పెథాలజీ విభాగంలో పనిచేస్తున్న ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మాత్రం అప్పుడు బదిలీ ఉత్తర్వులు రాలేదు.
- వైద్యకళాశాల అధికారులు ఆనలైన్లో సర్వీస్ వివరాలు పెట్టినా బదిలీ కాకపోవడం అప్పట్లో దుమారం రేపింది. 15 నుంచి 17 ఏళ్ల పాటు ఇక్కడ పనిచేసినవారు, రెండుమూడేళ్లలో ఉద్యోగ విరమణ పొందుతున్నవారు బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలని, లేదంటే బదిలీలు ఆపాలని విన్నవించారు. పలు విధాలుగా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మార్చిలో బలవంతంగా ఒకేసారి అందరినీ కదిలించారు. కానీ పెథాలజీ విభాగం డాక్టరమ్మకు మాత్రం బదిలీ ఉత్తర్వులు రాలేదు. దీనిపై రాష్ట్ర స్థాయిలోనే సీనియర్ వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. రాష్ట్ర స్థాయి అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అందరి బదిలీలు అయిన తర్వాత, జూనలో డాక్టరమ్మను బదిలీ చేశారు.
- ఆ బదిలీని డాక్టరమ్మ చాలెంజ్‌గా తీసుకున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి ఆమె సమీప బంధువు. అందుకే.. ఎలాగైనా తిరిగి అనంత వైద్యకళాశాలకు రావాలని పట్టుబట్టారు. విజయం సాధించారు. నెల రోజులు కర్నూలు ఆస్పత్రిలో పనిచేసి, తిరిగి అనంతపురం వైద్యకళాశాలకు బదిలీపై వచ్చారు. విధుల్లో కూడా చేరారు. ఇప్పుడు కూడా బలవంతంగా బదిలీపై వెళ్ళిన సీనియర్ వైద్యులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. ప్రజాప్రతినిధుల బంధువుకు ఒక రూల్... ఇతరులకు ఒక రూల్ ఉంటుందా అని బదిలీపై వెళ్ళి ఓ సీనియర్ వైద్యుడు ఆంధ్రజ్యోతి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టరమ్మ బదిలీపై వచ్చారని, విధుల్లో చేరారని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశామని, అంతకుమించి తమకు సమాచారం లేదని అన్నారు.