ఏమీ బాగలేదు..!

ABN , First Publish Date - 2022-11-16T00:59:46+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ ప్రగతి, స్థల సేకరణ, ఓటీఎస్‌ అమలు తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై గడప గడపకు వెళుతుంటే తమను నిలదీస్తున్నారని కొందరు, అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని మరికొందరు అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అందరూ కలిసి ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలని మంత్రి సూచించారు. అర్హులకు మాత్రమే ఇళ్లను మంజూరు చేయాలని, సమస్యలుంటే పరిష్కరించేందుకు కలెక్టర్‌ చొరవ చూపాలని ఆదేశించారు.

ఏమీ బాగలేదు..!
గడప గడపలో తనను నిలదీస్తున్నారని మంత్రి వద్ద వాపోతున్న గుంతకల్లు ఎమ్మెల్యే

గృహ నిర్మాణాలు వెరీ పూర్‌

గడప గడపకు వెళితే నిలదీస్తున్నారు

ఓటీఎస్‌ డబ్బులు కట్టినా పత్రాలు ఇవ్వలేదు

అవినీతికి పాల్పడినా అధికారులపై చర్యల్లేవు

మంత్రి ఎదుట ప్రజాప్రతినిధుల అసంతృప్తి

అనంతపురం సిటీ, నవంబరు 15: జిల్లాలో ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ ప్రగతి, స్థల సేకరణ, ఓటీఎస్‌ అమలు తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై గడప గడపకు వెళుతుంటే తమను నిలదీస్తున్నారని కొందరు, అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని మరికొందరు అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అందరూ కలిసి ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలని మంత్రి సూచించారు. అర్హులకు మాత్రమే ఇళ్లను మంజూరు చేయాలని, సమస్యలుంటే పరిష్కరించేందుకు కలెక్టర్‌ చొరవ చూపాలని ఆదేశించారు.

వెరీ పూర్‌

జిల్లాలో గృహ నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడం లేదని స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం, బిల్లులు మంజూరు తదితర అంశాలపై ఆరా తీశారు. చాలా మండలాలలో ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడంలేదని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఉరవకొండలో వెరీపూర్‌ అని అన్నారు.

నన్ను నిలదీస్తున్నారు

గుంతకల్లు ఎమ్మెల్యే అసంతృప్తి

వైఎస్సార్‌ హయాంలో గుంతకల్లు పరిధిలో 4,780 మం దికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, కానీ వారు వివిధ కారణాలతో పూర్తిగా నిర్మించుకోలేదని గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వారికి కేటాయించిన స్థలాలలో అరకొరగా ఉన్న నిర్మాణాలను తొలగించి, నవరత్నాల పేరిట ఇతరులకు స్థలాలు ఇచ్చారని అన్నారు. దీంతో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులైన 4,780 మందికి ఇంటి స్థలాలు లేకుండా పోయానని, గడపగడపకు వెళ్లినప్పుడు ఈ విషయమై తనను నిలదీస్తున్నారని ఎమ్మెల్యే వాపోయారు. వారందనికీ స్థలాలు ఇవ్వాలని కోరారు. జగనన్న కాలనీల అభివృద్ధి పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు.

చౌడు నేలలో ఇచ్చారు: ఎమ్మెల్యే అనంత

అనంతపురంలోని 6,049 మందికి కామారుపల్లి వద్ద చౌడు నేలలో ఇంటి స్థలాలు ఇచ్చారని, దీంతో ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదని అర్బన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆ స్థలం అనువుగానిదని, అధికారులు తేల్చారని, వారికి మరోచోట ఇవ్వాలని కోరారు. కొడిమి, ఉప్పరపల్లి, ఆలుమూరు స్థలాలు వివాదంలో ఉన్నాయని, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి, లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఓటీఎస్‌ అమలుతీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంక్షలు లేకుండా అమలు చేయాలని అన్నారు. డబ్బులు చెల్లించినా ఓటీఎస్‌ పత్రాలను ఇవ్వలేదని, త్వరగా ఇచ్చేలా చూడాలని కోరారు.

అవినీతిపై చర్యలేవీ..? ఎమ్మెల్సీ శివరామిరెడ్డి

జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణం విషయంలో ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కోరారు. బెళుగుప్ప ఏఈపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదని అన్నారు. లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇసుక డంప్‌లను అవసరమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని కోరారు. ఉరవకొండలో ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేకున్నా, అధిక ధరకు భూములను కొనుగోలు చేశారని ఎమ్మెల్సీ అన్నారు. ప్రభుత్వ నిధులను వృథా చేశారని ఆయన ఆరోపించారు.

మంత్రీ.. గో బ్యాక్‌...!

తెలుగు యువత నిరసన

అనంతపురం అర్బన/టౌన, నవంబరు 15: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించలేని గృహ నిర్మాణ శాఖమంత్రి జోగి రమేష్‌ గో బ్యాక్‌ అంటూ తెలుగు యువత నాయకులు మంగళవారం నినదించారు. కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట అరగంటపాటు బైఠాయించి, నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వనటౌన స్టేషనకు తరలించారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ హయాంలో పేదలకు కట్టించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ పాలకులు అన్యాయం చేశారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడుపూటి నారాయణస్వామి మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు ప్రజలు కట్టిన డీడీ డబ్బులను వెనక్కి ఇవ్వకుండా సతాయిస్తున్నారని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌ ఆరోపించారు. పేదలకు సొంత గూడు కట్టించలేని వైసీపీ పాలకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆందోళనలో తెలుగు యువత నాయకులు నవీన, కృష్ణ, బొమ్మినేని శివ, భరత, కృష్ణ, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T01:00:42+05:30 IST

Read more