మొక్కుబడిగా సర్వసభ్య సమావేశం
ABN , First Publish Date - 2022-05-25T06:27:55+05:30 IST
నల్లమాడ మండల పరిషత కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం మొక్కుబడిగా నిర్వహించారు.

నిధుల కోసం సర్పంచల డిమాండ్
నల్లమాడ, మే 24 : నల్లమాడ మండల పరిషత కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం మొక్కుబడిగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉదయం 10.30లకు నిర్వహిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులకు సమాచారం ఇచ్చినా... చారుపల్లి పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కారణంగా అధికారులు ఈ కార్యక్రమానికి వెళ్లాలనే ఉద్దేశంతో ఉదయం 7.00లకే ఈ సమావేశాన్ని సాదాసీదాగా నిర్వహించారు. ఎంపీపీ సునీతాబాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సర్పంచులు మాట్లాడుతూ.. తాము ఇప్పటికీ వరకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం విద్యుత మోటార్లు, స్ర్టాటర్లు, నూతనంగా బోరు మోటార్లు తదితర పనుల కోసం అప్పులు చేశామని, ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా ఏ సర్పంచుకూ రాలేదని ఎంపీడీఓ పోలప్ప దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీఓ మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలో ఇంటిపన్నులు ద్వారా వచ్చిన నిధులు, చేపల చెరువు వేలంలో వచ్చిన నిధులను వాడుకోవాలని సూచించారు. జూనలో 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని, వాటిల్లో కూడా కొంత మొత్తాన్ని వాడుకోవచ్చని సూచించారు. ఎంపీపీ మాట్లాడుతూ... ఐసీడీఎస్ సూపర్వైజర్లు అంగనవాడీ కేంద్రాలను తనిఖీలు చేసి.. వాటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సర్యసభ్య సమావేశంలో వైస్‌ఎంపీపీ సూర్యనారాయణ, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కో-ఆప్షన మెంబర్లు పాల్గొన్నారు.