ప్రొఫెసర్‌ గంగప్ప కన్నుమూత

ABN , First Publish Date - 2022-10-08T05:02:22+05:30 IST

బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆచార్య గంగప్ప (86) శుక్రవారం వయోభారంతో కన్నుమూశారు.

ప్రొఫెసర్‌ గంగప్ప కన్నుమూత
గంగప్ప (ఫైల్‌)

సాహితీవేత్తల నివాళి

పెనుకొండ, అక్టోబరు 7: బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆచార్య గంగప్ప (86) శుక్రవారం వయోభారంతో కన్నుమూశారు. సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనపల్లి గ్రామంలో 1936 నవంబరు 8న జన్మించారు. 1972లో ఎస్వీ యూనివర్సిటీ నుంచి పీహెచడీ పొందారు. 1975 వరకు అనంతపురం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, ప్రభుత్వ కళాశాలల్లో, కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఆయన అధ్యాపకులుగా చేరారు. 1978లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకులుగా చేరారు. 1985లో ప్రొఫెసర్‌ పదవిని చేపట్టారు. 1996లో ఆయన పదవీవిరమణ చేసి సాహితీరంగంలో విశేష కృషి చేశారు. పలు సాహితీ పత్రికల్లో 1500 వ్యాసాలు ప్రచురించారు. జానపద, నాటక, ప్రాచీనాధునిక సాహిత్యాల్లో పరిశోధన, విమర్శాత్మక, సృజనాత్మక గ్రంధాల్లో ఆయన రచనలు చేశారు. 1980లో ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమి అవార్డు, 1983-85 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అవార్డు, 1983లో విశ్వనాథ సాహిత్యపీఠం అవార్డు, 1991లో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్నారు. ఆయన గుట్టూరులోని స్వగృహంలో వయోభారంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటని సాహితీ స్రవంతి కళాకారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో సాహితీస్రవంతి సభ్యులు హరీ, రాజశేఖర్‌రెడ్డి, దేవిశెట్టి రామన్న, ఇమ్రానబాష, రవూఫ్‌, ఘనగిరి ఇలియాజ్‌, కళాకారులు కోగిర జయచంద్రారెడ్డి, కోనాపురం నారాయణస్వామి, బాబయ్య, తదితరులు గంగప్పకు నివాళులర్పించారు.


Read more