పెద్దరాంపల్లికి సింగిల్‌ ఫేస్‌ కరెంటే..!

ABN , First Publish Date - 2022-08-18T05:13:42+05:30 IST

మండలంలోని వంకమద్ది పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామమైన పెద్దరాంపల్లిలో నేటికీ సింగల్‌ పెస్‌ కరెంటే గతి.

పెద్దరాంపల్లికి సింగిల్‌ ఫేస్‌ కరెంటే..!
గ్రామానికి విద్యుత సరఫరా చేస్తున్న సింగిల్‌ ఫేస్‌ లైన

 ఏళ్ల తరబడి నిరుపయోగంగా బోర్లు 

నంబులపూలకుంట, ఆగస్టు 17: మండలంలోని వంకమద్ది పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామమైన పెద్దరాంపల్లిలో నేటికీ సింగల్‌ పెస్‌ కరెంటే గతి. మూడు ఫేస్‌ల కరెంటు వైర్లు చోరీకి గురై సంవ త్సరాలు గడుస్తున్నా... విద్యుత అధికారులు తమ గ్రామానికి మూడు ఫేస్‌ల విద్యుత సరఫరా పునరుద్ధరించడంలేదని ఆ గ్రామ రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 50కి పైగా కుటుంబాలు ఉండేవి. వర్షాధార పంటలపై ఆధారపడి జీవనం సాగించేవారు. సకాలంలో వర్షా లు కురవకపోడం, పంటలు పండకపోవడంతో గ్రామాలు వదిలి వలస బాట పట్టారు. ప్రస్థుతం గ్రామంలో ఉన్నవారంతా దాదాపు వృద్ధులే. ఇదిలా ఉంటే ఏ గ్రామంలో చూసినా బోర్లు, బావులు, నీటి పారకం కింద పంటలు సాగుచేసుకుంటున్నారు. పెద్దరాంపల్లిలో మాత్రాం మూడు ఫేస్‌ల కరెంటు లేకపోవడంతో అలా పండించుకునే అవకాశం ఆ గ్రామ రైతులకు లేదు. అప్పు చేసి ఐదేళ్ల క్రితం పెద్ద గంగన్న అనే రైతు బోరు వేస్తే సమృద్ధిగా నీరు పడింది. అయినా మోటారుకు విద్యుత కనెక్షన ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆ బోరు బావి నిరుపయోగంగానే ఉంది. ఆ గ్రామాని కంతటికి రక్షత మంచి నీటి బోరుకు కూడా సింగిల్‌ ఫేస్‌ మోటారు అమర్చారు. గ్రామానికి అర కిలోమీటరులో ఉన్న సోమరాజు కుంట, పుల్లగూరు వాండ్లపల్లి, గురికానివారిపల్లి గ్రామాల రైతులు త్రీఫేస్‌ కరెంటు ద్వారా పంటలు పండించుకుని జీవనం సాగిస్తున్నారు.  

వైర్ల చోరీతోనే... గాండ్లపెంట మండలంలోని గాజులవారిపల్లి సబ్‌స్టేషన నుంచి పెద్దరాంపల్లికి విద్యుత సరఫరా అవుతుంది. దాదాపు పదేళ్ల క్రితం నంబులపూలకుంటలోని వంకమద్ది, గురుకానివారిపల్లి మీదుగా పెద్దరాంపల్లికి  త్రీఫేస్‌ విద్యుత లైన ద్వారా సరఫరా అయ్యేది. అయితే కొన్నేళ్ల క్రితం గురుకానివారిపల్లి నుంచి పెద్దరాంపల్లి వరకు విద్యుత వైర్లు చోరీకి గురయ్యాయి. అప్పటికి తాత్కాలికంగా గ్రామంలో బల్బులు పడితే చాలన్న కోణంలో గ్రామానికి సింగిల్‌ ఫేస్‌ విద్యుత లైన లాగారు.  ఆ తరువాత ఏళ్లు గడుస్తున్నా త్రీఫేస్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామంలో వీధి దీపాలు, ఇళ్లలోని బల్బులు వెలిగేందుకు తప్ప ఏమే ఉపయోగకరంగా లేదని గ్రామస్థులంటున్నారు. గ్రామానికి అనుకుని హంద్రీనీవాకాలువ పారుతోంది. కాలువద్వారా అయినా పంటలు  సాగుచేసుకుందామంటే, విద్యుత లేకపోవడం సమస్యగా మారిందని వాపోతున్నారు.   

ఖర్చు భరించేందుకు గ్రామస్థులు ముందుకు రాలేదు  - రవీంద్రారెడ్డి, ఏఎల్‌ఎం

గ్రామానికి గతంలో త్రీఫేస్‌ కరెంటు ఉండేది. వైర్లు చోరీకి గురికావడంతో... గ్రామానికి తాత్కాలికంగా విద్యుత సరఫరా కోసం సింగల్‌ ఫేస్‌ వైర్ల ద్వారా పునరుద్ధరించారు. గ్రామంలో రైతులు త్రీఫేస్‌ కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తమే. ఆ గ్రామానికి త్రీఫేస్‌ కరెంటు ఇచ్చేందుకు అధికారులు రూ.4.80లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే గ్రామ రైతులెవరూ డబ్బులు చెల్లించకపో వడంతో గ్రామానికి త్రీఫేస్‌ కరెంటు ఇవ్వలేకపోతున్నాం.


Read more