సీమ ప్రాజెక్టుల కోసం మహాపోరు

ABN , First Publish Date - 2022-12-07T00:04:09+05:30 IST

రాయలసీమలో నిర్లక్ష్యానికి గురవుతున్న నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టీడీపీ ఆధ్వర్యంలో మహాపోరు నిర్వహిస్తామని పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

సీమ ప్రాజెక్టుల కోసం మహాపోరు
శిథిలావస్థకు చేరుకున్న షట్టర్లను పరిశీలిస్తున్న టీడీపీ నేతలు

నెలాఖరు నుంచి పాదయాత్ర

టీడీపీ నేతలు కాలవ, పయ్యావుల

కణేకల్లు, డిసెంబరు 6: రాయలసీమలో నిర్లక్ష్యానికి గురవుతున్న నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టీడీపీ ఆధ్వర్యంలో మహాపోరు నిర్వహిస్తామని పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండల కేంద్రంలోని శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు షట్టర్లను, హెచ్చెల్సీని మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడుతూ, రాయలసీమలో నీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ, అభివృద్ధి లక్ష్యంతో టీడీపీ ఆధ్వర్యంలో నెలాఖరు నుంచి పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. సాగునీటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో అనేక ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు జీవనాడి అయిన హెచ్చెల్సీ ఆధునికీకరణ పట్ల ప్రభుత్వం తాత్సారం వహిస్తోందని, ఈ కారణంగా రాయలసీమలోని మూడు జిల్లాల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఫ హెచ్చెల్సీ ఆధునికీకరణ కోసం 2005లో బొమ్మనహాళ్‌ నుంచి అనంతపురం వరకు తామిద్దరం సైకిల్‌ యాత్ర చేశామని, ఫలితంగా అప్పటి ప్రభుత్వం హెచ్చెల్సీ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసిందని కాలవ శ్రీనివాసులు గుర్తు చేశారు. కానీ కాంట్రాక్టర్లు సరిగా పనిచేయనందున కాంట్రాక్ట్‌ను రద్దు చేశారని అన్నారు. టీడీపీ హయాంలో పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి, మరమ్మతులు చేశామని, రైతులకు నీటిని సక్రమంగా విడుదల చేసేందుకు కృషి చేశామని అన్నారు. కానీ వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా విదల్చలేదని మండిపడ్డారు. హంద్రీనీవా కాలువ వెడల్పు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, పొలాలకు నీరు చేరడం లేదని విమర్శించారు. కర్నూలులో వైసీపీ పోరు గర్జన విఫలమవ్వడం.. ఈ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. హెచ్చెల్సీ పరిధిలో షట్టర్లను కూడా మరమ్మతు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రభుత్వం మెడలు వంచి, రాయలసీమ ప్రాజెక్టులను అభివృద్ధి చేయిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ దేవినేని పురుషోత్తం, మండల కన్వీనర్లు లాలెప్ప, హనుమంతరెడ్డి, ఆనంద్‌, షేక్‌ ఫకృద్దీన, ఆది, వేలూరు మరియప్ప, రాఘవేంద్ర గుప్తా, ఎంపీటీసీ నరేంద్ర, జయరామ్‌చౌదరి, అనిల్‌, మారుతి, చంద్రశేఖర్‌ గుప్తా, నాగరాజు, బీటీ రమేష్‌, షేక్‌ ముజ్జు, నాగభూషణం, నవీన, ఈరప్ప, వరుణ్‌, ప్రకాష్‌, విజయ్‌, యల్లప్ప, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:04:10+05:30 IST