వద్దు బాబోయ్‌

ABN , First Publish Date - 2022-08-18T05:46:47+05:30 IST

పన్నుల శాఖలో ఆ రెండు హాట్‌ సీట్లుగా మారాయి. వాటిలో కూర్చోమంటే అధికారులు వద్దు బాబోయ్‌ అంటున్నారు.

వద్దు బాబోయ్‌

ఆ రెండు సీట్లంటే అధికారులకు భయం

సీటీఓ 1, 2 పోస్టులకు ఇనచార్జిలే దిక్కు

బదిలీల్లో కేటాయించిన ఇద్దరూ రద్దుబాట

పన్నుల శాఖ కార్యాలయంలో చర్చోపచర్చలు

అనంతపురం క్రైం: పన్నుల శాఖలో ఆ రెండు హాట్‌ సీట్లుగా మారాయి. వాటిలో కూర్చోమంటే అధికారులు వద్దు బాబోయ్‌ అంటున్నారు. జిల్లా కేంద్రంలో.. కీలకమైన పన్నుల శాఖ అధికారి (సీటీఓ-1, 2) సీట్లంటే  అధికారులు హడలిపోతున్నారు. బాధ్యతలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల బదిలీలలో ఆ రెండు సీట్లకు కేటాయించిన  అధికారులు మరో ప్రాంతానికి బదిలీ చేయించుకోవడం ఇందుకు నిదర్శనం. అక్కడున్న పరిస్థితులు, కొందరు ఉద్యోగుల తీరు కారణంగా అవి హాట్‌ సీట్లుగా మారాయని అంటున్నారు. ఈ క్రమంలో ఆ విభాగంలోని డీసీటీఓలనే ఇనచార్జ్‌ సీటీఓలుగా కొనసాగిస్తున్నారు. 


బదిలీ చేసినా...

పన్నుల శాఖ జిల్లా ప్రధాన కార్యాలయం అనంతపురం నగరంలో ఉంది. ఇక్కడ సీటీఓ-1, సీటీఓ-2 పోస్టులు కీలకం. సీటీఓ-1లో దాదాపు మూడేళ్లుగా రెగ్యులర్‌ అధికారి లేరు. విజిలెన్స సీటీఓ శ్రీనివాసులు నాయుడు ఇనచార్జ్‌గా కొనసాగారు. ఆయన స్ర్టిక్టుగా వ్యవహరిస్తారనే పేరుంది. ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గేవారు కాదనే అభిప్రాయం ఉంది. గత నెల31న జరిగిన బదిలీల్లో ఆయనను విశాఖపట్నానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో  చిత్తూరు సీటీఓ వరలక్ష్మిని నియమించారు. కానీ ఆమె ఇక్కడకు రాలేదు. బదిలీని రద్దు చేయించుకుని, తిరిగి అదే ప్రాంతానికే పోస్టింగ్‌ ఇచ్చేలా చూసుకున్నారు. అదే బదిలీల్లో నంద్యాల నుంచి డీసీటీఓ హరినాథ్‌ను సీటీఓ-1 విభాగానికి కేటాయించారు. సీటీఓ-1గా ఎవరూ లేకపోవడంతో హరినాథ్‌కే ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. సీటీఓ-2గా ఉన్న హుస్సేనసాహెబ్‌ను కర్నూలుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరు నుంచి అరుణకుమారికి పోస్టింగ్‌ ఇచ్చారు. కానీ ఆమె కూడా బదిలీని రద్దు చేయించుకున్నారు. అదే జిల్లాలోని గూడూరుకు పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు. దీంతో కార్యాలయంలో మేనేజర్‌గా ఉన్న సుజాతకు డీసీటీఓగా, సీటీఓ-2 విభాగానికి బదిలీ చేశారు. ఆమెనే ఇనచార్జ్‌ సీటీఓగా కొనసాగుతున్నారు. ఇప్పట్లో కొత్తగా సీటీఓ హోదా అధికారులు వచ్చే పరిస్థితులు లేవని, ఇనచార్జ్‌లే కొనసాగుతారని ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. 


కత్తి మీద సామే...

అనంతపురం సీటీఓ-1 పరిధిలో కమలానగర్‌ మధ్య నుంచి పాతూరు, నార్పల వరకు ఉంటుంది. సీటీఓ-2 పరిధిలో కమలానగర్‌ మధ్య నుంచి ఆత్మకూరు వరకు ఉంటుంది. నగర పరిధిలో అనేక వ్యాపార లావాదేవీలు ఈ రెండింటి పరిధిలోకే వస్తాయి. రూ.కోట్లలో టర్నోవర్‌ జరిపే సంస్థలు ఇక్కడ ఉన్నాయి. దీంతో ఆ విభాగాల అధికారులు కీలకంగా ఉంటారు. గతంలో నకిలీ చలానాల నుంచి తనిఖీల పేరుతో జరిగే వసూళ్ల వరకు అధికారులు, సిబ్బందిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకు సీటీఓ-1గా ఉన్న శ్రీనివాసులు నాయుడు ఎవరి సిఫార్సులను పట్టించుకునేవారు కాదు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి కొందరు ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. సీటీఓ-2ఉన్న అధికారి కొంత మెతకగా ఉండేవారని ఆ శాఖ సిబ్బంది అంటున్నారు. ఇనచార్జ్‌లుగా డీసీటీఓలు కూర్చోవడం ఇదే తొలిసారి. వీరు గతంలో ఎప్పుడూ ఇనచార్జ్‌ బాధ్యతలు చేపట్టలేదు. ఈ రెండు సీట్లలోకి వచ్చేందుకు అధికారులే భయపడుతున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరూ ఎలా బాధ్యతలు నిర్వహిస్తారో అన్న చర్చ జరుగుతోంది. అసోసియేషన ముసుగులో కొందరు వేసే ఎత్తుగడలను, వారి వ్యవహారాలను వీరు ఎలా తట్టుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇనచార్జ్‌ సీట్లు ఆ ఇద్దరికీ కత్తిమీద సామేనని కార్యాలయంలో ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ ఇద్దరూ విధుల విషయంలో కొన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటారా..? ప్రతికూలంగా వ్యవహరిస్తారా...? లేక సర్దుకునిపోతారా...? వాహనాల తనిఖీ సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తారు...? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. వివాదాలకు కేంద్రంగా ఉన్న పన్నులశాఖ కార్యాలయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-08-18T05:46:47+05:30 IST