పాలకుండలో నష్టాల పొంగు

ABN , First Publish Date - 2022-06-05T06:07:06+05:30 IST

పశుగ్రాసం దొరక్క పాడి రైతాంగం అవస్థలు పడుతోంది. ఇలాంటి తరుణంలో డెయిరీల మూసివేతతో పాడి రైతులు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు పాలను విక్రయిస్తున్నారు.

పాలకుండలో నష్టాల పొంగు

మూతపడుతున్న 

పాలశీతలీకరణ కేంద్రాలు

పాల బకాయిలు రూ.46 లక్షలు

కేవలం 60 గ్రామాల్లో ‘అమూల్‌’ సేకరణ

కర్ణాటక రాషా్ట్రనికి తరలిపోతున్న పాలు

ప్రశ్నార్థకంగా మారుతున్న పాడిపరిశ్రమ



పంట కలసి రాకపోతేనేం... పాడి ఆదుకుంటుందని ఆశపడ్డారు. అష్టకష్టాలు పడి పశువులను పెంచుతున్నారు. ఎంత  శ్రమించినా గిట్టుబాటు కాక విలవిల్లాడుతున్నారు పాడి రైతులు. వారి కష్టానికి తోడు పాల డెయిరీలు మూతపడటంతో పాడి రైతుల కష్టాలు తారస్థాయికి చేరాయి. పాల సేకరణ ధరను పెంచకపోవడంతో పాటు ప్రభుత్వ పాల కేంద్రాలను ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టడంతో పాడి రైతులకు దిక్కుతోచడం లేదు. గత్యంతరం లేక పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు రైతులు పాలను విక్రయిస్తున్నారు.





మడకశిర

పశుగ్రాసం దొరక్క పాడి రైతాంగం అవస్థలు పడుతోంది. ఇలాంటి తరుణంలో డెయిరీల మూసివేతతో పాడి రైతులు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు పాలను విక్రయిస్తున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక విధంగా పంటలను కోల్పోతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్న పాడిపరిశ్రమ కూడా దెబ్బతినడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రెండు సంవత్సరాలుగా జిల్లాలో పాల డెయిరీలు మూతపడ్డాయి. పాలదిగుబడి తగ్గడం, మరో పక్క ధరలు లేకపోవడం, గ్రాసం కొరత తీవ్రరూపం దాల్చడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లుగా కరోనా ఎఫెక్ట్‌ పాడిపరిశ్రమపై పడింది. ఇప్పడిప్పుడే కోలుకుంటున్న సమయంలో శ్రీసత్యసాయి జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాలు మూతపడటంతో ఆ రంగం కుదేలవుతోంది. 

ప్రభుత్వ పాల డెయిరీలు మూతపడటంతో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని రైతులు విధిలేని పరిస్థితు ల్లో కర్ణాటక డెయిరీల వైపు మొగ్గుచూపుతున్నారు. జి ల్లాలో పాలశీతలీకరణ కేంద్రాలు మూతపడి రెండు సంవత్సరాలు కావస్తోంది. రెండు సంవత్సరాల క్రితం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పడు 30 వేల లీటర్ల పాలను ప్రభుత్వ పాల శీతలీకరణ కేంద్రాలనుంచి సేకరించేవారు. ప్రస్తుతం జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టు కింద జిల్లాలో కేవలం 60 గ్రామాల్లో మాత్ర మే పాలను సేకరిస్తున్నారు. ఈ పాలను కూడా అమూ ల్‌ ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాల్లోనూ డెయిరీలను ఏర్పాటు చేసి పా లకు గిట్టుబాటు ధర కల్పించి పాలను సేకరించాలని రైతులు కోరుతున్నా రు. కర్ణాటక రాష్ట్రంలో మాదిరి పాలధరలతో పాటు పోత్సాహకాలు అందిం చి మూతపడిన డెయిరీలను పునఃప్రారంభిస్తే పాడి రంగానికి పూర్వ వైభవం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూతపడిన పాలశీతలీకరణ కేంద్రాలను పునఃప్రారంభించి పాల కు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


బిల్లుల చెల్లింపులో జాప్యం

శ్రీసత్యసాయి జిల్లాలో పాల బిల్లులను చెల్లించడం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పాడి రైతులకు దాదాపు రూ.46 లక్షల వరకు పాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం ఒ క్క మడకశిర, గుడిబండలోనే రూ.6 లక్షలదాకా పాల బి ల్లులు చెల్లించాల్సి ఉంది. గతంలో 15 రోజులకోసారి పాల బిల్లు లు చెల్లించేవారు. ప్రస్తుతం రెండు సంవత్సరాలైనా బిల్లులు చెల్లించలేదు. పాల డెయిరీలు కూడా మూతపడటంతో ఆ పాల బిల్లులు వస్తాయో లేదో? కూడా తెలియని పరిస్థితి. దీంతో పాడిపరిశ్రమ నిర్వహణ కష్టసాధ్యంగా మారింది..


