పెట్టుబడులు ఎలా..?

ABN , First Publish Date - 2022-06-12T05:48:17+05:30 IST

వేరుశనగ పంట సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పులు పుట్టడం లేదు. ఉన్న కాస్త డబ్బు పంట రుణాల రెన్యువల్‌కు వడ్డీ కట్టడానికి సరిపోయిందనీ, పంట ఎలా సాగు చేయాలోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులు ఎలా..?

చేతిలో చిల్లిగవ్వ లేదు.. 

అప్పులు పుట్టడం లేదు..

దిక్కులు చూస్తున్న రైతులు

దుక్కులు కూడా చేసుకోలేని దుస్థితి

భారీగా తగ్గనున్న ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం


మడకశిర


వేరుశనగ పంట సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పులు పుట్టడం లేదు. ఉన్న కాస్త డబ్బు పంట రుణాల రెన్యువల్‌కు వడ్డీ కట్టడానికి సరిపోయిందనీ, పంట ఎలా సాగు చేయాలోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఖరీ్‌ఫలో ముందస్తు వర్షాలు పడుతున్నా.. కొన్నిచోట్ల సాగుకు అన్నదాతలు ఆసక్తి చూపడం లేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. దీంతో ఈసారి సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉంది. డీజిల్‌, కూలీలు, విత్తనాలు, ట్రాక్టర్‌ బాడుగలు, ఎరువుల ధరలు పెరగడంతో సాగు పెట్టుబడులు కూడా రెట్టింపయ్యాయి. ఏటా పంటలు దెబ్బతింటుండటంతో పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.


తగ్గనున్న సాగు విస్తీర్ణం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో 6 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేసేవారు. దశాబ్దకాలంగా అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బ తింటుండడంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దాదాపు 2 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లాలోనే అత్యధికంగా వేరుశనగ సాగుచేసే ప్రాంతాల్లో మడకశిర ఒకటి. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 10 ఏళ్ల క్రితం 52 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేసేవారు. గత 20 ఏళ్లలో రెండుసార్లే పంట చేతికొచ్చినట్లు రైతులు చెబుతున్నారు. గతేడాది పంట చేతికొచ్చే సమయంలో ఎడతెరపిలేని వర్షాలకు రైతు తీవ్రంగా నష్టపోయాడు. పెట్టుబడులు కూడా చేతికి అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురిసినా పంటసాగుకు కొంతమంది రైతులు ఆసక్తి చూపడం లేదు. సబ్సిడీ విత్తన పంపిణీ కేంద్రాలు వెలవెలబోతుండడమే అందుకు నిదర్శనం. మడకశిర పరిధిలోని 5 మండలాలకు ఖరీ్‌ఫకు 21 వేల క్వింటాళ్ల సబ్సిడీ విత్తన వేరుశనగను ప్రభుత్వం కేటాయించింది. అందులో 5467 క్వింటాళ్లకు మాత్రమే రైతులు రిజిస్ట్రేషన చేసుకోవడాన్ని బట్టే ఈ ఏడాది సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోతుందన్న విషయం అర్థం చేసుకోవచ్చు.


పరిస్థితి తారుమారు..

సాగునీటి వనరులు లేకపోవడంతో జిల్లాలో ఖరీ్‌ఫలో సాగుచేసిన వేరుశనగ పంటపైనే రైతులు ఎక్కువగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ల క్రితం సబ్సిడీ విత్తన కాయల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాచేవారు. విత్తనం దొరక్కపోతే కార్యాలయాల వద్ద రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టేవారు. ప్రసుత్తం విత్తన వేరుశనగను రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నా.. రైతులు తీసుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. ఆర్థికంగా ఇబ్బందులతో చాలామంది భూములను దుక్కులు కూడా చేయకుండా బీడుగా వదిలేసుకున్నారు. మరికొంతమంది ఉన్న మొత్తం భూమిలో కొంతలోనేసాగు చేసి, మిగతాది బీడుగా పెట్టుకుంటామంటున్నారు.


బీడుగా వదిలేయడమే ఉత్తమం

నాకు ఐదెకరాల పొలం ఉంది. ఏటా వేరుశనగ పంట దెబ్బతిని నష్టపోతుండడంతో అప్పులు పెరిగిపోతున్నాయి. పంట రుణం రెన్యువల్‌కు రూ.20 వేలు కట్టా. పంట సాగుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంకులో అదనంగా లోన ఇవ్వడంలేదు. ఐదెకరాల్లో పంట పెట్టాలంటే రూ.75వేలు పెట్టుబడి వస్తుంది. సబ్సిడీ విత్తనాలు ఎకరాకి మాత్రమే సరిపోతాయి. మిగతా నాలుగెకరాలకు విత్తనాలు బయట మార్కెట్‌లో కొనాల్సి ఉంది. ధర అధికంగా ఉంది. అప్పులు కూడా పుట్టడంలేదు. దీంతో ఎకరాలో మాత్రమే వేరుశనగ సాగు చేస్తా. మిగిలిన పొలాన్ని బీడుగా వదిలేస్తా.

మారేగౌడు, రైతు, మల్లినమడుగు


పెట్టుబడులు పెరిగిపోయాయి..

నాకు 12 ఎకరాల పొలం ఉంది. అప్పులు చేసి ఏటా పంటలు సాగుచేస్తున్నా. పెట్టుబడి కూడా చేతికి అందడంలేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. పంట రుణం రెన్యువల్‌కు సంబంధించి వడ్డీకి కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. మూడేళ్ల క్రితం ఎకరాలో వేరుశనగ సాగుకు రూ.12వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.20 వేలు అవుతోంది. పెట్టుబడులు పెరిగిపోయాయి, దిగుబడులు రావడం లేదు. దీంతో ఎకరాలోనే పంట పెట్టాలని నిర్ణయించుకున్నా.

నాగరాజు, రైతు, కురసంగనహళ్ళి


Read more