భయం.. భయం..

ABN , First Publish Date - 2022-10-18T05:09:10+05:30 IST

భారీ వర్షాలకు ఇప్పటికే ఉధృతంగా మరువలు పోతున్న చెరువులకు లీకేజీలు ఏర్పడడం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

భయం.. భయం..

సూరప్పకుంట, భోగసముద్ర చెరువులకు లీకేజీలు

ఆందోళనలో లోతట్టు కాలనీల ప్రజలు

హిందూపురం అర్బన/పెనుకొండ టౌన, అక్టోబరు 17: భారీ వర్షాలకు ఇప్పటికే ఉధృతంగా మరువలు పోతున్న చెరువులకు లీకేజీలు ఏర్పడడం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. చెరువుల దిగువన నివాసముంటున్న ప్రజలు ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయం.. భయంగా కాలం వెల్లదీస్తున్నారు. హిందూపురం పట్టణ పరిధిలోని సూరప్పకుంట చెరువుకు లీకేజీలు ఏర్పడడంతో పురం వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. పెనుకొండ పరిధిలోని భోగసముద్ర రాయల చెరువు నీరు శ్రీరాములయ్య కాలనీలోని ఇళ్లలోకి చేరింది. చెరువు తెగితే కాలనీ మునుగుతుందని ప్రజలు భయపడిపోతున్నారు. పెన్నా నది జలాలు జిల్లాలో మొదటగా వచ్చి చేరేది సూరప్ప కుంటకే. ఈ చెరువు 650 సంవత్సరాల క్రితం నిర్మించారు. గతంలో ఏటా వర్షాకాలం చెరువులు నిండేవి. కొన్నేళ్లుగా చుక్క కూడా రాలేదు. దీంతో చెరువులు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కట్టకు వేసిన రాళ్లు దెబ్బతిన్నాయి. వంద ఎకరాల పైబడి విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది. ఇటీవలిగా కురుస్తున్న వర్షాలకు సూరప్పకుంట నిండి, నాలుగైదు సార్లు మరువ పారింది. చెరువుకు లీకేజీ ఏర్పడి, నీరు విడుదలవుతోంది. నంది సర్కిల్‌ నుంచి పాండురంగనగర్‌ వరకు లీకేజీ అవుతూనే ఉంది. చెరువుకు గండి పడితే దాదాపు సగం హిందూపురం మునిగిపోతుంది. చెరువు కింద ఉన్న పాండురంగ నగర్‌, బాపూజీనగర్‌, ధర్మపురం, నేతాజీనగర్‌, ముక్కడిపేట, ఆబాద్‌పేట, త్యాగరాజ నగర్‌, ధనలక్ష్మీరోడ్డు, హస్నాబాద్‌, శ్రీనివాస టాకీస్‌ రోడ్డు, శాంతినగర్‌, ఆర్టీసీ కాలనీ, దోభీఘాట్‌ తదితర ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతాయి. లీకేజీ విషయం తెలుసుకున్న ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. అసలే ఈ ఏడాది అధిక వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో పురం అతలాకుతలమైంది. ఇలాంటి తరుణంలో సూరప్ప కుంటకు గండి పడితే పరిస్థితి ఏంటన్న భయం పట్టణ వాసులను వెంటాడుతోంది. అధికారులు కూడా ఇసుకను సిద్ధం చేసుకున్నారు.


ఎయిర్‌ క్రాక్‌ మామూలే: వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌

చెరువుకు ఎయిర్‌ క్రాక్‌ రావడం సాధారణమే. భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం. అయినా ముందస్తుగా ఇసుక సిద్ధంగా ఉంచాం.

Updated Date - 2022-10-18T05:09:10+05:30 IST