టీడీపీతోనే బడుగు, బలహీనులకు గుర్తింపు
ABN , First Publish Date - 2022-12-16T00:02:11+05:30 IST
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు, బలహీనవర్గాలకు రాజకీయ గుర్తింపు వచ్చిందని, విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యకు టీడీపీ రాయలసీమ మీడియా కో-ఆర్డినేటర్ బీవీ వెంకటరాముడు హితవు పలికారు.
- చంద్రబాబు, కాలవపై విమర్శలు సరికాదు
- పార్టీ రాయలసీమ మీడియా కో-ఆర్డినేటర్ బీవీ
అనంతపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు, బలహీనవర్గాలకు రాజకీయ గుర్తింపు వచ్చిందని, విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యకు టీడీపీ రాయలసీమ మీడియా కో-ఆర్డినేటర్ బీవీ వెంకటరాముడు హితవు పలికారు. ‘నీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో’ అని సూచించారు. ఆయన గురువారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సొంతంగా సమావేశం ఏర్పాటు చేసుకోలేని పైలా.. తమ పార్టీ అధినేత చంద్రబాబు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవపై విమర్శలు చేయడం ఏమిటని మండిపడ్డారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీలోని ఒక సామాజికవర్గం మాత్రమే పెత్తనం చెలాయిస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘మీ పార్టీలో బడుగు, బలహీనవర్గాల నాయకులు అడుగడుగునా అవమానాలకు గురవుతున్నా.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి చూసి బలహీనవర్గాలకు చెందినవాడిగా బాధపడుతున్నానని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లా నుంచి బీసీ నాయకులు నిమ్మల కిష్టప్ప, కాలవ శ్రీనివాసులు మంత్రులుగా పనిచేసింది తెలియదా అని ప్రశ్నించారు. తమ పార్టీ బీసీ నేతలు అత్యధికమంది జడ్పీ చైర్మన్లుగా పనిచేసింది నిజం కాదా అని నిలదీశారు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల నుంచి బీసీ నేతలు బీకే, కాలవ గెలిచారని అన్నారు. బీసీలకు టీడీపీలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. గుంతకల్లు నుంచి జితేంద్రగౌడ్, కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యేలుగా, మడకశిర నుంచి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జడ్పీ చైర్మన్లుగా లింగరాజు, బీకే పార్థసారథి, చమనసాబ్, పూల నాగరాజుకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా గుర్తింపునిచ్చే పార్టీల్లో తెలుగుదేశం ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.