తపాలా ఉద్యోగుల వెతలు తీరేనా?

ABN , First Publish Date - 2022-06-25T05:43:53+05:30 IST

తపాలాశాఖలో అలవెన్సులు, జీత భత్యాలు గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తపాలా ఉద్యోగుల వెతలు తీరేనా?
తపాలాశాఖ ప్రధాన కార్యాలయం

మూడు నెలలుగా కదలని ఫైళ్లు

ఇబ్బంది పడుతున్న సిబ్బంది


అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూన 24: తపాలాశాఖలో  అలవెన్సులు, జీత భత్యాలు గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయడంతో కడప జిల్లా సూపరింటెండెంట్‌కు అనంతపురం జిల్లా ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఆయన జిల్లాకు రాకపోవడంతో పలు ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయి.  తాజాగా ఆ శాఖకు నూతన సూపరింటెండెంట్‌ రావడంతో ఆ ఉద్యోగుల్లో సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశలు రేకెత్తుతున్నాయి. 


మూడు నెలలుగా ఉద్యోగుల బిల్లులన్నీ పెండింగ్‌..

గత ఇనచార్జ్‌ సూపరింటెండెంట్‌ నిర్లక్ష్యం కారణంగా గత మూడు నెలలుగా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి.  పీఎఫ్‌, జీపీఎఫ్‌, అడ్వాన్సలు, మెడికల్‌ బిల్లులు, సెలవు రోజుల్లో పనులు చేసిన పోస్ట్‌మెనలకు సంబంధించిన వేతనాలు తదితర సమస్యలతో బాధిత వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగులు పీఎఫ్‌, జీపీఎఫ్‌ కోసం ఫైళ్లు పెట్టుకున్నప్పటికీ సూపరింటెండెంట్‌ అందుబాటులో లేకపోవడంతో మూడు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు  వైద్యఖర్చుల కోసం పెట్టుకున్న మెడికల్‌ బిల్లుల సంగతి సరేసరి. ఇలా ఏ ఫైలు కదలాలన్నా సూపరింటెండెంట్‌ సంతకం కావాల్సి రావడం, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడ్డారు. 


మెయిల్‌ ఓవర్స్‌  పరిస్థితి మరీ దారుణం...

పల్లెటూళ్లలో మెయిల్‌ఓవర్స్‌(సహాయకులు)గా విధులు నిర్వహిస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మూడేళ్లుగా టీఏ బిల్లులు రాక ఆ వర్గాలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాయి. తాజాగా ఆ శాఖ ఆ ఉద్యోగులకు సంబంధించిన మూడేళ్ల బిల్లులకు ఆమోదం తెలిపింది. అయితే ఆ బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని పొందాలంటే... ఆ శాఖ సూపరింటెండెంట్‌ అనుమతి తప్పనిసరి కావడంతో ఆ వర్గాలూ నిట్టూరుస్తున్నాయి. ఆ శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... ఒక్కో మెయిల్‌  ఓవర్‌కు రూ. లక్ష వరకూ బిల్లులు రావాల్సి ఉన్నాయి. ఈ విషయంలో నూతన సూపరింటెండెంట్‌ అయినా స్పందించి అలవెన్సులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-25T05:43:53+05:30 IST