ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారుల పహారా

ABN , First Publish Date - 2022-12-07T00:00:10+05:30 IST

స్థానిక మండల కాంప్లెక్స్‌ సమీపాన 271-2, 4 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలంలో ఇళ్ల పట్టాల పేరుతో సాగుతున్న అక్రమ నిర్మాణాలపై ‘బిల్లుల బదులు స్థలాలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది.

ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారుల పహారా
అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్న జనసేన నాయకులు

గోరంట్ల, డిసెంబరు 6: స్థానిక మండల కాంప్లెక్స్‌ సమీపాన 271-2, 4 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలంలో ఇళ్ల పట్టాల పేరుతో సాగుతున్న అక్రమ నిర్మాణాలపై ‘బిల్లుల బదులు స్థలాలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఆ స్థలంలో అక్రమ కట్టడాలను అరికట్టే దిశగా రాత్రింబవళ్లు పహారా కాయడానికి రెవెన్యూ అధికారులను నియమించారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాలను అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకుని, ఇతరులకు విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకుంటుండటంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ రంగనాయకులు.. పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐ సుబ్బరాయుడుకు సూచించారు. ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టకుండా 24 గంటలు కాపలా కాసేలా 9 మంది రెవెన్యూ సిబ్బందిని నియమించారు. ఆ మేరకు వీఆర్వోలు అనిల్‌కుమార్‌, చంద్రకళ, మహ్మద్‌ మన్సూర్‌, వీఆర్‌ఏలు నరసింహులు, ఆంజనేయులు, ప్రభావతి, వినోద్‌కుమార్‌, శివకుమార్‌, మల్లాపల్లి నరసింహులు వారికి కేటాయించిన వేళల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన పునాదులను తొలగించి, చదునుచేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడానికిగాను ఎస్‌ఐ బాబు, పోలీసు సిబ్బందిని తహసీల్దార్‌ కార్యాలయానికి పిలిపించారు. ఎక్స్‌కవేటర్‌ అందుబాటులో లేకపోవడంతో అధికారులు మిన్నకుండిపోయారు. వైసీపీ నాయకుల ప్రమేయంతోనే ఎక్స్‌కవేటర్లను పంపడానికి వాటి యజమానులు ముందుకు రావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జనసేన ఆందోళన

గోరంట్లలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను వైసీపీ నాయకులు ఆక్రమించి, పునాది నిర్మాణాలు చేపడుతుండటంపై జనసేన పార్టీ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆక్రమిత స్థలంలో పర్యటించి, వివరాలను అడిగి, తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ముందు బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు వారాలుగా కార్యాలయం పక్కనే వైసీపీ నాయకులు ప్రభుత్వ స్థలంలో తిష్టవేసి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. ఆక్రమణదారులపై కేసు పెట్టి, వెంటనే అరెస్టు చేయాలని రెవెన్యూ అధికారులను డిమాండ్‌ చేశారు. లేదంటే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్‌ రంగనాయకులు.. ఆందోళనకారుల వద్దకొచ్చి, మాట్లాడారు. అక్రమ నిర్మాణాలను ఆపేశామనీ, విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అనంతరం తహసీల్దార్‌కు వారు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి సురేష్‌, సంయుక్త కార్యదర్శి వెంకటేశ, మండల కన్వీనర్‌ సంతోష్‌, నాయకులు యోగానందరెడ్డి, అనిల్‌యాదవ్‌, నరే్‌షయాదవ్‌, నాగేష్‌, శ్రీనివాసులు, తిరుపాల్‌, బాబర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:00:14+05:30 IST