రూ.46 లక్షల పాల బిల్లులు చెల్లించాలి 

శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.46 లక్షల పాల బిల్లులను రైతులకు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పడు కదిరి, హిందూపురం, అనంతపురాన్ని మూడు క్లస్టర్లుగా విభజించారు. అమూల్‌ ప్రాజెక్టు కింద కదిరి నియోజకవర్గంలో తలుపుల, గాండ్లపెంట, నల్లచెరువు, కదిరి మండలాల్లో  పాల సేకరణ ప్రారంభమైంది. పాల సేకరణకు కావలసిన మెటీరియల్‌ను కూడా ఆయా కేంద్రాలకు సరఫరా చేశాం. హిందూపురంలో 4, కదిరిలో 5 మండలాల్లో పాల డెయిరీలను ఏర్పాటు చేసి పాల సేకరణ చేపడుతున్నాం. మహిళల కోసం డెయిరీ సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. 90 రోజులు పాటు పాలను డెయిరీకి వేస్తారో అలాంటి వారిని సభ్యులుగా తీసుకుంటాం. కో ఆపరేటివ్‌ డిపార్టుమెంట్‌ సహకారంతో ఆ సంఘాలను సొసైటీలుగా గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం.

- ప్రభాకర్‌ రెడ్డి, డీడీ, డెయిరీశాఖ


భారంగా పాడిపరిశ్రమ

జిల్లాలో పాడి పరిశ్రమకు కష్టకాలం దాపురించింది. పాడిపశువుల ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. పెరుగుతున్న దాణా ధరలు, అందుబాటులో లేని పశుగ్రాసంతో అన్నదాతలు పశువుల పెంపకంలో అష్ట కష్టాలు పడుతున్నారు. అప్పులు చేసి గ్రాసం, దాణా సమకూర్చుకునే పరిస్థితి రైతులకు నెలకొంది. సకాలంలో బిల్లులు చెల్లించి పాలకు గిట్టుబాటుధర కల్పించి ప్రోత్సాహకాలు అందిస్తే రైతులకు ఊరట కలగనుంది. అదేవిధంగా మూతపడిన పాలశీతలీకరణ కేంద్రాలను పున:ప్రారంభించాలని రైతుల నుంచి సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.


రూ.18 లక్షలు చెల్లించాలి 

మడకశిర, గుడిబండ మండలాల్లోని పాలశీతలీకరణ కేంద్రాలకు సంబంధించి రెండు నెలలకు గాను రూ.18 లక్షల దాకా పాల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏడు నెలల క్రితం మూడు పాలశీతలీకరణ కేంద్రాలు మూతపడ్డాయి. ఉన్న రెండు పాలశీతలీకరణ కేంద్రాలు కూడా రెండు నెలల క్రితం మూతపడ్డాయి. నిధులు రాగానే పెండింగ్‌ బిల్లులను చెల్లిస్తాం.

నరసింహులు, డెయిరీ సూపర్‌వైజర్‌


పాల బిల్లులు ఇవ్వలేదు

రెండు సంవత్సరాలవుతున్నా పాల బిల్లులు చెల్లించలేదు. గతంలో 15 రోజులకోసారి బిల్లులు వచ్చేవి. రెండు సంవత్సరాలుగా బిల్లులు రాలేదు. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. 10 వేల రూపాయల దాకా పాల బిల్లు రావాల్సి ఉంది. డెయిరీలు మూత పడటంతో ఉన్న ఆవులను సైతం అమ్ముకున్నాం. బకాయిలు ఉన్న పాల బిల్లును వెంటనే చెల్లించి, పాలశీతలీ కేంద్రాలను మళ్లీ ప్రారంభించాలి. 

నాగమణి, సీసీ గిరి, గుడిబండ


పునఃప్రారంభించాలి 

మూతపడిన డెయిరీలను పునఃప్రారంభించి రైతులను ఆదుకోవాలి. గత్యంతరం లేక కర్ణాటకలోని ప్రైవేట్‌ డెయిరీలకు పాలను పోస్తున్నాం. కర్ణాటక నుంచి ప్రైవేట్‌ డెయిరీల ప్రతినిధులు వచ్చి తక్కువ ధరకే పాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డెయిరీలను పునఃప్రారంభించి పాలకు గిట్టుబాటు ధర కల్పించాలి. బకాయి ఉన్న పాల బిల్లులను కూడా చెల్లించాలి.

శశిధర్‌ రెడ్డి, సీ.కొడిగేపల్లి, మడకశిర


Updated Date - 2022-06-05T06:07:06+05:30 IST